Gurukul School : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో ఉన్న ఇందిరమ్మ కాలనీ గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు పీఈటీ జ్యోత్స్న ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహంతో రోడ్డెక్కారు. విద్యార్థినులు పాఠశాల సమీపంలోని సిరిసిల్ల-సిద్ధిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి, పీఈటీ జ్యోత్స్నను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు.
గెస్ట్ పీఈటీ జ్యోత్స్న పై తీవ్ర ఆరోపణలు :
విద్యార్థినుల ఆరోపణల ప్రకారం, పీఈటీ జ్యోత్స్న ప్రత్యేక తరగతులకు హాజరుకాని విద్యార్థినులను చితకబాదడమే కాకుండా, బాత్రూంలో స్నానం చేస్తుండగా తలుపులు విరగ్గొట్టి లోపలికి చొరబడి ఫోన్లో వీడియోలు రికార్డు చేసింది. పీఈటీ ప్రవర్తన తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, ఆ వీడియోలను ఎక్కడైనా బయట పెడితే తమ జీవితాలు నాశనం అవుతాయని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థినుల రోడ్డుపై నిరసన :
విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థినులు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పాఠశాల గేట్ దూకి, చీకట్లో రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. పోలీసులు వారిని నిరసన విరమించాలని ఎన్ని చెప్పినా వినిపించుకోలేదు.
కలెక్టర్ ఆదేశాల మేరకు :
విద్యార్థినుల ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రంగంలోకి దిగారు. ఆయన సూచనలతో డీఈవో రమేష్ విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలు విన్నారు. కలెక్టర్ పాఠశాలను స్వయంగా సందర్శించి, విద్యార్థినుల ఆవేదనను పరిగణనలోకి తీసుకుని, పీఈటీ జ్యోత్స్నను విధుల నుండి తొలగించారని తెలిపారు.
కలెక్టర్ చర్యలను విద్యార్థినులు స్వాగతించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు, తల్లిదండ్రులు కోరారు.