Virat Kohli – Rohit Sharma : భారత క్రికెట్‌లో, అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్ గెలిచిన సంబరాల్లో భారత జట్టు ఉండగానే, అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. రోహిత్ 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాతి ఏడాది విరాట్ కోహ్లీ టీమ్‌లోకి వచ్చాడు. ఈ ఇద్దరూ కూడా టీ20ల్లో 4 వేలకు పైగా పరుగులు చేసి.. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లుగా ఉన్నారు..
రోహిత్ శర్మ, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచి రిటైర్మెంట్ ఇచ్చాడు. అలాగే టీ20ల్లో అత్యధిక సిక్సర్లు, కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచి రిటైర్ అయ్యాడు. విరాట్ కోహ్లీ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు, అత్యధిక టీ20 యావరేజ్ కలిగిన బ్యాటర్‌గా పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు..
T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు చారిత్రాత్మక విజయం
2008లో అండర్19 వన్డే వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన విరాట్ కోహ్లీ, 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అన్ని ఐసీసీ టైటిల్స్ గెలిచిన ఏకైక ప్లేయర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 వరల్డ్ కప్ గెలిచినా వీళ్లు అండర్19 వరల్డ్ కప్ గెలవలేదు. యువరాజ్ సింగ్ అండర్19 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ గెలిచాడు కానీ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఆడలేదు.