From Chennai to Hyderabad : చెన్నై నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ, హైదరాబాద్‌కి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది?
టాలీవుడ్‌కి సెంటర్ హైదరాబాద్. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన మెజారిటీ స్టూడియోలు, నటీనటుల ఇళ్లు, ల్యాబ్స్ అన్నీ ఇక్కడే కొలువై ఉన్నాయి. అయితే నిజానికి హైదరాబాద్ కంటే ముందు చెన్నై, తెలుగు చిత్ర పరిశ్రమకి పుట్టినిల్లుగా ఉండేదని చాలామందికి తెలీదు.
ఆంధ్ర రాష్ట్రం అవతరించక ముందు తమిళనాడు, ఆంధ్రా రెండూ కూడా మద్రాసు రాజ్యంలో భాగంగా ఉండేవి. తెలంగాణ, హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత కూడా చాలా ఏళ్ల పాటు చెన్నై నుంచే టాలీవుడ్ కార్యకలాపాలు సాగుతూ ఉండేవి..
అయితే కోలీవుడ్, టాలీవుడ్ ఒకే దగ్గర ఉండడంతో అనేక సమస్యలు, ఇబ్బందులు వచ్చేవి. దీంతో మనకంటూ ఓ రాష్ట్రం ఉండగా, పొరుగు రాష్ట్రంలో పని చేస్తూ కష్టపడాల్సిన ఖర్మ మనకి ఎందుకు అని తెలుగు చిత్ర పరిశ్రమను చెన్నై నుంచి హైదరాబాద్‌కి మార్చారు టాలీవుడ్ పెద్దలు..
దాసరి నారాయణ రావుతో పాటు అప్పటి రాష్ట్ర సమాచార ప్రసార శాఖ మంత్రి కొండా రంగారెడ్డి ఆధ్వర్యంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ, హైదరాబాద్ కేంద్రంగా చేసుకుంది.
1956లో హైదరాబాద్‌లో సారథి స్టూడియో, భాగ్యనగర్ స్టూడియోలను నిర్మించారు. అయితే అప్పటికే టాలీవుడ్ ప్రముఖులంతా చెన్నైలో ఇళ్లు కట్టుకుని సెటిల్ అయ్యారు.. దీంతో చాలా కాలం పాటు చెన్నైలోనే షూటింగ్స్‌లు జరిగేవి.
హైదరాబాద్‌లో సెటిలైన అక్కినేని నాగేశ్వరరావు, చెన్నైలో షూటింగ్లో పాల్గొని ఇంటికి రావడం ఇబ్బందిగా ఉండేది. దీంతో తనతో సినిమా చేయాలంటే హైదరాబాద్‌లోనే షూటింగ్‌లు చేయాలని షరతులు విధించారు.
హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి, సినీ పరిశ్రమకు చెందినవారికి హైదరాబాద్‌లో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అప్పట్లో జూబ్లీహిల్స్ ఏరియా గుట్టలుగా ఉండేది.
చెన్నై నుంచి వచ్చి, హైదరాబాద్‌లో చాలా హీరోలు సెటిల్ అయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు సొంతంగా అన్నపూర్ణ స్టూడియో నిర్మించగా రామానాయుడు స్టూడియో, హీరో కృష్ణ సొంతంగా పద్మాలయ స్టూడియో నిర్మించారు.
ఇలా ఒక్కొక్కరుగా చెన్నైలో సెటిలైన వారంతా హైదరాబాద్‌కి మకాం మార్చారు. శోభన్ బాబు వంటి కొందరు హీరోలు మాత్రమే చివరివరకూ చెన్నైలోనే ఉన్నారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమ మరోసారి హైదరాబాద్ నుంచి వైజాగ్‌కి తరలించాల్సి వెళ్తుందా? అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. అయితే అలా జరగలేదు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్ల తర్వాత కూడా రాజధాని లేకపోవడంతో పాటు సినీ పరిశ్రమకు కావాల్సిన సదుపాయాలు కూడా సరిగ్గా లేకపోవడంతో హైదరాబాద్, టాలీవుడ్‌కి కేంద్రంగా కొనసాగుతోంది.
ఈ కారణంగానే ఏపీలో కనీసం 40 శాతం షూటింగ్ చేసే సినిమాలకు మాత్రమే టికెట్ల రేట్లు భారీగా పెంచడానికి అవకాశం ఇస్తామని చెబుతూ వచ్చింది వైసీపీ ప్రభుత్వం..
అయితే అవసరాలు, సౌకర్యాలు కల్పించకుండా ఏపీలో షూటింగ్ చేయమంటే ఎలా కుదురుతుందని టాలీవుడ్ పెద్దలు చెబుతూ వచ్చారు.. ఒకవేళ ఈసారి టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే ఈ విషయం గురించి మరోసారి చర్చ జరగవచ్చు.
అమరావతిలో సినీ రంగం అభివృద్ధి జరిగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు నగరాలు.. టాలీవుడ్‌కి కేరాఫ్ అడ్రెసుగా మారొచ్చు. అయితే అప్పుడు తెలుగు సినీ పరిశ్రమను ఒకటిగా ఉంచుతారా? తెలంగాణ, ఆంధ్రా అని రెండు ముక్కలు చేస్తారా? అనే భయం కూడా టాలీవుడ్ అభిమానుల్లో ఉంది..
Eat After Walking : ఇవి తింటే మీరు హ్యాపీగా వాకింగ్ చేసుకోవచ్చు..