Nellore Chepala Pulusu : హైదరాబాద్ బిర్యానీ, కాకినాడ కాజా, తాపేశ్వరం పూత రేకులు.. ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఫుడ్ ఐటమ్ ఫేమస్. ఇక నెల్లూరుకి వచ్చే సరికి చేపల పులుసు ఫేమస్. అసలు ఆ పేరే “నెల్లూరు చేపల పులుసు” అని ఓ బ్రాండ్ లాగా ఉండిపోయింది. అసలు చేపల పులుసు పుట్టిందే నెల్లూరులో అని అంటుంటారు. నెల్లూరు.. నెల్లూరు.. అని అంటుంటేనే నోట్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి కదా.. కానీ ఈ మధ్య ప్రతి ఒక్కరు నెల్లూరు చేపల పులుసు అని చాలా రకాలుగా చేస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర మసాలాలు అన్ని వేస్తున్నారు. నెల్లూరు చేపల పులుసులో అవి ఏవి ఉండవు, ఇప్పుడు మనం అసలైన నెల్లూరు చేపల పులుసు గురించి తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు..
* చేపలు 1KG (దీనికి శీలావతి అయితే బాగుంటుంది లేదా మీకు దొరికే ఏ చేపలు అయిన తీసుకోండి)
* ఆయిల్ (ఈ పులుసుకి కొంచెం ఎక్కువే పడుతుంది)
* ఉల్లిపాయలు 4
* చింతపండు 100 గ్రాములు (నానబెట్టి పక్కన పెట్టుకోవాలి)
* రెండు టమాటాలు
* ఒక మామిడి కాయ
* కారం 5 టేబుల్ స్పూన్లు (కారం ఎక్కువే పడుతుంది)
* కల్లుప్పు రుచికి సరిపడినంత
* చిటికెడు పసుపు
* కరివేపాకు నాలుగు రెమ్మలు
ఈ కొలతలన్నీ మొత్తం కేజీకి సంభందించినవి. మీరు అంతకంటే ఎక్కువ చేసుకునేటప్పుడు కొలత చూసుకొని వేసుకోండి, ఎందుకంటే కొలతలు కరెక్ట్ గా ఉంటేనే రుచి పర్ఫెక్ట్ గా వస్తుంది మరీ.. ఇందులో మనం పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాంటి గరం మసాలాలు వాడటం లేదు. ఎందుకంటే మనం చేసేది అసలైన నెల్లూరు చేపల పులుసు కాబట్టి.
తయారు చేసే విధానం..
ముందుగా చేపలు అన్నిటిని క్లీన్ చేసి పక్కన పెట్టుకొని, ఈ చేపల పులుసుని మట్టి ముకిడిలో చేసుకుంటే దాని రుచి రెట్టింపు అవుతుంది. అది లేని వాళ్ళు మందపాటి వెడల్పు గిన్నె లాంటిది పెట్టుకోండి. వెడల్పుగా ఉంటే ముక్కలు చెల్లాచెదురవ్వకుండా ఉంటాయి.
ఆయిల్ వేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసిన రెండు టమాట ముక్కలు కూడా వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత, కారం, పసుపు, ఉప్పు, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. అన్ని బాగా కలిసిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని తీసి అందులో వేసుకోవాలి. మొత్తం కలిపి ఒక పది నిమిషాలు మరిగించుకోవాలి.
ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న చాప ముక్కలన్నీ అందులో సర్దుకోవాలి. అన్ని ఒకేసారి వేయకూడదు, ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇంక మీరు ఇందులో ఎలాంటి గరిట పెట్టకుండా అంత రెండు వైపులా పట్టుకొని తిప్పుతూ ఇంకొక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. దింపడానికి 5 నిమిషాలు ముందు మామిడికాయ ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి.
ఇప్పుడు ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపడ ఉన్నాయేమో చూసుకొని సరిపోకపోతే.. కొంచెం కారం ఉప్పు వేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే.. అసలుసిసలైన నెల్లూరు చేపల పులుసు రెడీ. దీన్ని వేడివేడిగా తినే కంటే 4,5 గంటల తర్వాత వేడి వేడి అన్నంలో తింటే అబ్బా.. ఆ రుచి మాటల్లో చెప్పలేం అనుకోండి.. ట్రై చేయాల్సిందే..
కమ్మనైన కర్ణాటక బిసిబెలే బాత్..
Note: మీరు కావాలనుకుంటే కొత్తిమీర, ఫిష్ మసాలా వేసుకోవచ్చు కానీ, అది అప్పుడు నెల్లూరు చేపల పులుసు అవ్వదు. ఇందులో టమాటా పులుపు, చింతపండు, మామిడికాయ మూడు రకాల పులుపులు తప్పకుండా ఉండాలి.