Rain Rain Go Away : నాలుగు రోజుల నుండి వర్షం పడుతుంది, ఎక్కడ ఆగడం లేదని అనుకుంటూ.. పాకలో ఒక పక్కగా గోని సంచి కింద దాచిన ఎండు గడ్డి తీసి పశువులకు ఏస్తుంది లక్ష్మీ. ఒక సంవత్సరం క్రితం భర్త ఆర్మీలో చనిపోతే వచ్చిన డబ్బు బ్యాంకులో పిల్లాడి కోసం కొంత దాచి.. బతకడానికి రెండు గేదెలు, రెండు ఆవులను కొని వాటి పాలు అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతో ప్రస్తుతం చింత లేకుండా జీవనం సాగిస్తుంది.
తల్లిదండ్రులు, అన్నలు, బంధువులు ఎంత చెప్పినా వినకుండా తన భర్త ఇంట్లోనే ఉంటుంది. ఆమె అంతరంగం వేరు, ఏ బతుక్కి ఆ బతుకు జీవుడా అని సాగిపోతుంటే తను వెళ్ళి వాళ్ళకి భారమవ్వాలి అనుకోలేదు. పైగా బాబు చిన్నపిల్లాడు 5వ తరగతి చదువుతున్నాడు.
Crime Story : క్రైమ్ రిపోర్టర్..
రెండువారల క్రితం పుట్టిన దూడతో వర్షంలో ఆడుతున్న పిల్లాడిని చూసి సంబరపడింది లక్ష్మీ. వర్షం ఎక్కువ అవ్వడంతో అప్పటి వరకు ఆడుతున్న పిల్లాడిని బలవంతంగా లాక్కుపోయింది. తల తుడిచి వేడి వేడి అన్న వండి మగాయపచ్చడి నెయ్యి వేసి గోరుముద్దలు తినిపించి పిల్లాడిని నిద్ర పుచ్చింది.
పిల్లాడు మంచి నిద్రలో ఉండగా పిడుగు పడినట్టు పెద్ద శబ్దం వచ్చింది. ఆ సౌండ్ కి ఉలిక్కిపడి లేచిన పిల్లాడు.. అమ్మ దగ్గర లేకపోవడంతో వెతుక్కుంటూ మంచం దిగేందుకు ప్రయత్నించగా పిల్లాడి కాళ్లకు నీళ్లు తగలడంతో ఉలిక్కిపడి జారి పడిపోయాడు. మోకాళ్ళ లోతు ఉన్న నీటిలో ఒక్కసారి మునక వేసి పైకి లేచాడు.
బట్టలు తడిచిపోయి అమ్మని వెతుకుంటూ వెళ్లిన పిల్లాడికి కిటికీ లోంచి బయటకు దిగులుగా చూస్తూ కనిపించింది లక్ష్మీ. పిల్లాడు కూడా ఆమె పక్కన చేరి, బయటకు చూస్తూ ఉన్నాడు. అప్పటి వరకు దేనికో తగులుకుని ఆపిన తాడు.. ఊడిపోవడంతో నీళ్లలో కొట్టుకుపోతున్న దూడని చూసి కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆ తల్లీకొడుక్కి..
ఇంకా ఆ దూడతో ఆడుతూ ఉన్నట్టే ఉంది. అది ఆటలు ఆడుతూ గెంతడం, తనని ఇష్టంగా నాకడం, తల్లి పొదుగుని పట్టి ముఖంతో కొడుతూ పాలు తాగడం, అన్నీ భలే తమాషాగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ దూడ లేదు. నిన్న పడిన వర్షానికి ఆ దూడ కూడా కొట్టుకు పోయింది. తాడు చిక్కుకుని ఇంకా ఎక్కడైనా ఉందేమో అన్న ఆశతో తల్లితో పాటు డంకలన్నీ తిరిగి చూసాడు కానీ ఎక్కడా కనిపించలేదు.
నీరసంగా వస్తున్న పిల్లాడిని ఆపి.. తన తోటి అమ్మాయి “అరేయ్.. సతీష్ ఈరోజు స్కూల్ లేదు అంట, అక్కడ అంతా నీళ్లు నిలుచుండి పోయాయంట, వెళ్ళడానికి దారి లేదని స్కూల్ లేదని చెప్పారు మాస్టారు. నేనూ మన ఫ్రెండ్స్ అందరం కలిసి మట్టి బొమ్మలు చేస్తున్నాం.. నువ్వు కూడా రారా..” అని లాగుతున్న అమ్మాయి చేయి విదిలించుకుని ముందుకు వెళ్ళిపోయాడు.
ఉన్నది ఇద్దరే అయినా.. తుళ్లుతూ, ఆడుతూ సందడిగా ఉండేవారు. ఇప్పుడు వాళ్లిద్దరి మధ్యన నిశ్శబ్దం ఎదురు చూస్తుంది తనని ఎప్పుడు గెంటేస్తారా అని..
అలా నాలుగు రోజులు గడిచిపోయాయి. స్కూల్ ఓపెన్ అయ్యింది. వెళ్తున్నాడు, వస్తున్నాడు కానీ తోటి వాళ్ళతో మాటలు కానీ ఆటలు కానీ లేవు. వాడికి పొగరని ఆడటానికి రావట్లేదని.. తోటి స్నేహితులు వెలివేశారు.
అన్నీ గమనిస్తున్న తల్లి లక్ష్మీ ఒక రోజు కలిపించుకొని.. చూడు పండు… వర్షం పడటం అనేది ఆ వరుణ దేవుడి ఉద్యోగం. తన ఉద్యోగం తను చేసాడు. కాకపోతే ఏదో ఏమరుపాటుగా ఉండి ఉంటాడు అందుకే ఇంత వర్షం. అయినా అందరూ సక్రమంగా పని చేస్తే ఎంత వర్షం పడినా మనకేం కాదు. చెరువులు, గుంతలు, వాగులు నీళ్లను తనలోకి లాక్కుని ఆపుతాయి. మనకి నీళ్లు అవసరం కానీ వాటిని దాచుకోడం తెలీదు. కాదు.. దాచుకోడానికి ఎలాంటి ప్రయత్నం చేయం.. ఉన్న వాటిని ఉండనివ్వం. ఇంక దూడ అంటావా.. ఆ తల్లికీ, మనకీ అంతే అని చెప్పేసి లేచింది.
అయితే నేను బాగా చదుకుని వర్షం ఆపే ఉద్యోగం తెచ్చుకుంటాను. నా ఉద్యోగం నేను బాగా చేస్తానమ్మ అని కొడుకు అనగా తల నిమిరి లేచి వెళ్ళిపోయింది.
కాసేపు పైకి చూస్తూ.. నీ ఉద్యోగం నువ్వు చేయకుండా వెలగబెట్టిన పని ఏమిటో అని ఆలోచిస్తూ ఉండిపోయాడు సతీష్.
గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు జరిగిన నష్టాన్ని వివరిస్తున్న రాజకీయ నాయకులు, విగత జీవులుగా మిగిలిన జంతువులు, ఆటలాడుతూ రంగురంగుల పడవలు వదులుతున్న పిల్లలు, ఎత్తైన ప్రదేశం నుంచి జారుతున్న కొత్త జలపాతన్ని చూస్తూ కొంతమంది స్విమ్మింగ్ చేస్తున్న ఫోటో చూస్తూ.. పేపర్ తిరగేసిన సతీష్ కి, వరుణదేవుడు ఉద్యోగం సరిగా చేయడం లేదు అనే క్యాప్షన్ తో ఒక కాలమ్ కనిపించింది.
Sr NTR Vardhanthi : దేవుడిగా బతికి, ఒంటరిగా విడిచి.. ఎన్టీఆర్ ఆ తప్పు చేయకపోయి ఉంటే..
ఎండలు మండిపోతున్నాయి.. ఈ వరుణుడు కరుణించే వరకు మనకీ తిప్పలు తప్పవని తిట్టుకుంటున్న జనం మాటలు విని మేఘాలు అన్నీ ఒక్కటిగా చేరి.. సూర్యుడి కోపానికి బలవుతున్న జనాన్ని కాపాడటానికి వర్షం కురిపిస్తున్నాడు.
అప్పుడే అటుగా వచ్చిన వరుణుడి భార్య మేఘన (మనకి తెలియదు పేరు) మేఘాలు అయితే చేర్చాడు కానీ, ఎండకి అలసిపోయిన జనం వాయువుడి గాలితో తేలిపోతున్నారు. తన కోసం చేయాల్సిన పూజలు, యజ్ఞాలు, యాగాలు చేయడం లేదని అలిగి కూర్చున్నాడు. మేఘాలు అయితే వచ్చాయి కానీ తను అనుకున్న టైం వచ్చే వరకు వాటిని ఈ వాయుదేవుడు దెబ్బకి ఏగిపోకుండా కాచుకోవడంలో బిజీగా ఉన్నాడు. భర్త బిజీగా ఉండటం చూసి అలిగి తన బంధువర్గమైన మేఘాలను చెల్లాచెదురు చేసేసింది.
అప్పటి వరకు తను పడిన కష్టమంతా వృథా అయ్యిందనే కోపంతో మేఘన వంకా కోపంగా చూసి మీదకు రాబోయిన వాడు తమాయించుకుని, ఏంటి ఇది మేఘన ఎంత కస్టపడి చేరచ్చానో తెలుసా.. అయ్యిన ఎందుకలా చేసావని అడిగాడు వరుణ దేవుడు వరుణ్.
మొదట భర్త కోపానికి భయపడ్డా.. తర్వాత అతను అనునయించడం చూసి, మీరు ప్రయోగించిన బలానికీ, నా బంధువులందరిని ఒకటిగా చేసిన మీ బలానికి నాకు తలనొప్పి, జ్వరం వచ్చాయి. కనీసం చినుకులు కూడా పడకుండా ఎంతసేపు ఇలా ఉండాలి నా వల్ల కావడం లేదు.
వరుణ్ మనసులో.. ఇప్పుడు నాకు పూజలు, యాగాలు చేయడం లేదని చెప్తే ఆడేసుకుంటదని భావించిన వరుణుడు. ఇంకా టైం అవ్వలేదు కదా దేవి.. ఇది ఇంకా ఆషాడం వాయుదేవుడి టైం కదా.. అతనికి ఉన్న కొద్దిపాటి వెసులుబాటు కూడా లాక్కోడం ఇష్టం లేక అని, భార్యని ముద్దు చేస్తున్నాడు వరుణ్. భర్త చేస్తున్న గారానికి మరింత గారం వలకపోస్తూ.. మరేమో వరుణ్.. నాకు తల నొప్పిగా ఉంది. నీ చేతితో కాఫీ చేసివ్వరాదు. ఈ పని నేను చూసుకుంటానని అడిగింది మేఘన.
చేసుకున్న పెళ్ళికి తప్పుతుందా అని నవ్వుకుంటూ.. వెళ్లి కాఫీతో వచ్చాడు. కాఫీ తాగిన తర్వాత మరేమో.. వరుణ్ ఉల్లిచారు తింటే తలనొప్పి పోతుందని భూలోకపు యూట్యూబ్ లో చూసాను అది కూడా చేసి పెట్టు. నేను నీ పని చేసి పెడతానంది మేఘన.
Errani Cheekati Story : ఎర్రని చీకటి..
ఉల్లిచారు నాకు పెట్టడం రాదని మొత్తుకున్నా.. తప్పదని యూట్యూబ్ చూస్తూ ఉల్లిచారుకు కావాల్సిన చూసుకుని.. ఉల్లిపాయలు కోస్తూ ఉన్నాడు. ఇదే అదునుగా చూసుకుని వర్షం కురిపిస్తుంది మేఘన.
వర్షం కురిపించడం తెలిసిన మేఘన ఆపడం తెలియక వరుణ్ కోసం వెయిటింగ్.. ఉల్లిపాయలు కోసికోసి కళ్ళలో ముక్కులో నీళ్లు వస్తున్నాయి పాపం వరుణ్.. అని ఉన్న కథ చదివి కళ్ళలో నీళ్లు వచ్చే వరకు నవ్వాడు సతీష్.
Writer : మీనా రత్న కుమారి,
meenarathnakumari@gmail.com