Karthika pournami 2023 : ఏ రోజున కార్తీక పౌర్ణమి జరుపుకోవాలనేది సందేహాన్ని మిగులు తగులు అని అంటారు. దీనికి పెద్దగా కంగారు పడవలసిన పని లేదు. సహజంగా చంద్రునికి సంబంధించిన పండుగలలో వేద నిర్ణయం ప్రకారం రాత్రులకు ప్రాధాన్యత ఉంటుంది. అంటే దీపావళిని ఖచ్చితంగా ఆరోజు రాత్రి సమయంలో అమావాస్య తిథి కలిగి ఉన్న రోజున మాత్రమే జరుపుకొని తీరాలి, అదేవిధంగా పౌర్ణమి కూడా. రాత్రిపూట స్థిరంగా ఉండే తిథిని ప్రామాణికంగా తీసుకుని తీరవలసిందే.
ఇక్కడ ప్రత్యేకించి గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇతర పండుగలు జరుపుకుంటున్నట్లు, సూర్యోదయంలో ఉన్న తిథికి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాన్ని మనం మరచిపోవాలి. మరో ముఖ్య విషయం ఏమిటంటే.. కృత్తిక నక్షత్రం పౌర్ణమి తిథిలో కలిగి ఉన్న మాసాన్ని కార్తీక మాసం అంటారనే విషయం మనకు తెలిసిందే. కాబట్టి కార్తీక పౌర్ణమి ఖచ్చితంగా 26వ తేదీన ఆదివారం రాత్రి మాత్రమే జరుపుకోవాలి. తరువాత రోజు అంటే సోమవారం రాత్రికి జరుపుకుంటే రెండవ చంద్రుడు అవుతాడు, కృష్ణపక్షం వచ్చేస్తుంది.
27 సోమవారం కూడాను, మరో లెక్క ప్రకారం కార్తీక మాసం 15వ రోజు కూడా అవుతుంది. కాబట్టి వత్తులు వెలిగించాలి అనుకునేవారికి మాత్రం 27 వ తేదీ మధ్యాహ్నం లోపు నిరాహారంగా ఉండి, ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయవచ్చును. అదేవిధంగా నోములు, తోరాలు ఉన్నవారు కూడా 27 సోమవారం మధ్యాహ్నం లోపు ఆ కార్యక్రమాన్ని చేపట్టవచ్చు. పౌర్ణమి తిథి ఉంటుంది కాబట్టి.. 26 తేదీ ఆదివారం సాయంత్రం కూడా నోములు, వ్రతాలు చేసుకోవచ్చు ఆక్షేపణ లేదు.
పెద్దగా ఇందులో సందేహించాల్సిన పని లేదు. మనం భగవంతునికి ఆత్మ నివేదన చేసుకోవాలి. తద్వారా చేసినటు వంటి ఏ కార్యక్రమమైనా భగవంతునికి ప్రీతిపాత్రమే. నిరంతర నామస్మరణతో సర్వేశ్వరుడు మనతోనే ఉంటారు.