Telugu Story : అదో అందమైన Black and White Painting. ప్రపంచంలోని అందాన్ని అంతా ఒక్కచోట చేరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ పెయింటింగ్
ఆ పెయింటింగ్ ని చూస్తున్న ప్రతి ఒక్కరికీ.. ఆ పెయింటింగ్ తమతో ఏదో మాట్లాడుతుందన్న అనుభూతి కలుగుతుంది. అదే విషయాన్ని ఆ ఆర్టిస్ట్ కి కూడా చెప్పారు.
అందరూ తన పెయింటింగ్ గురించి పొగుడుతుంటే ఆ ఆర్టిస్ట్ చాలా గొప్పగా, గర్వంగా ఫీల్ అయ్యేవాడు. అందరికీ ఇది నా పెయింటింగ్.. నా పెయింటింగ్ ఇది.. అని గొప్పగా చెప్పేవాడు.
అయితే కొన్ని రోజులకు ఆ ఆర్టిస్ట్ కి ఈ పెయింటింగ్ తన దగ్గర ఉండే కన్నా.. ఒక పెద్ద బంగళాలో ఉంటే మరింత అందం, విలువ పెరుగుతాయనే ఆలోచన వచ్చింది. ఈ విషయాన్ని ఆ ఊరిలో కొంతమంది పెద్దలకి చెప్పాడు.
ఆ ఊరి ధనవంతుల్లో ఒకరైన పెద్దాయనకి విషయం తెలుస్తుంది. తన తమ్ముడు పక్క ఊరిలో ఒక పెద్ద బంగాళా కట్టుకున్నాడు. ఆ పెయింటింగ్ తెచ్చి తమ్ముడికి బహూకరిస్తే ఎలా ఉంటుంది అనుకుంటుండగా.. ఆ తమ్ముడే వస్తాడు అన్నగారిని చూడ్డానికి.
ఒకరికి ఒకరు బాగోగులు అడిగి తెలుసుకున్నాక.. తాను విన్న ఆ పెయింటింగ్ గొప్పదనాన్ని తమ్ముడికి వివరిస్తాడు. అలాగే ఆ పెయింటింగ్ ని చూసి వద్దాంరా అని తీసుకెళ్తాడు. ధనవంతుడు, ధనవంతుడి తమ్ముడు కలిసి ఆ ఆర్టిస్ట్ ఇంటికి వెళ్తారు.
అక్కడ ఆ పెయింటింగ్ చూసిన అన్నదమ్ముళ్లు ఇద్దరూ ఆశ్చర్యంతో అలౌకిక ఆనందానికి లోనవుతారు. ఆ ఆర్టిస్ట్ వాళ్ళు వచ్చిన విషయం తెలుసుకుని సంతోషించి, ఆనందంగా ఆ పెయింటింగ్ ని కానుకగా అందిస్తాడు.
Errani Cheekati Story : ఎర్రని చీకటి..
ఆ అన్నదమ్ములిద్దరూ అది తమకి లభించిన అరుదైన బహుమతిగా భావించి.. ఈ ఊరి నుంచి వారి బంగళాకు మేళతాళాలతో తీసుకెళ్తారు. ఊరూవాడ అంతా ఆ పెయింటింగ్ చూడటానికి వస్తారని సావిడిలో గోడకి పెడతారు.
ఆ పెయింటింగ్ గోడకి పెట్టడంతోనే ఆ బంగళాకు మరింత కళ వచ్చిందని అందరూ పొగుడుతుంటే ఆ అన్నదమ్ములకు ఎంతో ఆనందంగా ఉండేది. రోజూ ఎవరో ఒకరు చూడడానికి రావడం, చూసిన వారికి ఒక్కొక్కరికి ఒక్కో అనుభూతి కలిగేది. కొందరైతే మళ్ళీ.. మళ్ళీ.. వచ్చేవారు. క్రమేణా ఆ ఇంటి పేరు ‘ బహుమతి వారి ఇల్లు ‘ అయింది.
అయితే ఆ పెయింటింగ్ ఆర్టిస్ట్ కి దూరమయ్యానని బాధపడినా, అందరి ఆనందం చూస్తున్న ఆ పెయింటింగ్.. గర్వంగా గోడకి వేళ్లాడుతుంది. కొంచెం బాధ, కొంచెం సంతోషంతో.. ప్రతి ఒక్కరూ చెప్పేది వింటూ ఉంది.
కొన్నాళ్ళకు ఆ బంగళా అందంతో పాటే, ఆ పెయింటింగ్ అందo కూడా తగ్గుతూ వస్తుంది. అది ఎవరు అక్కడ గుర్తించలేదు.. దుమ్ము పట్టిన ఆ పెయింటింగ్ ను తుడిచేవాళ్ళే లేరు.. తుడిస్తే బాగుండునని ఆ పెయింటింగ్ కి కూడా అనుకోలేదు.
ఒక రోజు ఆ బంగళాకి రంగులు వేయడానికి వచ్చిన పెయింటర్ ఈ పెయింటింగ్ చూసి తెగ ముచ్చట పడిపోయి.. దానికి పట్టిన దుమ్మును శుభ్రం చేసి మరోసారి ఆ పెయింటింగ్ చూసి ఆనందంగా నవ్వుకుంటాడు.
* * * *
ప్రతి ఒక్కరూ ఆ పెయింటింగ్ చూసి గొప్పగా చెప్పుకోవాలనుకున్నవాళ్లే కానీ మొదటిసారి ఆ పెయింటింగ్ ని ఆ పెయింటర్ ‘నీకేం కావాలి’ అని అడిగినట్టు అనిపించింది ఆ పెయింటింగ్ కి . ఏం కావాలో అసలు పెయింటింగ్ కి తెలిస్తే కదా చెప్పడానికి..!
ఏం చెప్పాలో తెలిసేది కాదు కానీ ఏదో చెప్పాలి.. ఏం చెప్పాలో తెలియదు, ఎలా చెప్పాలో తెలియదు. ఆ పెయింటర్ అక్కడ పెయింటింగ్ వేయడానికి వచ్చిన ప్రతిరోజూ ఒక టైం ప్రకారం దాని దగ్గరకు వచ్చి కబుర్లు చెప్పేవాడు. కొన్నాళ్ళకి ఆ పెయింటింగ్ కూడా తన అనుభవాలనీ, తన ఆలోచనని ప్రతి ఒక్కటీ చెప్పుకుంటూ వచ్చింది.
అలా కొన్ని రోజుల తర్వాత ఆ పెయింటర్ పెయింటింగ్ తో ప్రేమలో పడ్డాడు. ఆ విషయం చెప్తూ ‘నాతో రా.. ఇద్దరం కలిసి ఎటైనా వెళ్లి పోదాం, ఈ ప్రపంచంలో మనకంటూ మరో ప్రపంచాన్ని సృష్టించుకుందాం’ అన్నాడు.
అది విన్న ఆ పెయింటింగ్, ‘ఈ బంగళా అందం కోసం నేను ఇక్కడ ఉండాలన్నది, నన్ను తీర్చిదిద్దిన ఆర్టిస్ట్ కోరిక, ఈ బంగళా శిథిలావస్థలో ఉన్నప్పుడు వచ్చి, నీతో తీసుకు వెళ్లు’ అంటుంది. అది విన్న తర్వాత ఆ పెయింటర్ ”సరే” అంటాడు.
Rain Rain Go Away : వర్షానికి ఒక కష్టం..
రోజూ ఒక టైం ప్రకారం వచ్చేవాడు కాస్త ఇప్పుడు వీలైన సమయం మొత్తం ఆ పెయింటింగ్ తోనే గడుపుతున్నాడు. ఆ పెయింటర్ చేతిలో పెయింటింగ్ మరింత అందంగా మారడం మొదలైంది. ఇదివరకు ఎన్నడూ లేని అంత ఆనందంగా, అందమైన సీతాకోకలా కొత్త రంగులద్దుకుని ఎంతో.. మరెంతో అందంగా తయారైంది. కాదు.. కాదు అంత అందంగా ఆ పెయింటర్ ఆ పెయింటింగ్ ని తీర్చిదిద్దాడు.
మెల్లిగా ఆ పెయింటింగ్ కూడా ఆ పెయింటర్ కి తన మనసులో మాట చెప్పడం మొదలుపెట్టింది. ఎంత ప్రేమిస్తుందో, ఎన్ని కలలుకంటుందో, అతనితో ఎలాంటి జీవితాన్ని ఊహించుకుందో ప్రతి ఒక్కటీ చెప్పడం మొదలు పెట్టింది. అలా ఆ ఇద్దరు మరింత దగ్గరయ్యారు.
అయితే ఒక రోజు ఆ పెయింటింగ్ కి రంగులద్దుతుంటే పెయింటర్ కి ఒక అనుమానం వచ్చింది. ఇంతకీ ఇది నేను గీసిన బొమ్మ కాదు, కేవలం ఓ అందమైన బొమ్మకు నేను రంగులు వేసాను. దీని ఆర్టిస్ట్ ఎవరు అంటే అక్కడ నా పేరు నేను రాయలేను. ఇది నాది కాదు అనుకున్నాడు.
మరి ఇంతకీ ఆ పెయింటింగ్ ఎవరిదీ..!?
* గొప్పల కోసం స్వార్ధంగా ఆలోచించిన ఆర్టిస్ట్ దా..?
* ఆ పెయింటింగ్ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా తన బంగళాని అందంగా మార్చుకోవాలి అనుకున్న ఆ ధనవంతుడి తమ్ముడిదా..?
* చివరి దశలో కళాహీనంగా మారిన పెయింటింగ్ కి జీవం పోసి.. తనది కాదు అనుకున్న ఆ పెయింటర్ దా..?
చివరకు ఎవరిదీ ఆ పెయింటింగ్….!??
Writer : మీనా రత్న కుమారి,
meenarathnakumari@gmail.com