Telugu Comedy Story : కాంతం – కామేశం..

Telugu Comedy Story : అది కాకినాడలో సముద్రపు ఒడ్డున ఉన్న ఒక అందమైన కాలనీ. విశాలమైన రోడ్లు, రోడ్డుకి ఇరుపక్కలా అందమైన చెట్లూ, విద్యుత్ స్థంభాలు..

కాలనీలో చాలా వరకూ ఇండిపెండెంట్ ఇళ్ళు ఉన్నాయి. కొన్ని అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. అందులో నివసించేవారు ఎక్కువగా ఓ.ఎన్.జి.సి., నాగార్జున ఫెర్టిలైజర్స్, పోర్ట్ ట్రస్ట్ లలో పనిచేసే వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు ఉండడం వలన అది కాస్మోపాలిటన్ కాలనీలా ఉంటుంది.

కాలనీకి ఈశాన్యం మూల ఒక రామాలయం, నైరుతి దిశలో అందమైన పార్క్, కాలనీ మధ్యలో ఒక డిపార్ట్‌మెంటల్ స్టోర్స్ ఉన్నాయి. అందరికీ దగ్గరలో అందుబాటులో ఉండడం వలన కాలనీవాసులు, ఎక్కువగా మహిళలు ఆ స్టోర్స్ కే వెళుతూ ఉంటారు. ఎందుకంటే అందులో దొరకని వస్తువంటూ లేదు. గ్రాసరీస్, కాస్మెటిక్ మెటీరియల్స్, హోమ్ అప్లియన్సెస్ దగ్గర నుంచి కూరగాయలు వరకూ అన్నీ దొరుకుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, అదొక మినీ సూపర్ మార్కెట్.

కొన్నాళ్ళు మిలిటరీ కాంటీన్ లో పనిచేసి, స్టోర్స్ మేనేజ్మెంట్ లో మంచి అనుభవం సంపాదించి రిటైర్ అయిన కామేశం, అతని భార్య కాంతం కలిసి ఆ స్టోర్స్ ని ప్రారంభించి, తక్కువ సమయంలోనే అందరి మన్ననలూ పొంది, వారి సహకారంతో దానిని బాగా అభివృద్ధి చేసారు.

One Moment, One Life : ఒక్కక్షణం.. ఒకే ఒక్కక్షణం..

కామేశం పేరుకి మిలటరీ లో పనిచేసినా, పెళ్ళాం అంటే చచ్చేంత భయం. ఒక్కొక్కప్పుడు కాంతానికి కోపం వచ్చినపుడు కామేశానికి ఆమెలో సూర్యాకాంతం కనిపిస్తూ వుంటుంది. ఆ భయానికి, అమె అంటే అణిగిమణిగి ఉంటాడు. అందరు ఆడవాళ్ళు అలాగే ఉంటారన్న ఫాల్స్ ఒపీనియన్ తో, అతను షాపుకు వచ్చే లేడీ కష్టమర్లతో జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడుతూ ఉంటాడు. అదే కాకుండా ఆ సమయంలో కాంతం అతన్ని ఒక కంటకనిపెడుతూ ఉంటుంది. అయినా, ఏభై ఏళ్ళ కామేశానికి మనసులో ఏదో విధంగా ఆడవాళ్ళతో మాట్లాడాలని వారి అభిమానం పొందాలని కోరిక ఉండేది.

అందుకే సాధ్యమైనంతవరకూ హేన్డ్సమ్ గా కనిపించడానికి తాపత్రయ పడుతూ వుంటాడు. ఆ వయసుకే వచ్చిన బట్టతల, చుట్టూ ఉన్న జుట్టుకి, మీసాలకీ రంగేస్తూ వుంటాడు. బట్టతల బయట పడకుండా, జుయల్ థీఫ్ సినిమాలో దేవానంద్ పెట్టుకున్న టోపీ లాంటి టోపీని పెట్టుకుంటాడు. మీసాలంటే గుర్తొచ్చింది… మిలటరీలో ఉన్నంత కాలం, దర్పంగా కనిపించడం కోసం, ఆర్మీ జనరల్ మానేక్ షా మీసాల్లాంటి కోరమీసాలు పెంచాడు. కాలక్రమేణా అవి క్షీణించి, ఇప్పుడు హిట్లర్ మీసాల్లా ముక్కుకి, నోటికి మధ్యన బ్రిడ్జిలా మిగిలాయి. ఏదో పాపం అలా సరిపెట్టుకుంటున్నాడు. ఇక ఆహార్యం విషయానికి వేస్తే, రంగురంగుల టీ షర్ట్ లు భుజాల మీదకి స్ట్రిప్స్ వేసుకునే పాంట్ లో ఇన్ షర్ట్ చేసుకుని, షూ వేసుకుంటాడు.

ఎప్పుడైనా పని ఉండి కాంతం షాపుకి రాలేకపోతే, కామేశం ఒక్కడే షాపుని మేనేజ్ చేసేవాడు‌. అప్పుడు కాంతం ఇంటి దగ్గర ఉన్నా కూడా, సీసీ కెమేరా ఫుటేజ్ ని మొబైల్ లో చూస్తూ షాపులో ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండేది. ఆ విషయం తెలియని కామేశం, షాపుకి వచ్చిన ఆడవాళ్ళతో సరదాగా జోకులేసుకుంటూ ఆడుతూ పాడుతూ పని చేసేవాడు. షాపుకి వచ్చిన ఆడవాళ్ళు “అంకుల్.. ఈరోజు ఆంటీ రాలేదా…” అంటూ అడిగేవారు. అంతే కాకుండా ఫలానాది ఉందా…అంటూ అడిగేవారు.

ఒకసారి ఒకామె కావలసిన సరుకులు కొనుక్కొని, బిల్ కట్టడానికి కౌంటర్ లో ఉన్న కామేశం దగ్గరికి వస్తుంటే, కాలు స్లిప్ అయి, పడబోతుంటే.. కామేశం ఒక్క ఉదుటున ఆమె నడుముని పట్టుకుని, పడిపోకుండా ఆపి, పైకి లేపి, హీరోలా ఫీలయ్యాడు. అనుకోకుండా వచ్చిన ఆ అవకాశానికి ఎంతో సంబరపడిపోయి, తనలోనే ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు.

ఆ దృశ్యం చూసిన కాంతం కళ్ళలో నిప్పులు చిమ్ముతూ చూసింది కామేశాన్ని. ఆరోజు రాత్రి ఇంట్లో అతనికి స్పెషల్ క్లాస్ పీకింది కాంతం.
“ఇంత వయసొచ్చినా ఇవేం బుద్ధులు నీకు.. ఛీ…! సిగ్గులేకపోతేసరి… నువ్వు ఇలాంటి వాడివని తెలిస్తే, ఇంక మన షాపుకి ఎవరూ రారు.. దివాలా తీసి, అడుక్కు తినాలి తెలిసిందా…?!” అని సూర్యాకాంతం లెవెల్లో ఓ రేంజిలో ఇచ్చి పడేసింది.

“ఛా… అదేంటే అలా అంటావు… ఇన్నేళ్ళ మన కాపురంలో నన్ను అర్ధం చేసుకున్నది ఇదేనా… నాకసలు అలాంటి దురుద్దేశం ఏమీ లేదే… పాపం ఆవిడ కాలు స్లిప్ అయి పడిపో పోతుంటే పెట్టుకున్నాను అంతే… నన్ను నమ్మవే…! అదేదో సినిమాలో రేలంగి పాడినట్లు ఇంత చక్కని రంభ ఇంటిలో వుండగా ఇతరులతొ పనియేమి…! అన్నట్లు నేనెందుకు వేరే వాళ్ళ జోలికెళ్తాను…” అన్నాడు కామేశం బతిమిలాడుతూ..
“అబ్బో… మరి అటువంటప్పుడు ఆ జుట్టుకు రంగేయడం ఎందుకు… ఏదో కాలేజీ స్టూడెంట్ లా రోజూ ఆ రంగురంగుల చొక్కాలు వేసుకోవడం ఎందుకు… నిన్ను, నీ అవతారాన్నీ చూసి అందరూ నవ్వుకుంటారు…”
“అక్కడే నువ్వు లాజిక్ మిస్ అవుతున్నావు కాంతం…! పెద్ద పెద్ద మాల్స్ లో అంతంత జీతాలిచ్చి అందమైన సేల్స్ గర్ల్ ని ఎందుకు పెడతారనుకుంటున్నావు… అదొక అట్రాక్షన్…! సీతాకోకచిలుకల లాంటి అందమైన అమ్మాయిలు హొయలొలుకుతూ, కస్టమర్లను చిలుక పలుకులతో స్వీట్ గా పలుకరించి, వారి వాగ్ధాటి తో వారిని సమ్మోహపరచి, మొత్తానికి వారితో ఏదోకటి కొనిపిస్తారు. ఇవే మార్కెటింగ్ స్కిల్స్… అప్పుడే కస్టమర్లు మళ్ళీ మళ్ళీ వస్తారు.

Telugu Story : చివరకు ఎవరిదీ..!?

మనకి సేల్స్ గర్ల్స్, బోయ్స్ లేరు కదా… మనమే అన్నీ చూసుకోవాలి. అంచేత నేను చెప్పేదేంటంటే, మనం చూసేవాళ్ళకి బాగా కనిపించాలి. అప్పుడే కస్టమర్లు మన షాప్ కి వస్తారు. అందుకోసమే నేను ఇదంతా చేసేది. లేదూ ఎవరైనా సేల్స్ గర్ల్స్ ని పెడదామనుకుంటే చెప్పు. రేపే పేపర్ ఆడ్ ఇచ్చి, ఎవర్నైనా పెట్టుకుందాం. నేను హాయిగా ఇంట్లో కూర్చుంటాను. ఏమంటావు…?!” అన్నాడు కామేశం అతని టాలెంట్ ని అంతా ఉపయోగించి.
“అమ్మో…వద్దులెండి. మళ్ళీ సేల్స్ గర్ల్స్ అంటే వాళ్ళకి బోల్డ్ జీతాలు గట్టా ఇవ్వాలి. ఎందుకు లెండి మనమిద్దరం ఉన్నాంగా… ఎంతైనా మీరు మాటలతో భలే పడేస్తారండి…” అంది నవ్వుతూ.
‘హమ్మయ్యా…బతుకు జీవుడా…ఈరోజుకి ఎలాగో గండం గట్టెక్కింది’ అనుకున్నాడు లోపల… తన తెలివితేటలకి తనే మెచ్చుకుంటూ.
“సరే గానీ, ఆకలి చంపేస్తోంది.. అన్నం పెడతావా…?!” అన్నాడు సోఫాలోంచి లేస్తూ.

*******
అలా అవకాశం వచ్చినపుడు ఆడవాళ్ళతో సరసంగా మాట్లాడినా, కాంతం పుణ్యమా అని అది కాస్తా విరసంగా మారేది. అంచేత అప్పటి నుంచి ఆడవాళ్ళని చూడాలన్నా, వారితో మాట్లాడాలన్నా భయం వేసేది కామేశానికి. అంచేత లేడీ కస్టమర్లతో మాట్లాడేటప్పుడు మనసుని అదుపులో పెట్టుకుని చాలా మర్యాదగా మాట్లాడేవాడు.

ఒకరోజు కామేశం ఒక్కడే షాపులో ఉన్నాడు. ఆరోజు కాంతానికి ఒంట్లో బాగాలేదని ఇంటి దగ్గరే ఉండిపోయింది. మధ్యాహ్నం లంచ్ టైం దాటేకా, షాపులో పెద్దగా జనం లేరు. సరిగ్గా అప్పుడే ఒకామె షాపులోకి వచ్చింది వయ్యారంగా. ఆమెకేసి ఆశ్చర్యంగా చూసాడు కామేశం. ఆమెకు సుమారు పాతికేళ్ళు ఉంటాయి. ఎర్రగా, బుర్రగా అందంగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడూ ఆమెను చూడలేదు. బహుశ వేరే కాలనీ నించి వచ్చి వుంటుందననుకున్నాడు. ఆమె తిన్నగా కామేశం దగ్గరకు వచ్చి…

“హాయ్ అంకుల్… మీ షాపులో ఇవి ఉంటాయా…” అంటూ ఒక పెద్ద సరుకుల లిస్ట్ ఇచ్చింది.
“ఎవరమ్మా మీరు ఎప్పుడూ చూడలేదు. ఏ కాలనీలో ఉంటారు…?” అనడిగాడు.
“ఈ కాలనీయే అంకుల్… మా వారు ఓ.ఎన్.జి.సి. లో ఇంజనీర్. మొన్ననే ముంబాయి నించి ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చాము. ఈ పక్క వీధిలోనే ఇల్లు అద్దెకు తీసుకున్నాము” అంది.
“ఓ…అలాగా…మీ లిస్ట్ లో ఉన్నవన్నీ మా దగ్గర దొరుకుతాయండీ… ట్రాలీ తీసుకెళ్ళి, మీకు కావలసిన సామాన్లన్నీ తెచ్చుకోండి. నేను బిల్ చేసి ఇస్తాను…” అన్నాడు లిస్ట్ ఆమెకిస్తూ.
“థాంక్యూ అంకుల్…!” అంటూ ట్రాలీని తీసుకుని స్టోర్ లోపలికి వెళ్ళింది. వెళ్తు ఒకసారి వెనక్కి తిరిగి కామేశాన్ని చూసి నవ్వింది.

ఆమె నవ్వుకి కామేశం లో అలజడి మొదలైంది. ‘ఏంటి… ఎందుకిలా చూసి నవ్వింది…? నా అందం చూసా…లేక మన గెటప్ ని చూసి వేళాకోళంగా నవ్విందా…?! ఏదైనా ఈ అమ్మాయి ఏదో తేడాగా కనిపిస్తోంది…’ అనుకుంటూ, జేబులోంచి దువ్వెన తీసి, వెనుక టోపీ కింద ఉన్న నాలుగు వెంట్రుకలనూ దువ్వుకుంటూ ముసిముసిగా నవ్వుకున్నాడు.

కాసేపటికి ఆమె సామాన్లను తీసుకొని, కౌంటర్ దగ్గరికి వచ్చింది. కామేశం అన్నిటికీ బిల్ ప్రిపేర్ చేసి ఇచ్చాడు.
“అయ్యో… సారీ అంకుల్… నేను పర్స్ మర్చిపోయాను. సాయంత్రం వచ్చి బిల్ పే చేస్తాను…” అంది.
“అబ్బే అలా కుదరదమ్మా… బిల్ పే చేసి, సామాన్లు పట్టుకెళ్ళిండి. ఏమనుకోవద్దు… పైగా మొదటిసారి మా స్టోర్ కి వచ్చారు” అన్నాడు.
“నా మీద నమ్మకం లేదా మీకు… మీరు చాలా మంచివారనీ, లేడీస్ కి చాలా హెల్ప్ చేస్తారనీ అందరూ చెప్పారు. పొరబాటున పర్స్ మర్చిపోయాను. కొంచెం హెల్ప్ చేయండి సాయంత్రం వచ్చి డబ్బులు కట్టేస్తాను ప్లీజ్…” అంది వేడుకోలుగా.

“చూడమ్మా… మేము వ్యాపారం చేసుకునే వాళ్ళం… మాకు కొన్ని వృత్తిపరమైన నియమ నిబంధనలు ఉంటాయి. మేము వాటికి కట్టుబడి ఉండాలి. లేకపోతే ఈ కొట్టు మూసుకుని నెత్తిన గుడ్డేసుకుని కూర్చోవాలి. తెలిసిందా… ముందు బిల్ డబ్బులు కట్టి అప్పుడు సామాన్లు తీసుకెళ్ళండి… అయినా నేను సాయంత్రం స్టోర్ తీయను. ఇంటి దగ్గరే ఉంటాను. ఎందుకంటే, మా ఆవిడకి ఒంట్లో బాగాలేదు. ఆమెని హాస్పటల్ కి తీసుకెళ్ళాలి. దగ్గరుండి చూసుకోవాలి. బహుశ ఆమెకి తగ్గేదాకా నేను షాపు తీయకపోవచ్చు. అంచేత ఇప్పుడే డబ్బులు కట్టండి లేదా సామాన్లు ఇక్కడే పెట్టండి” అన్నాడు నిక్కచ్చిగా.

“అంతేనా అంకుల్… మీరేమీ హెల్ప్ చేయలేరా? నన్ను చూస్తే అయ్యో పాపం ఆడపిల్ల అని జాలేయడం లేదా… మీరు తల్చుకుంటే ఏమైనా చేయగలరు. మీరు చేసిన సాయం నేను మర్చిపోను లెండి… మీ రుణం ఏదో విధంగా తీర్చుకుంటాను…” అంది హొయలు పోతూ కామేశం కళ్ళలోకి చూస్తూ.
“ఏయ్…! ఏంమాట్లాడుతున్నావు…?! ఎన్నిసార్లు చెప్పాలి. డబ్బులు కట్టనప్పుడు ఆ సామాన్లన్నీ ఎక్కడివి అక్కడే పెట్టేసి వెళ్ళు. మళ్ళీ అవి సర్ధడానికి నా దగ్గర మనుషులు కూడా లేరు…!” ఈసారి కొంచెం కటువుగా వచ్చింది కామేశం స్వరం.

“ఏంటకుంల్ ఎందుకలా కోపంగా మాట్లాడతారు… ఆడవాళ్ళతో అలాగేనా మాట్లాడేది… మీ గురించి అందరూ చాలా చెప్పారు. కానీ మీరేంటో అసలు ఇప్పుడు అర్ధమైంది.. సరే, నేను వెళ్తున్నాను. మీరూ వద్దు, మీ సామాన్లూ వద్దు. ఇకనుంచి మీ షాపుకి ఎవరొస్తారో నేనూ చూస్తాను. ముఖ్యంగా ఆడవాళ్ళు. ఈ కాలనీలో మీరు తలెత్తుకుని తిరగలేకుండా చేస్తాను. మీరు షాపు మూసుకుని పెట్టె, బేడా సర్దుకుని వెళ్ళకపోతే నా పేరు స్మితే కాదు…” అంటూ సవాల్ చేసి విసురుగా వెళిపోయింది.
‘ఇదెక్కడ గొడవ ఎప్పుడూ ఇలా జరగలేదు.. అసలు ఎవరీమె… తెలుసుకోవాలి…’ అనుకుంటూ, పనిలో పడ్డాడు కామేశం.

******

రెండురోజులు ఒక పూటే షాపు తీసి, మిగతా సమయమంతా ఇంటి పట్టునే ఉండి కాంతాన్ని కనిపెట్టుకుని, సమయానికి మందులు ఇస్తూ ఉన్నాడు కామేశం. ఆరోజు షాపులో జరిగిన దానిగురించి కాంతానికి చెప్పలేదు.
రెండురోజుల్లో ఆమెకు పూర్తిగా నయమైంది.
“ఈరోజు నేను కూడా షాపుకి వస్తానండి… రెండురోజుల నించీ ఇంట్లోనే ఉండి బోరుగా ఉంది…” అంది కాంతం పొద్దున్నే షాపుకు బయలుదేరిన కామేశంతో.
“వద్దులే కాంతం… చాలా నీరసంగా ఉన్నావు‌ ఇంకో రెండు రోజులు రెస్ట్ తీసుకో. నే వెళ్తున్నాగా నేను చూసుకుంటాలే…” అని చెప్పి వెళ్ళిపోయాడు. అతని వైపే చూస్తూ ఉండిపోయింది కాంతం.
ఒక వారం రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చి, ఆలోచిస్తూ మంచం మీద పడుకుంది కాంతం.

Women Safety : నిర్భయంగా ముందుకు వెళ్ళండి..

ఆరోజు కామేశం ఏదో పని మీద బయటకు వెళ్ళాడు. కాంతం ఒక్కతే షాపులో ఉంది.
“ఏమే కాంతం ఎలా ఉన్నావు… ఎలా ఉంది మీ వ్యాపారం…?!” అనడిగింది కాంతం చిన్ననాటి స్నేహితురాలు అలివేలు.
“రావే అలివేలు.. ఏమే, ఈ మధ్య మరీ నల్లపూసవైపోయావు.. ఎలా ఉన్నావు…” అనడిగింది కాంతం.
“బాగానే వున్నాను. మొన్న మా చెల్లి ఇంట్లో ఫంక్షన్ ఉంటే రాజమండ్రీ వెళ్ళాను. నిన్ననే వచ్చాను. ఏంటి విశేషాలు…?!”

“ఏముందిలే అంతా మామూలే…కానీ నాది ఒకటే బెంగ.. ఈమధ్య మీ అన్నయ్య ధోరణి నాకు నచ్చడం లేదే.. మంచివాడే కానీ, ఎందుకో ఆడవాళ్ళ విషయంలో ఏదో తేడాగా బిహేవ్ చేస్తున్నాడని నా అనుమానం.. అదే నా బెంగ. అది ఎలా తెలుసుకోవాలి…”
“అవునా… అయితే ఒక పని చేద్దాం. నాతో పాటు మా చెల్లి కూతురు స్మిత కూడా వచ్చింది. అది ఓ నాలుగు రోజులుంటుంది ఇక్కడ. అది మంచి నీటి. ఈ మధ్య ఏవో ఒకటి రెండు టివి సీరియల్స్ లో కూడా చిన్న వేషాలు వేసిందిలే. కామేశం అన్నయ్యకు ఆమెవరో తెలీదు కాబట్టి, ఆమెతో చిన్న నాటకం ఆడిద్దాం. దాని నాటకానికి అన్నయ్య పడిపోయాడనుకో అప్పుడు ఏంచేయాలో ఆలోచిద్దాం. లేదా దాని జిమ్మిక్కులకి లొంగలేదనుకో, అప్పుడు నీకున్న అనుమానాలన్నీ పోతాయి. ఏమంటావు…?!” అంది.

“ఇదేదో బాగుందే…! కానీ అనవసరంగా మీ స్మితను ఇబ్బంది పెట్టినట్లు వుంటుందేమో…”
“మీరేం ఫర్వాలేదులే.. దానికి ఈ అనుభవం రేపు ఎక్కడైనా ఉపయోగపడొచ్చు. నువ్వు ఇంటిదగ్గర ఉన్నప్పుడు చెప్పు నేను దానికి ఏంచేయాలో చెప్పి పంపిస్తాను…” అంది అలివేలు.
“చాలా థాంక్సే.. కానీ జాగ్రత్త. మీ అన్నయ్యకి ఏమాత్రం అనుమానం రాకుండా చూసుకో…”
“అలాగే.. నేను చూసుకుంటా కదా…!”
అలా ఆరోజు స్మితను షాపుకి పంపడం, అక్కడ జరిగిన విషయాలన్నీ తరువాత అలివేలు తనకి చెప్పడంతో, కామేశం మీద ఉన్న అనుమానాలన్నీ తీరిపోయాయి కాంతానికి. ఇలాంటి మంచి మనిషిని అనవసరంగా అనుమానించానని చాలా బాధపడినా, అతని ప్రవర్తనకి మనసులోనే ఆనంద పడింది కాంతం.

*******

“ఇప్పుడెలా ఉంది కాంతం.. నీరసం తగ్గిందా…?!” రాత్రి షాపు నించి వచ్చి అడిగాడు కామేశం ప్రేమగా ఆమె తల నిమురుతూ.
“నన్ను క్షమించండి.. మిమ్మల్ని అనవసరంగా అనుమానించి, చాలాసార్లు మీ మనసు కష్ట పెట్టాను…” అంది కామేశాన్ని గట్టిగా పట్టుకుని కంటతడి పెడుతూ.
“ఏంటే.. ఎందుకీ కన్నీళ్ళు ఇప్పుడేమయిందని…? నేను అవేమీ గుర్తుంచుకోనులే… ఒక విషయం చెప్పనా… పూర్వం జన్మలో ఏం పాపం చేసామో, మనకి భగవంతుడు సంతానాన్ని ఇవ్వలేదు. మనకెవరున్నారు చెప్పు. నాకు నువ్వు, నీకు నేను అంతే కదా… ఇది నిజం.. మిగతాదంతా అబద్ధం…!” అన్నాడు కాంతాన్ని దగ్గరికి తీసుకుంటూ..

********
సమాప్తం
********

రచయిత : విజయానంద్ దెందులూరి

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post