Errani Cheekati Story : ఎర్రని చీకటి..

Errani Cheekati Story
Errani Cheekati Story

Errani Cheekati Story :

చీకటి..

ఉదయం 10 గంటలు…

‘పద రా… ఇంకా ముందుకెళ్దాం… అక్కడేముందో చూద్దాం పదా…’
‘వద్దు రా… చాలా చీకటిగా ఉంది, ఏమీ కనిపించడం లేదు, ఇంత చీకట్లో ఏం కనిపిస్తుంది. ముందుకి వెళ్తే ఏముందో కూడా మనకి తెలీదు… పాములు, ఇంకా ఏమైనా ఉంటే…’
‘పాములా… నీ భయం కాకపోతే, ఈ పురాతన సొరంగాల్లో పాములు ఎందుకుంటాయి రా. ఇవి మనుషులు పోవడానికి చేసుకున్న రహస్య మార్గాలు. ఒకవేళ పాములు ఉన్నా, మన చప్పుడుకి అవి ఎప్పుడో పారిపోయి ఉంటాయి…’
‘వద్దు రా… చెప్పేది విను. ముందుకెళ్లకు… చాలు రా… ఇంత రిస్క్ చేయడం అవసరమా… ఇక్కడిదాకా తీసిన వీడియో చాలు, నీ యూట్యూబ్ ఛానెల్‌కి వ్యూస్ బాగానే వస్తాయి.. ఇక పదా…’
‘బాగా రావడం కాదు, ఎవరూ చూపించలేకపోయిన దాన్ని మనం చూపిస్తే… వ్యూస్‌లో టాప్‌లో ఉంటాం…. నువ్వు వస్తావా… రావా…
నీకు భయమేస్తే ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నా… ఇలా ప్రతీదానికి భయపడితే థ్రిల్ ఏముంటుంది రా… లైఫ్‌లో చెప్పుకోడానికి ఏదో ఒక ఎక్స్‌పీరియెన్స్ ఉండాలి కదా…’
‘ఆగు రా… చెప్పేది విను… చాలా చీకటిగా ఉంది. ఫోన్‌లో సరిగ్గా ఛార్జింగ్ కూడా లేదు. చెప్పేది విను, ఇక పద… పైకి బయటికి వెళ్లిపోదాం…
రేయ్… ఉన్నావా… రామ్… రామ్..’

పిల్లల్లో మొబైల్ వాడకం పెరగడానికి కారణాలు..

రక్తం..

ఉదయం 8 గంటలు…

నిద్రలో నుంచి ఒక్కసారిగా మెలకువగా వచ్చినట్టు అనిపించింది, మత్తుగా కళ్లు తెరిచి చూశా… చుట్టూ రక్తం…
నా కాళ్లకు, చేతులకు ఎక్కడ చూసినా రక్తపు మరకలు… నన్ను ఏదో తాడుతో కట్టేసినట్టుగా ఉంది…
కంటికేమీ కనిపించడం లేదు….
ఎటు చూసినా రక్తమే, ఎరుపు రంగు కూడా భయపడేంత ఎర్రని నెత్తురు…
నాకు భయమేసింది.. గుండె వేగంగా కొట్టుకుంటోంది…
అంత నిశ్శబ్దంలో నా గుండె చప్పుడు నాకే వినిపంచి, భయపడుతోంది…
ఇది కలే నేమో…
లేదా… ఎవ్వరైనా నన్ను కొట్టి, ఇలా కట్టేసి ఈ సంచిలో కట్టిపడేశారా…
కాళ్లు మెల్లిగా కదులుతున్నాయి… కానీ వాటిని చాపేంత చోటు మాత్రం లేదు…
ఏదో కవర్‌లో గాలి కూడా ఆడకుండా చుట్టేసిన మాంసపు ముద్దలా ఉంది నా పరిస్థితి…
అవును, ఇక్కడే ఉంటే ఊపిరాడక చనిపోతానేమో…
కాళ్లను చాపాలని గట్టిగా తన్నాను…
‘అమ్మా…’… ఎవరిదో అరుపు…
ఆ అరుపు వినగానే నా మనసులో చివుక్కుమంది…
పాపం ఎందుకు అరుస్తుందో… తనకి ఏ కష్టమొచ్చిందో… తన గురించి ఆలోచించేంత సమయం నాకు లేదు. ముందు ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలి.
నన్ను నేను కాపాడుకోవాలి…
మరోసారి తన్నాను…
మళ్లీ అదే అరుపు… ‘అమ్మా…’ అని… అరక్షణం ఆగి మళ్లీ తన్నాను.
ఎలాగైనా ఈ ఇరుకులో నుంచి, కళ్లను కాల్చేస్తున్న ఈ రక్తపు సంచిలో నుంచి బయటపడాలనే తాపత్రయం నాది…
‘అమ్మా…’ మళ్లీ ఆ అరుపు వినిపించింది…
‘బావా… బావా…’
‘హా.. ఏంటి?’
‘ఒకసారి ఇటు రావా…’
‘హా… ఏంటి?’
‘ఇదిగో చూడు… ఎలా తంతున్నాడో…’ బయటి నుంచి ఎవరివో మాటలు వినిపించాయి.
నన్ను కట్టేసిన ఆ సంచిపైన ఎవరో తాకుతున్న అనుభూతి…
కాపాడండి, రక్షించండి… నన్ను బయటికి తీయండి… అని అరవాలనుకున్నా…
కానీ మాటలేవీ బయటికి రాలేదు…

మీ భాషాభిమానం తగలెయ్యా! బెంగళూరులో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సీన్స్..

భయం..

ఉదయం 11 గంటలు…
చాలా దూరం వచ్చేసినట్టున్నా… ఇలాంటి రిస్క్ చేయడం అంటే, నాకు భలే సరదా…
అడ్వెంచర్స్‌లోనే హ్యాపీనెస్ వెతుక్కునేవాళ్లల్లో నేను ఒకడిని…
నా ముందు ఏదో ఉన్నట్టు అనిపించింది. అదేంటో చూడాలనే కంగారులో ఓ రాయి మీద అడుగేశా…
అంతే ఒక్కసారిగా కిందపడిపోయా… ఫోన్ చేతుల్లో నుంచి ఎగిరి ఎక్కడో పడిపోయింది…
కిందపడేసరికి, ఈ రాళ్లకు బలంగా తగిలిందేమో, ఆఫ్ అయిపోయింది…
చుట్టూ చీకటి… ఫోన్ ఎక్కడుందో ఎలా వెతకాలి…
కళ్లు తెరిచి ఉన్నా, నల్లని నలుపు కూడా కనిపించనంత కారు చీకటి…
కాసేపు కళ్లు మూసుకున్నా… ఏదో తెలియని రిలాక్సేషన్…
కళ్లు తెరిచినప్పటికంటే, మూసుకుంటేనే కాస్త వెలుగుని చూస్తున్నట్టు అనిపించింది…
చేతిలో లైట్ ఉన్నంతసేపు ఎటు పోతున్నానో, ఎలా పోతున్నానో కూడా ఆలోచించకుండా వచ్చేశా…
సొరంగం మధ్యలో ఎక్కడున్నానో కూడా తెలీదు…
‘రేయ్.. సాయి… ఉన్నావా…’
నా పిలుపు, నాకే రీ సౌండ్‌లో వినిపించి భయపెడుతోంది…
అయినా వాడికి చాలా భయం, ఇంత దూరం ఒంటరిగా వచ్చే సాహసం చేయలేడు… అక్కడే నేనొస్తానని ఎదురుచూస్తూ ఉండొచ్చు…
కళ్లు తెరిచి చూస్తే, చీకటి… మూసుకుంటే భయం…
చీకటి… ఇంత భయంకరంగా ఉంటుందా…
ఇప్పుడు ఎటు వెళ్లాలి, ఎలా వెళ్లాలి..
ధైర్యం చేసి, చేతులతో పక్కనున్న రాత్రి గోడలను తాకి చూశాను…
వచ్చేటప్పుడు పెద్దగా గమనించలేదు కానీ, చుట్టూ రాళ్లకి పాకర పట్టి ఉంది…
పట్టుకోవడానికి కూడా గ్రిప్ కూడా దొరకడం లేదు… పట్టుకుని నడవాలని ప్రయత్నిస్తే, పట్టు తప్పుతోంది…
ఎలాగైనా వెళ్లాలి… ఎక్కువ సేపు ఇక్కడే ఉండలేను…
ముందుకు కొన్ని అడుగులు వేశా… ఓ రాయి కాలికి బలంగా తగిలింది…
‘అమ్మా….’ నొప్పితో నా నోట్లో నుంచి వచ్చిన మాట…
అయినా ఆగకుండా మరో అడుగు ముందుకేశా…
కాళ్లకు నీళ్లు తగిలాయి… ఎన్నో రోజులుగా ఇంకిపోకుండా ఉన్న నీళ్లు… గబ్బిలాలు, కప్పల మలమూత్రాలతో కంపు కొడుతున్నాయి… చెప్పులకీ, అరికాళ్లకు మధ్య చేరిన రాళ్లు కరుస్తున్నాయి…
సొరంగంలో ఎంతోసేపటి నుంచి వంగి నడుస్తున్నా.. నడుము! ఒక్కసారి లేవమని కోరుకుంటోంది… లేచి నిటారుగా నిలబడమని, నిలదీస్తోంది…
రాయి కింద తగిలింది కాబట్టి పెద్దగా దెబ్బ తగల్లేదు. అదే రాయి పైన ఉండి ఉంటే, నా నెత్తికి బలంగా తగిలి ఉంటే, ఏమయ్యేది…
అయినా ఈ నీళ్ల మధ్యలో ఊబి ఉందేమో, నేను ముందుకు అడుగు వేస్తే, నేను అందులో పడిపోవచ్చేమో…
ముందుకు వెళ్లే కొద్దీ, సొరంగం చిన్నదైపోతే…
సొరంగంలో ఇరుకున్న నా మస్తకసొరంగాల్లో ఆగని ఆలోచనల ప్రవాహం…
ఏవేదో ఆలోచనలు…
అయినా ఆగని అడుగులు… చెప్పులకీ, కాళ్లకీ మధ్య ఉన్న రాళ్లు పైకి పాకుతున్నట్టుగా అనిపించింది…
అవి నిజంగా రాళ్లేనా… లేక…
గుండె మరింత వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది…

లేడీ అసిస్టెంట్‌తో హాలీవుడ్ హీరో పాడు పని! 13 ఏళ్ల తర్వాత కేసు..

ఆకలి..

మధ్యాహ్నం 2 గంటలు…
బాగా ఆకలిగా ఉంది…
గొంతు తడి ఆరిపోతున్నట్టుగా అనిపిస్తోంది…
దాహం…
నీళ్లు కావాలని గట్టిగా అరవాలని ఉంది…
ఎంతో ప్రయత్నించా… గొంతు పెకిలించి అరవాలని,
కానీ మాట బయటికి రాలేదు…
నా గొంతు…. నా గొంతుకి ఏమైంది…
కళ్లకు ఎర్రని నెత్తురు తప్ప ఏమీ కనిపించడం లేదు…
నేను ఎక్కడున్నా అస్సలు..
ఎవరు నన్ను ఇలా కట్టిపడేశారు…
అయినా నేను వాళ్లకి ఏ కీడు చేశా…
నాకు అస్సలేమీ అర్థం కావడం లేదు…
ఇది నిజంగా కలేనేమో…
లేవాలి… త్వరగా ఈ కలలో నుంచి నిద్ర లేవాలి…
ఏడవాలని అనిపించింది…
ఏడుపు కూడా రావడం లేదు.. అంటే ఇది కలే…
లేరా! త్వరగా నిద్ర లే… ఇక పడుకుంది చాలు.. నిద్రలే…
నాకు నేను అనుకుంటున్నా…

నిద్ర..

మధ్యాహ్నం ఒంటి గంట…
నల్లని చీకటిలో మరింత నల్లని కాంతులతో నిండిన దట్టమైన పొగ…
నలుపులో కూడా కాంతి ఉంటుందా… ఏదో కనిపిస్తోందా…
చీకటిలో చిత్ర విచిత్రమైన ఆకారాలు…
ఆలోచనలను అదుపు చేస్తూ, అలా కిందకి వంగి కాళ్ల దగ్గర చూసుకున్నా… నా అనుమానం నిజమే..
అవి రాళ్లు కావు, చేతులకు పురుగుల్లా తగులుతున్నాయి…
గండుచీమల కంటే పెద్దగా…
అవేంటి… అవి కుడితే ఏమవుతుంది… అంత ఆలోచించే ధైర్యం నాకు లేదిప్పుడు…
నిశ్శబ్దం… ఏదైనా వినిపిస్తే బాగుండని చెవులు వెతుకుతున్నట్టుగా అనిపించింది..
చీకటి… ఏదైనా కనిపిస్తే బాగుండని కళ్లు ఆశగా వేడుకుంటున్నట్టుగా తోచింది…
కళ్లు, ఓ కాంతి కిరణాన్ని చూడడానికి ఇంతగా అల్లాడిపోతాయా…
చెవులు… ఓ మాట వినడానికి ఇంతగా తపించిపోతాయా..
ఏవో ఏవో ఆలోచనలు…
ఆలోచనల సుడిగుండంలో పడి కళ్లను కమ్మేసిన నిద్ర…
కళ్లు తెరిచి చూడడానికి భయపడుతూ… నన్ను ముంచేసిన నిద్ర…

అలవాటు నుంచి కల్చర్‌గా మరుతున్న స్మోకింగ్..

ఏడుపు..

మధ్యాహ్నం 4 గంటలు…
చేతులకు ఏదో తగులుతున్నట్టుగా ఉంది… ఏంటిది?
రక్తం…. ఎవరిది? నాదేనా?
నాకు ఎక్కడా గాయమైనట్టుగా నొప్పి కూడా తెలియడం లేదే…
అంటే నా శరీరం చచ్చుపడిపోయిందా…
ఇక ఈ రక్తపు మూటలో ఉండకూడదు…
ఎలాగైనా బయటపడాలి…
కాళ్లతో ఆ సంచిని కసితీరా తన్నడం మొదలెట్టా…
విడిపించుకోవడానికి చేతులతో నా చేతనైనంత అటు ఇటు తిప్పడం మొదలెట్టా…
స్వేచ్ఛ… ఎలాగైనా భయటపడాలనే ప్రయత్నం…
ఈ ఇరుకిరుకు ఎర్రరంగు జీవన పోరాటం నుంచి బయటిపడాలని, సప్త వర్ణాలను అందుకోవాలనే ఆశ…
నా ప్రయత్నం ఫలించినట్టే అనిపించింది…
బయటి నుంచి అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి…
కానీ నా అరుపు మాత్రం నాకే వినిపించడం లేదు…
బయటపడాలి… ఎలాగైనా ఈ ఊబిలో నుంచి బయటపడాలనే ఆలోచన నన్ను ఆగనివ్వడం లేదు…
నేనున్న సంచిని ఎవరో లాగుతున్నట్టుగా అనిపించింది…
నాకు ఎవరైనా సాయం చేస్తున్నారా? లేదా నన్ను ఆపాలని ప్రయత్నిస్తున్నారా…
ఏమో నాకు తెలీదు, తెలుసుకోవాలని కూడా లేదు, ఎందుకంటే..
నేను ఆగను… ఇక ఇక్కడ ఉండలేను… ఎలాగైనా బయటపడాలి…
కాళ్లతో తంతూనే ఉన్నా…
బయట ఉరుకులు, పరుగులు, ఏడుపులు… అటు ఇటు కదులుతున్న కంగారు తెలుస్తోంది…
ఎవరో బిగ్గరగా ఏడుస్తున్నారు…
‘అమ్మా… నొప్పి తట్టుకోలేకపోతున్నాననమ్మా… ’ అంటూ బాధతో తల్లడిల్లిపోతున్నారు..
ఆ అరుపులు, నా చెవులను తాకుతున్నాయి. కానీ ఆ కేకలు, నా కాళ్లను మాత్రం కట్టేయలేకపోతున్నాయి…
అలాగే తంతూ, బయటపడాలని ప్రయత్నిస్తూనే ఉన్నా…
ఏం జరుగుతుందోనని ఆలోచిస్తుండగానే మరింత ఎర్రగా…
ఇంకా ఎర్రగా మారింది నేనున్న ఆ సంచి…
రెండు తెల్లని చేతులు… నన్ను లేపాయి…
ఆ సంచిలో నుంచి బయటికి తీశాయి..
నన్ను కట్టేసిన ఆ తాడుని కత్తిరించేశాయి…
స్వేచ్చ…
వెలుతురు… రంగులు…
నేను బయటపడ్డా… నేను సాధించా, నేను సాధించా… అని గట్టిగా అరవాలని అనిపించింది…
మాటలు రాలేదు… వచ్చింది ఒక్కటే…
ఏడుపు…
గుక్కబెట్టి మరీ ఏడవడం మొదలెట్టా…
అప్పటిదాకా ఏడ్చిన ఆ అమ్మ ఏడుపు, నా ఏడుపు వినగానే ఆగిపోయింది…

ఆ మేనేజర్ మతిమరుపు, సావిత్రి కెరీర్‌నే మార్చేసింది! భానుమతి ప్లేస్‌లో ‘మహానటి’..

వెలుగు..

సాయంత్రం 5 గంటలు…
ఆ చిమ్మచీకట్లో, అలా బురదలోనే ఎప్పుడు పడుకున్నానో తెలీదు… నిద్రపోయా…
ఏం చేయాలో తెలియనప్పుడు, ఏదీ చేతకానప్పుడు చేయగలిగింది నిద్రపోవడం ఒక్కటే..
అప్పుడన్నా… ఆ నిద్రలోనైనా ఇది ఓ కలలా కరిగిపోతుందనే ఆశ…
కళ్లు తెరిచి చూశా…
ఇంకా ఆ చీకట్లోనే…
ఏం చేయాలి, ఎలా బయటపడాలి…
దిక్కుతోచన స్థితి అంటే ఇదేనేమో… నిజంగా ఇక్కడే ఇలాగే చనిపోతే, ఆ విషయం ఎవ్వరికైనా తెలుస్తుందా..
ఎక్కడో ఉన్న ఈ సొరంగంలోకి, అదీ ఇంత లోపలికి వచ్చి ఓ మనిషి కోసం ఎవ్వరైనా వెతుకుతారా…
అయినా, నాలా ఇంతకుముందు ఎవరైనా ఇలా వచ్చి, ఇలా చనిపోయారేమో…
చావుకి కూడా తన చావు నచ్చేలా ఉండాలట… ఇలా ఎక్కడున్నామో, ఎలా ఉన్నామో కూడా తెలియకుండా పోతే… అది చావేనా?
నవ్వొచ్చింది…
సొరంగంలో ఇరుక్కున్నందుకు కాదు, ఈ ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుని, నా ప్రాణాలు పోతాయేమోనని…
ఆ చీకట్లో… దూరంగా ఓ గుడ్డి దీపంతా కనిపించీ, కనిపించని వెలుతురు…
నిజమేనా…
చీకటిని చూసి చూసీ నేనే అలా ఊహించుకుంటున్నానేమో…
ఆ వెలుతురు కొద్దికొద్దిగా పెరిగింది..

ఆశ..
అది నిజమైతే బాగుండు..
నీళ్లల్లో అడుగులు పడుతున్న చప్పుడు…
‘రామ్… ఒరేయ్ రామ్…’ చాలాసేపటి తర్వాత చెవులకో శబ్దం…
ఆనందం…
‘రామ్… ఎక్కడున్నావ్ రా…’
ఆ పిలుపు… ఆ ఒక్క పిలుపు… తెలియని శక్తిని నింపింది…
లేచాను.. అరుస్తూ అటువైపు పరుగెత్తాను…
అప్పుడు… అంతసేపు నాలో నిండింది భయమా… నిరుత్సాహమా..
ఏమో ఆ క్షణాన అవేమీ ఆలోచించలేదు…
వెలుగు…
వెలుగు…
నాకు తెలియకుండానే నా నోటిలో నుంచి వచ్చిన మాటలు… కళ్లల్లో నుంచి జారుతున్న నీళ్లు…

Love Guru : వరల్డ్ ఫేమస్ లవ్ గిఫ్ట్

మరణం..

రాత్రి 8 గంటలు…
‘థ్యాంక్యూ రా… సాయి… నాకోసం నువ్వు ఇంత రిస్క్ తీసుకుని లోపలికి వస్తావని అనుకోలేదు… నేను మరణాన్ని జయిస్తే, నువ్వు నీ భయాన్ని జయించావు రా…’
ఆ సమయంలో నా గొప్పని చూపించుకోవాలనే ప్రయత్నం…
‘సరే కానీ… పద రా… నీకు ఫోన్ వచ్చింది…’ వాడి మాటల్లో కంగారు…

ఆసుపత్రి..

‘ఎక్కడికి వెళ్లావురా.. నీ భార్యని ఇలా ఒంటరిగా వదిలేసి… నిండు చూలాలు. తనకి నొప్పులు వచ్చాయి…. ఎవ్వరూ లేకపోయేసరికి నేనే అంబులెన్స్‌కి ఫోన్ చేసి ఇక్కడికి తీసుకొచ్చా… ’ చెప్పింది పక్కింటి పెద్దమ్మ…
‘థ్యాంక్యూ అండీ…’ అని మనస్ఫూర్తిగా చెప్పలేకపోయాను…
‘హా… మీరేనా ఆమె భర్త… మీకో విషయం చెప్పాలి…’ అన్నాడు డాక్టర్…
‘హా… ’ చెప్పండి డాక్టర్…
‘సాధారణంగా గర్భంలో ఉన్న పిల్లలు చాలా సెక్యూర్‌గా, సేఫ్‌గా ఫీల్ అవుతాయి. 9 నెలలు నిండిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు, తల్లి గర్భాన్ని వీడుతున్నందుకు భయంతో, బయటి వాతావరణంలోకి వచ్చాక ఈ కొత్త వాతావరణాన్ని తట్టుకోలేక ముడుచుకుపోతారు… ఏం చేయాలో తెలియక ఏడుస్తారు…
కానీ మీ పాప దీనికి భిన్నంగా చేసింది. లోపల తను చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యింది. తనని ఎవరో బలవంతంగా కట్టేసినట్టుగా భావించి, బయటపడేందుకు ప్రయత్నించింది. అందుకే గర్భాన్ని చీల్చేందుకు కాళ్లతో తన్నుతూ, గోర్లతో గిచ్చుతూ… He tried to kill her Mother…
కడుపులో నుంచే హత్య చేయడంలాంటిదే… కానీ లక్కీగా మీ వైఫ్‌‌ని కాపాడగలిగాం… కానీ బాబు మాత్రం, నీటిని మింగడంతో పుట్టిన కొద్దిసేపటికే…’ అసంపూర్తిగా చెప్పాడు డాక్టర్…
నాలో నిశ్శబ్దం…
‘కరెంట్ పోయింది.. ఆ జెనరేటర్ ఆన్ చేయండి…’ వెనకి నుంచి వినిపిస్తున్న మాటలు…

– చింతకింది రాముడు (Chinthakindhiramu777@gmail.com)

Crime Story : క్రైమ్ రిపోర్టర్..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post