Tollywood : తెలుగు చిత్ర పరిశ్రమను ‘ టాలీవుడ్’ అని పిలుస్తారని అందరికీ తెలుసు. మరి ఆ పేరు ఎలా వచ్చింది? నిజానికి బెంగాళీ చిత్ర పరిశ్రమను కూడా ‘టాలీవుడ్’ అని పిలుస్తారు. కలకత్తాలోని టాలీగంజ్ ఏరియాలో బెంగాళీ చిత్ర పరిశ్రమ ఎక్కువగా కేంద్రీకృతం కావడంతో టాలీవుడ్ అనే పేరు వచ్చింది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ, ‘టాలీవుడ్’ పేరుని కబ్జా చేసింది. తెలుగు, హాలీవుడ్ రెండూ కలిపి టాలీవుడ్ అనే పేరు పెట్టారు.
బాలీవుడ్ అనే పేరు రావడానికి ముందే తెలుగు చిత్ర పరిశ్రమకు ‘టాలీవుడ్’ అనే పేరు ఉంది. 1950ల్లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ పురుడు పోసుకుని, వేర్లు ఊనుకుంటున్న దశలోనే ‘టాలీవుడ్’ అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే భారత్‌లో ఉన్న మిగిలిన సినీ పరిశ్రమలకు వచ్చిన పేర్లు దాదాపు ఏరియా పేర్ల నుంచే వచ్చాయి. తమిళ చిత్ర పరిశ్రమను ‘కోలీవుడ్’ అని పిలుస్తారు. కారణం కోలీవుడ్ షూటింగ్స్ అన్నీ ఎక్కువగా కొడంబాకం ఏరియాలోనే జరుగుతాయి. ఆ ఏరియా పేరు నుంచి K అనే అక్షరాన్ని తీసుకున్నారు.
బొంబాయిలో షూటింగ్ జరుగుతుండడంతో హిందీ చిత్ర పరిశ్రమను ‘ బాలీవుడ్’ అంటారు. అయితే కన్నడ చిత్ర పరిశ్రమను మాత్రం వినూత్నంగా సాండల్‌వుడ్ అంటారు. కన్నడ సీమ నుంచి ఎక్కువ ‘సాండల్’ ఉత్పత్తి అవుతుండడంతో ఇలా ‘సాండల్‌వుడ్’ అనే పేరు వచ్చింది. మలయాళ చిత్ర సీమను ‘మాలీవుడ్’ అని పిలుస్తారు. తెలుగులాగే, అక్కడ మల్లు భాషతో మాలీవుడ్ అనే పేరు పెట్టారు. బెంగాళీ చిత్ర పరిశ్రమకు, తెలుగు చిత్ర పరిశ్రమకు రెండింటికీ టాలీవుడ్ అనే పేరు ఉన్నా, ‘టాలీవుడ్’ అంటే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తుకు వచ్చేది తెలుగువాళ్లే. అదీకాకుండా బెంగాల్లో విడుదలయ్యే సినిమాల్లో మెజారిటీ శాతం తెలుగు నుంచి రీమేక్ అయ్యేవే..