Pakistan Earthquake : పాకిస్తాన్‌లో బుధవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. ఇది ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసింది. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి పాకిస్తాన్ తో పాటు భారత్, ఆఫ్గనిస్తాన్‌లలో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని డేరా ఘాజీ ఖాన్ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది.
భూకంపం వల్ల పెషావర్, ఇస్లామాబాద్, లాహోర్ వంటి నగరాల్లో భూమి తీవ్రంగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లలోని సీలింగ్ ఫ్యాన్లు, కుర్చీలు, ఇతర వస్తువులు వణుకుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఉత్తర భారత రాష్ట్రాలైన ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో కూడా స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోనూ ఈ భూకంప ప్రభావం కనిపించిందని సమాచారం. ఈ భూకంపానికి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలియజేశారు. అయితే జనం భయంతో అల్లాడిపోయారు.