Varalakshmi Vratam : హిందూ సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. తెలుగు సంవత్సరంలో 12 మాసాలలో 5వ మాసంగా ఉన్న ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణా నక్షత్రంలో సంచరించటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసంగా పేరు వచ్చింది. శ్రావణమాసం వచ్చిందంటే చాలు పిల్లల నుంచి పెద్దల వరకు ఆనందించని వాళ్లు ఉండరు. నూతన వధూవరులకు, గృహస్తులకు, బ్రహ్మచారులకు, గృహస్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్నిస్తుంది శ్రావణమాసం.
ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు పండితులు. ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు వర్ష ఋతువు అనగా.. శ్రావణ, భాద్రపద మాసముల కాలం. ఈ సమయంలో వేదధ్యాయన కాలంగా చెప్పబడినది అసలు ‘శ్రావణ’మనే ఈ మాసము నామమునందు వేద కాలమనే అర్థము ఉన్నది. శ్రావణమనగ ‘వినుట’అని అర్ధం.
వేదములు గ్రంథములు పఠనం చేసేది కాదు విని నేర్వదగినది. దీనిని వినిపించువాడు గురువు విని నేర్చుకున్న వారు శిష్యుడు. ఈ వేదమునకే ‘స్వాధ్యాయా’ అనే మరో నామం. ఈ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం ఎంతో విశిష్టమైనది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు కుదరిని వాళ్లు శ్రావణమాసంలో వచ్చే మిగతా శుక్రవారంలో ఏదైనా ఒక వారం ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మి దేవి మొక్క ప్రతిమను అలంకరించి పూజ చేయాలి.
ముత్తైదులను పిలిచి తాంబూలం ఇవ్వాలి. ఈ పూజ వలన సౌభాగ్యం, సంతోషం, ధన ధాన్యములతో వర్ధిల్లుతారని వేద పండితులు చెప్తూ ఉంటారు. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతి దేవికి సూచించి సౌభాగ్యం మాంగళ్య బలాన్ని వివరించినట్లు చెప్తారు. లక్ష్మీదేవి శుభప్రదమైన శుక్రవారం అంటే చాలా ఇష్టమని స్త్రీ సూక్తం తెలియజేస్తుంది. ఈ వ్రతం మొదటిసారి చేస్తున్న వాళ్లకి ఎలా చేయాలి ఏంటి అని వివరంగా తెలుసుకుందాం..
ముందు పూజ గదిని శుభ్రం చేసుకొని తర్వాత కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న వస్త్రములు ఆభరణములతో అమ్మవారిని అలంకరించుకొని అరిటాకు మీద కొన్ని బియ్యం పోసి దాని మీద కలశం ఉంచండి. గణపతి పూజ మరియు వరలక్ష్మి పూజతో ప్రారంభమయ్యే ఈ వ్రతానికి తాజా పువ్వులు మరియు ధాన్యంతో పూజ జరుగుతుంది. పూజ సమయంలో 9 ముడులతో పసుపు దారాలను, లక్ష్మీ పీఠం ముందు ఉంచి పూజ చేయాలి.
ఈ తోరణాలు పూజ ప్రారంభంలో లేదా పూజ ముగించే లోపు పూజలో పాల్గొనే మహిళలు మణికట్టుకు ఈ పసుపు దారం కట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదం ఇస్తుందని నమ్ముతారు. పూజ సమయంలో మీరు సిద్ధం చేసిన పిండి వంటలు, ఉడికించిన సెనగలు, బెల్లం, స్వీట్స్ (బియ్యంతో తయారు చేసినవి) చలిమిడి మరియు పండ్లు నైవేద్యాలన్నీ అరిటాకులో పెట్టి పూజా సమయంలో దేవత ముందు ఉచాలి. తర్వాత ఈ ప్రసాదం ఆహ్వానితులు, పిల్లలు మరియు మహిళలకు ఇంట్లో ఉన్నవారు భుజించవచ్చు.
వ్రతం పాటించేవారు ప్రసాదం మాత్రమే తీసుకొని సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. సాయంత్రం హారతితో పూజను ముగిస్తారు. తర్వాత ముత్తయిదులను ఇంటికి పిలిచి వాళ్లకి పసుపు రాసి వాయనం ఇస్తారు. ఈ వాయునంలో ముఖ్యంగా తమలపాకులు అరటి పళ్ళు ఒక్క పువ్వు గాజులు ఉండాలి. ఇంకా తర్వాత మిగిలినవి ఇచ్చేవాళ్ళ స్తోమతని బట్టి ఉంటుంది. ఈ వ్రతం ఆచరించిన వాళ్లు కష్టాలు, బాధల నుండి విముక్తి పొందుతారని చెప్తుంటారు. ఈ వ్రతం చేసిన రోజు ఒంటిపూట భోజనం చేసి కింద నిద్రించాలి.