Red Capsicum Chutney : రెడ్ క్యాప్సికం ఇది ఎప్పుడో కానీ మన వంట గదిలోకి చేరదు. ఒకవేళ వచ్చిన ఏ ఫాస్ట్ ఫుడ్ నూడల్స్, బిర్యానీలో తప్ప పెద్దగా వాడము. కానీ రెడ్ క్యాప్సికం చాలా మంచిది ఎదిగే పిల్లలకి రెగ్యులర్ గా పెట్టడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మరి ఎంతో ఆరోగ్యకరమైన రెడ్ క్యాప్సికంతో పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
* రెడ్ క్యాప్సికమ్ – 1/2 కేజీ
* పచ్చిమిరపకాయలు – 9
* కొత్తిమీర – ఒక చిన్న కట్ట
* చింతపండు – 15 గ్రాములు
* పసుపు – చిటికెడు
* ఉప్పు – తగినంత
* నూనె – 5 స్పూన్లు
పోపు కోసం..
* ఎండు మిరపకాయలు – 10
* మినపప్పు – 1/4 స్పూను
* మెంతులు – 1/2 స్పూనులో సగం
* ఆవాలు – 1/4 స్పూను
* ఇంగువ – కొద్దిగా..
తయారీ విధానం:
చింతపండును కొంచెం నీళ్లలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. రెడ్ క్యాప్సికమ్ ను ముక్కలుగా తరుగుకోవాలి. కొత్తిమీరను క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టౌ మీద కడాయి పెట్టుకుని రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగగానే ఎండు మిరపకాయలు, మెంతులు, మినపప్పు, ఆవాలు మరియు ఇంగువను వేసుకుని పోపు వేయించుకోవాలి. ఈ పోపును విడిగా ఓ పళ్ళెములోకి తీసుకోవాలి.
మళ్లీ స్టౌ మీద కడాయి పెట్టుకుని మిగిలిన 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగగానే రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, పచ్చి మిరపకాయలు అలాగే చిటికెడు పసుపును వేసుకుని మూతపెట్టి, 5 నిముషాలు ముక్కలను మగ్గనివ్వాలి. మగ్గిన ముక్కలను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత ముందుగా వేయించిన ఎండు మిరపకాయలు కొంచెం చింతపండు అలాగే ఉప్పును వేసుకుని పచ్చడి మెత్తగా దంచుకోవాలి.
తర్వాత మగ్గబెట్టి విడిగా ఉంచిన రెడ్ క్యాప్సికమ్ ముక్కలు , పచ్చిమిరపకాయలు మరియు కొత్తిమీరను కూడా రోటిలో వేసుకుని మెత్తగా దంచుకోవాలి. రోలు లేని వాళ్ళు మిక్సీలో మరి మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా చేసుకోండి. చివరగా వేయించిన పోపును వేసుకోవాలి. అంతే.. ఎంతో రుచిగా ఉండే రెడ్ క్యాప్సికం పచ్చడి రెడీ. ఈ రెడ్ క్యాప్సికమ్ అన్నంలోకి అలాగే దోశ, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది.