Palathalikalu : వినాయక చవితి వచ్చిందంటే చాలు.. పాలతాలికలు లేనిదే పండగ అవ్వదు. ఈ పాలతాలికలు ఒక వినాయక చవితినే కాదండోయ్, ఆడపిల్ల పెద్దమనిషి అయినప్పుడు (Mature) ప్రెగ్నెంట్ అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా పాలతాలికలను ఇచ్చి పంపిస్తూ ఉంటారు. పాలతాలికలు అంత శుభమని నమ్ముతారు. మరి ఆ పాలతాలికలకు కావాల్సిన పదార్థాలు అలానే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా..
కావలసిన పదార్థాలు :
* రెండు కప్పుల బియ్యప్పిండి
* ఒక కప్పు వాటర్
* రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం
* అరకేజీ బెల్లం తురుము
* అర లీటర్ పాలు
* నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు
* అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి
* కిస్మిస్ జీడిపప్పు పలుకులు (మీ ఇష్టం(
తయారీ విధానం..
ముందుగా సగ్గుబియ్యంలో కొంచెం వాటర్ వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే బెల్లంలో కొంచెం వాటర్ వేసి బెల్లం కరిగి పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు నీళ్లలో చిటికెడు ఉప్పు, కొంచెం బెల్లం వేసి నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఆ మిశ్రమం అంతా దగ్గర పడిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి గోరువెచ్చగా చేతికి నెయ్యి లేదంటే పొడి బియ్యప్పిండి అంటిస్తూ తాలికల్లా చేసుకోవాలి.
అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత, ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు పోసి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసి పాలు ఒక పది నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు అందులో ముందుగా చేసుకున్న తాళికలు కూడా వేసి ఇంకొక పది నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత యాలకుల పొడి వేసి బాగా కలిపి ముందుగా చేసి పక్కన పెట్టుకున్న బెల్లం పాకాన్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేగించుకొని అందులో కలుపుకుంటే సరిపోతుంది. అంతే ఎంతో రుచిగా ఉండే వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాలతాలికలు రెడీ.
Note : పాలతాలికులు వేడిగా ఉంటే బెల్లం పాకం చల్లారిపోవాలి, బెల్లం పాకం వేడిగా ఉంటే పాలతాలికలు చల్లారాలి రెండు వేడిగా ఉన్నప్పుడు వేస్తే పాలతాలికలు విరిగిపోయే ప్రమాదం ఉంది.