Karthika Masam :
నాల్గవ రోజు పారాయణము
సప్తమాధ్యాయము
‘ఓ జనక రాజేంద్రా! కల్మషఘ్నమైన కార్తీక మహాత్మ్యంలో పుష్పార్చన, దీప విధానాలను చెబుతాను విను.
పుష్పార్చన ఫలదాన దీపవిధి విశేషములు :
ఈ కార్తీక మాసములో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించటం వలన కమలాసనియైన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్ల స్థిరనివాస మేర్పరచుకుంటుంది. తులసీ దళాలతోగాని, జాజిపువ్వులతోగాని, మారేడు దళాలతో గాని పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకములో భక్తియుతులైన పండ్లను దానము చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్లవలె చెదరిపోతాయి. ఉసిరిచెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరిజూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకములో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీదళాలతో పూజిస్తారో, వారికి మించిన ధన్యులెవరూ ఉండరనడం అతిశయోక్తి కాదు. బ్రాహ్మణ సమేతులై, ఉసిరిచెట్టు వున్న తోటలో – వనభోజనమును చేసేవారి మహాపాఠశాలు సైతము మజ్జిగలసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరిచెట్టు కింద పాలగ్రామ పూజ చేసే వారు వైకుంఠాన్ని పొంది విష్ణువువలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసములో విష్ణ్వాలయములో మామిడాకుల తోరణం కడతారో, వాళ్లు పరమపదాన్ని పొందుతారు.
కార్తీక పురాణం.. మొదటి రోజు వినాల్సి కథ..
పువ్వులతోగాని, అరటి స్తంభాలతో గాని మండపము కట్టిన వాళ్లు వైకుంఠములో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండప్రణామమును చేసిన వాళ్లు అశ్వమేథ పుణ్యవంతులవుతారు. విష్ణువునకు ఎదురుగా జప, హోమ దేవతార్చనలు చేసే వాళ్లు పితరులతో సహా వైకుంఠానికి వెళ్లి సుఖిస్తారు. స్నానము చేసి తడిబట్టలతో వున్న వానికి పొడిబట్టని దానము చేసిన వాడు పదివేల అశ్వమేథాల ఫలాన్ని పొందుతాడు. ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి – పుష్పము పరాగమువలె ఎగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసెపూలతో హరిపూజను చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది. కార్తీకమాసమందు ఏ స్త్రీ అయితే బృందావన గోమయంతో అలికి, పంచరంగులతోనూ, శంఖ, పద్మ, స్వస్తికారి నందా దీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని వేయినోళ్ల ఆదిశేషుడైనా పొగడలేదు. ఈ కార్తీక మాసములో శివుని జిల్లేడు పూలతో పూజించినవాడు దీర్ఘాయువై, అంత్యాన మోక్షాన్ని పొందుతాడు.
విష్ణ్వాలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరి మందిరములో చిరస్థాయిగా వుంటారు. హరిని మల్లెపువ్వులతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమై పోతాయి. తులసీ గంధముతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వసంచిత పాపాలన్నీ నాశనమై పోతాయి. భక్తియుక్తులై అన్నదానమును చేసే వారి పాపాలు గాలికి మంచుతునకలలా ఎగిరిపోతాయి. ప్రత్యేకించి కార్తీక మాసములో నువ్వుల దానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ నాలుగూ ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ వుంది. స్నాన దానాదులను ఆచరింపని వారూ, లోభియై యధాశక్తిగా చేయని వారు నూరు జన్మలు కుక్కగా పుట్టి కడపట చండాలయోనిని జన్మిస్తారు. కార్తీక వ్రత శూన్యులు మరుజన్మలో గాడిదగా పుట్టి, తదుపరి నూరుపుట్టుకలూ శునకయోనిని జన్మిస్తారు. కార్తీకమాసములో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలములోనే నివసిస్తారు. ఓ జనక మహారాజా! కార్తీక మాసములో ఎవరైతే అవిసెపువ్వుల మాలను తాము ధరించి – తదుపరిని అవిసె పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు. మాల్యములు – తులసీదళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక్క సూక్ష్మాన్ని చెబుతాను విను, అశక్తులయిన వాళ్లు –
శ్లో // కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేత్ | మాసస్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభ చేన్సవ శ్లో ॥ ఆద్యేంతియే థొ మధ్యమే చదినే యః స్నానమాచరేత్: మాస స్నాన ఫలం తేన లభ్యతే నాత్ర సంశయః ॥
‘కార్తీకమాసంలో ఆదివారం నాడు లేదా శుక్ల పాడ్యమి నాడు గాని, పూర్ణిమనాడు గాని, అమావాస్యనాడు గాని సంకల్పరహితముగా ప్రాతఃస్నానం ఆచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానము చేసిన పుణ్యం లభిస్తుంది. ఆ పాటి శక్తి కూడా లేని వాళ్లు కార్తీకమాసము నెల రోజులూ ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా, వినినా కూడా స్నానఫలాన్ని పొందుతారు. కార్తీకమాసము సాయంకాలాలో దేవాలయాలలో శివ-విష్ణుస్తోత్రాలను పఠించేవారు – కొంతకాలము స్వర్గలోకములో వుండి – అనంతరము ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతీ కార్తీక మాసములో ఎవరైతే హరిహరులను స్మరించకుండా వుంటారో వాళ్లు ఏడు జన్మల పాటు నక్కలుగా పుడతారనడంలో ఏమీ సందేహము లేదు.
కార్తీక పురాణం.. రెండవ రోజు వినాల్సి కథ..
సప్తమాధ్యాయము సమాప్తము
అష్టమాధ్యాయము
వశిష్ఠుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు: ‘మహర్షీ! మీరు చెప్పినవన్నీ వినిన తరువాత నాకొక సందేహము కలుగుతోంది. వర్ణసాంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనులు వేదత్రయోక్తాలయిన ప్రాయశ్చిత్తాలను చేసుకొననిదే పరిశుద్ధులు కాదు’ అని సమస్త ధర్మ శాస్త్రాలలోను ఘోషిస్తుండగా, కేవలం కార్తీక ప్రతాచరణా ధర్మదేశము చేతనే సమస్త పాపాలూ హరించుకుని పోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలోని మర్మమేమిటి? ఇది ఎలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్య మాత్రము చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? గండ్రగొడ్డళ్లతో కూడా కూలనేయ సాధ్యముగాని మహాపర్వతాన్ని కేవలము కొన వ్రేలిగోటితో కూల్చడము సాధ్యమవుతుందా? అగ్ని దగ్ధమవుతూన్న ఇంటిలో వున్నవాడు ఆ మంట మీద పురి షెడు నీళ్లు జల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదము తొలగిపోతుందా? ఏ మహానదీ ప్రవాహములోనో కొట్టుకుని పోయే వారిని ఓ పాటి గడ్డిపరక గట్టుకు చేర్చగలుగుతుందా? తనకు తానై కొండచరియలలోని ఏ లతాపత్రాన్నే పట్టుకున్నంత మాత్రము చేతనే నదీపాతవేగాన్నుంచి సంరక్షించబడతాడా? వశిష్ఠా! ఈ విధమైన దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్లు సహితము అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణము వలన పాపరహితులూ, పుణ్యాత్ములూ ఎలా అవుతారు? వీటికి సమాధానమేమిటి? జనకుడి ప్రశ్నకు జ్ఞానహాసమును చేస్తూ – ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు.
జనకుని ప్రశ్నలకు వశిష్ఠుని జవాబు:
వశిష్ఠ ఉవాచ: మంచి విమర్శే చేశావు మహారాజా! చెబుతాను విను. ధర్మాన్ని సూక్ష్మముగా చింతించాలేగాని, స్థూలరూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అదిగాక, వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మసూక్ష్మాలను మనకందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగామా- స్వల్ప పుణ్యాలు గొప్పవిగానూ పరిణమిస్తూంటాయి. ధర్మాలన్నీ గుణత్రయముతో కూడుకుని స్వల్ప నల్పతలను సిద్ధింపచేసుకుంటాయి. మూల ప్రకృతియైన ‘మహామాయ కారణంగా సత్వర జస్తమస్సులనే మూడు గుణాలు కూడా ఏర్పడ్డాయి.
వీటిలో సత్వగుణ ప్రధానమైనవి ధర్మసూక్ష్మాలు, కర్మకాండ, తపస్సు, ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం వలన ఏర్పడ్డాయి. తర్కము – దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు, ఆచరించే దానధర్మాలు, ఇవన్నీ కూడా ధర్మము యొక్క స్థూలస్వరూపాలు. ఇవి తమోగుణము వలన ఏర్పడతాయి. వీటిల్లో – సత్వగుణ ప్రధానముగా ఆచరించే ధర్మాలు స్వల్పముగా తోచినప్పటికీ దేశకాల యోగ్యతాదుల వలన విశేష ఫలాలను ఇస్తాయి. ‘దేశము’ అంటే పుణ్యక్షేత్రం, కాలము అంటే పుణ్యకాలము. యోగ్యత అంటే – పాత్రత, బ్రహ్మజ్ఞత కలవాళ్లు ఈ మూడింటినీ చింతించకుండా చేసే సర్వధర్మాలూ తామసాలు – వీటివలన పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే
సత్వధర్మాలు. వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేని రజోగుణ ధర్మాలని వేరే చెప్పనక్కరలేదు కదా! జనకరాజా ! అన్నిటికి కర్మమే మూలము. ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలుంటాయి. అయినప్పటికి మనిషికి జ్ఞానము అనేది ఉన్నందువలన ఆచరించే ధర్మాలను పై మూడింటితో పోల్చుకుని ప్రయత్న పూర్వకముగా నైనా ఆచరించాలి. ఈ విధంగా మూడు కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము అక్షయ ఫలితాన్నిస్తుంది. రాజా! పర్వతమంత ఎత్తు
కట్టెలను పేర్చి, వాటి మధ్య గురివింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణము ఆ కట్టెలనెలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము ఆ ఇంటి చీకట్లనెలా తొలగిస్తుందో, గుండి గడు మురికినీళ్లను ఒక్క ఇండుపగింజ ఎలా శుభ్ర పరుస్తుందో అదే విధంగా తెలిసిగాని, తెలియకగాని పుణ్యకాలములో, పుణ్యక్షేత్రములో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపాలనూ దగ్ధం చేసి, మోక్షానికి మార్గాన్ని వేస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను.
అజామిళోపాఖ్యానము
బహుకాలం పూర్వం కన్యాకుబ్జ క్షేత్రవాసీ, సార్థక నామధేయుడునైన సత్యవిష్ణుడనే బ్రాహ్మణునికి అజామిళుడనే కుమారుడు వుండేవాడు. వాడు పరమ దురాచారుడు. దాసీ సాంగత్యపరుడు, హింసా ప్రియుడుగా వుండేవాడు. సాటి బ్రాహ్మణ గృహములోని ఒకానొక దాసితో సాంగత్యమును పెట్టుకొని, తల్లిదండ్రులను మీరి ఆ దాసీ దానితోనే భోజన శయావాదులన్నిటినీ నిర్వర్తిస్తూ, కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ విడచి పెట్టి కేవల కామాసక్తుడై ప్రవర్తించసాగాడు. తద్వారా బంధువులతో అతనిని వదలివేశారు. కులము వాళ్లు వెలివేశారు. అందువలన ఇల్లు వదలి పెట్టిపోవలసి వచ్చిన అజామిళుడు ఛండాలపువాడలోని ఒకానొక దాసీ దానితో కాపురము పెట్టి, కుక్కలనూ, మృగాలనూ ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బతికకే జనాలలో లీనమై, మధుమాంస సేవనా లోలుడై కాలమును గడపసాగాడు.
ఇలా వుండగా, ఒకనాడతని ప్రియురాలైన దాసీది, కల్లు తాగడం కోసం తాడిచెట్టు నెక్కి, కమ్మ రగడం వలన కింద పడి మరణించింది. అజామిళుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికే ఆ దాసీ దానికి యవ్వనవతియైన కూతురు వుంది. మహాపాపాత్ముడూ, మహా కామాంధుడూ అయిన అజామిళుడు, తనకి కూతురు వరుసని కూడా తలచకుండా – ఆ పిల్లనే వరించి, ఆమెతోనే కామోప భోగాలనుభవించసాగాడు. కాముకుడైన అజామిళుడు, తన కూతురి యందే అనేక మంది బిడ్డలను పొందాడు. కాని వాళ్లందరూ కూడా పసికందులుగా కడతేరిపోగా, కడగా పుట్టి మిగిలిన బిడ్డకు ‘నారాయణ’ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు. తాను తింటున్నా, నిదురిస్తున్నా ఏం చేస్తున్నా సరే సతతం అతనినే స్మరించుకుంటూ – ‘నారాయణా నారాయణా’ అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ వుండేవాడు.
కాలము గడచి అజామిళుడు, కాలము చేసే సమయము ఆసన్నమైంది. అతడిలోని జీవుని తీసుకొని పోయేందుకుగాను – ఎర్రని గడ్డములు – మీసములు కలిగి, చేత దండపాశాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు. వారిని చూస్తూనే గడగడలాడి పోయిన అజామిళుడు, ఆ ప్రాణావసాన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక, ఎక్కడో దూరముగా స్నేహితులతో ఆటలలో మునిగి వున్న కుమారుని కోసమై ‘నారాయణా, ఓ నారాయణా! తండ్రి నారాయణా’! అని పలుమారులు పిలవసాగాడు.
ఆ పిలుపు అతడి కొడుకుకు వినబడలేదు. అతను రానూ లేదు. కాని చేరువకు వచ్చిన యమదూతలు ఆ ‘నారాయణ’ నామస్మరణను విని వెనుకకు జంకారు. అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు – ‘ఓ యమదూతలారా! అడ్డు తొలగండి. ఇతడు మాచే తీసుకొని పోబడదగినవాడేగాని, మీరు తీసుకొని వెళ్లదగిన వాడు కాదు’ అని హెచ్చరించారు. వికసిత పద్మాల వలే విశాలమైన నేత్రాలు కలవాళ్లూ, పద్మమాలాంబర వసనులూ అయిన ఆ పవిత్ర విష్ణుపారిషదులను చూసి, విభ్రాంతులైన యమదూతలు ‘అయ్యా! మీరెవరు? యక్ష గంధర్వ సిద్ధ చారణ కిన్నెర విద్యాధరులలో ఏ తెగకు చెందిన వారు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా తీసికొని వెళ్లనున్న ఈ జీవుని మీరెందుకు తీసికొని వెడుతున్నారు?’ అని అడగడంతో, విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు.
కార్తీక పురాణం.. మూడవ రోజు వినాల్సి కథ..
ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే సప్తమ, అష్టమ అధ్యాయా. (సప్త – మాష్టమాధ్యాయములు) నాలుగవరోజు పారాయణము సమాప్తము