Crime Story : క్రైమ్ రిపోర్టర్..

Crime Story : ఆపరేషన్ థియేటర్ ముందు మౌనంగా నిల్చున్నాడు ప్రవీణ్. అతని భార్య, అతనికి కొంచెం దూరంగా గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది. పక్కనే వాళ్ల అమ్మ అనుకుంటా, ఆమెను పట్టుకుని తానూ ఏడుస్తోంది. ఆమె ఒళ్లో ఓ రెండేళ్ల బాబు ప్రశాంతంగా పడుకున్నాడు. ఆ ప్రాంతమంతా హృదయవిదారకంగా అనిపించింది నాకు. అక్కడ ఉండలేకపోయాను, కానీ ఉండాలి తప్పదు.

మాకు కొంచెం దూరంలో ఇద్దరు పోలీసులు, ఇవేమీ పట్టనట్టు మాట్లాడుకుంటూ టీ తాగుతున్నారు.
డాక్టర్ వచ్చాడు, ప్రవీణ్ వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్లి ‘బతికే ఉందా సార్…’ అని అడిగాడు. ఆ ప్రశ్న నాకు కొంచెం వింతగా అనిపించింది. ఎవరైనా సరే, అలాంటి పరిస్థితుల్లో  ఉంటే ‘ఎలా ఉంది సార్, ఏం కాలేదు కదా?’ అని ఆశగా అడుగుతారు. కానీ ప్రవీణ్ మాత్రం ‘బతికే ఉందా?’ అంటూ అడిగాడు.

దుబాయ్ లో పట్టుబడ్డ మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఓనర్..

ఆ మాటల్లో ఇంత జరిగాక, ఇంకా బతికే ఉంటే… అనే భయం, కర్కశత్వం వినిపించాయి నాకు…
అవును, అతని ప్లేస్‌లో ఉండి ఆలోచిస్తే, ప్రవీణ్ బాధ నిజమేనేమో. ఇలాంటి దారుణ సంఘటన తర్వాత బతికే ఉంటే? ఈ భయాన్ని, ఆ దారుణాన్ని, క్షణమైనా భరించలేని మానసిక క్షోభను జీవితాంతం భరించాల్సి ఉంటుంది. దానికంటే చావు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.

ప్రవీణ్ కూడా అలాగే అనుకుంటున్నాడేమో… నాలాగే డాక్టర్ కూడా ప్రవీణ్ ప్రశ్నకు కాస్త ఆశ్చర్యపోయినట్టున్నాడు. కానీ ప్రవీణ్ సత్తువ చచ్చిన కళ్లల్లోకి చూసి సమాధానం చెప్పలేకపోయాడు. మౌనంగా కళ్లు దించి, లేదన్నట్టుగా తలూపి వెళ్లిపోయాడు.

ప్రవీణ్ భార్య, ఆమె పక్కనున్న వాళ్లమ్మ ఒక్కసారిగా బోరున ఏడవడం మొదలెట్టారు. వారి ఏడుపులతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతోంది. అప్పటిదాకా అమ్మమ్మ ఒడిలో పడుకుని నిద్రపోయిన కుర్రాడు కూడా వీరి ఏడుపులకు లేచి, ఏమైందో అర్థం కాక ఏడవడం మొదలెట్టాడు.. ప్రవీణ్ మాత్రం మౌనంగా ఆపరేషన్ థియేటర్ అద్దాల వైపు చూస్తున్నాడు. అతను ఏం ఆలోచిస్తున్నాడో కూడా నా ఊహకు అందడం లేదు.

పోలీసులు మాత్రం అవేమీ పట్టనట్టుగా డాక్టర్‌తో ఏదో మాట్లాడుతున్నారు. నేను కూడా వారితో కలిసి కొన్ని పేపర్లు అడిగి తీసుకున్నాను… ఇక అక్కడ ఉండాల్సిన అవసరం నాకు లేదు. ప్రవీణ్‌నీ, గుండెలు పగిలేలా ఏడుస్తున్న అతని భార్యను, ఏం జరుగుతుందో కూడా అర్థం కాక ఏడుస్తున్న ఆ రెండేళ్ల బాబును చూస్తూ… ఆసుపత్రి నుంచి బయటికి వచ్చాను…

ఫేక్ వీడియోలు చేయడం కూడా నేరమే! రష్మిక వీడియోపై మొదలైన రచ్చ..

***
సంఘటన జరిగిందని చెబుతున్న ప్లేస్‌కి వెళ్లాను. చాలా చిన్న కాలనీ, ఇళ్లనీ ఇరుకిరుకుగా కట్టుకోవడంతో కారు వెళ్లడానికి కూడా రోడ్డు కూడా మిగల్లేదు. మెయిన్ రోడ్డు నుంచి ఎన్నో గల్లీలు దాటుతూ వస్తే కానీ సరైన అడ్రెస్ పట్టుకోలేకపోయాను. ఏరియా అంతా చాలా ప్రశాంతంగా ఉంది. మామూలుగా అయితే ఇలా ఉండదనుకుంటా. కానీ ఇలాంటి దారుణ సంఘటన జరిగిందని తెలిసిన తర్వాత పిల్లలను బయటికి పంపడానికి తల్లిదండ్రులు భయపడి ఉంటారు.

ఆ ఇంటిదగ్గర మాత్రం పోలీసుల హడావుడి కనిపించింది. ఆ చుట్టుపక్కల వాళ్లు, ఇళ్లపైకి ఎక్కి పోలీసులు ఉన్న ఇంటివైపు ఆసక్తిగా చూస్తున్నారు. చాలా చిన్న ఇళ్లు. బయట ఉన్న పోలీసులను అడిగి లోపలకి వెళ్లాను. అది రెండు గదుల ఇళ్లు. ఇళ్లు అనే కంటే రెండు రూమ్స్ అంటే సరిపోతుంది. ఎక్కడైతే సంఘటన జరిగిందో, ఆ రూమ్‌లో చాక్‌పీస్‌తో గుర్తులు గీశారు. మిగిలిన గదిలో ఆ ఇంట్లో వాళ్లు ఉన్నారు. వాళ్ల దగ్గరికి వెళ్లాను…

అతని భార్య ఏడుస్తూ తల బాదుకుంటోంది. ఆమె చేతికి ఉన్న గాజులు పగిలి, నుదిటి దగ్గర గీసుకుపోయాయి. ఆమె పక్కనే ఇద్దరు చిన్న పిల్లలు, బహుశా ఓ ఐదారేళ్లు ఉంటాయేమో.. ‘వద్దమ్మా, ఏడవకమ్మా…’ అని తల్లిని బ్రతిమిలాడుతూ వాళ్లూ ఏడుస్తున్నారు. ఆమెతో పాటు మరో ముగ్గురు మహిళలు ఆ రూమ్‌లో ఉన్నారు. అందరూ ఆమెని ఓదారుస్తూ, చీరలతో కళ్లు తుడుచుకుంటూ వాళ్లూ ఏడుస్తున్నారు. అప్పుడప్పుడూ పోలీసులను తిట్టడం వినిపించింది…

‘రాజు… మీ ఆయనేనా…’ వచ్చిన పని పూర్తిచేసుకుని వెళ్లాలని, వాళ్ల ఏడుపులను పట్టించుకోకుండా అడిగాను. కానీ ఎవ్వరూ సమాధానం ఇవ్వలేదు. నన్ను పట్టించుకున్నట్టు కూడా గమనించలేదు. ‘హాలో… అమ్మా… మిమ్మల్నే అడిగేది… రాజు మీ ఆయనేనా… ఎందుకిలా చేశాడు… ’ మరి కొంచెం గొంతు పెంచి అడిగాను…

ఆమె కోపంగా నా వైపు చూసింది… ‘అవును సర్.., అవును… రాజు మా ఆయనే. పొద్దున్నుంచి ఈ పోలీసులు అడిగిందే అడిగి చంపుతున్నరు. ఇప్పుడు నువ్వు తయారయ్యావా? ఏం కావాలి నీకు…’ అంటూ ఏడుస్తూనే కోపంగా సమాధానం చెప్పింది.

అలాంటి రియాక్షన్ నాకు కొత్తేమీ కాదు, ఇలాంటి కేసుల్లో చాలాసార్లు ఇలాగే సమాధానం వస్తుంది. అందుకే ఆమె బాధను పట్టించుకోకుండా ‘రాజు ఏం చేస్తుంటాడు, అతనిలో ఇలాంటి ఆలోచనలు ఎప్పటి నుంచి ఉన్నాయి. మీతో సరిగానే ఉండేవాడా?’ అంటూ వరుసగా ప్రశ్నలు అడిగేశాను…
‘మా ఆయన చాలా మంచోడు. ఆటో నడిపేవాడు. వాడికి పిల్లలంటే ప్రాణం. ఇదిగో ఈ ఇద్దరు బుడ్డోళ్లు మా పిల్లల్లే. వీళ్లకి నా కంటే వాళ్ల నాన్నంటేనే చాలా ఇష్టం. వాడెందుకు ఇలాంటి పని చేస్తాడు.. ఎవరో ఆ పిల్లను అట్టా చేసి, ఇడ పాడేసి పోయి ఉంటరు. అంతేకానీ రాజు అట్లా చేసేటోడు కాదు… ప్లీజ్ సార్, మా ఆయన్ని వదిలేయండి. ఈ ఇద్దరు పిల్లలకు తండ్రి లేకుండా చేయకండి. మీ కాళ్లు మొక్కుతా..’ అంటూ నా కాళ్ల మీద పడింది…

ఆమె అలా చేసేసరికి ఒక్కసారిగా నా కళ్లు చెమర్చాయి. నిజంగా వాడు ఎందుకు అలా చేశాడో కానీ ఇప్పుడు వీళ్ల పరిస్థితి ఏంటి? ఇద్దరూ చిన్న పిల్లలు… వాళ్ల తిండి, బట్టలు, స్కూల్ ఫీజులు… పిల్లలను పెంచడానికి ఆమె ఎన్ని కష్టాలు పడాల్సి ఉంటుందోనని తలుచుకుంటేనే బాధేసింది…

స్వాతి చెప్పినట్టుగా ‘month of madhu’ మూవీలో నిజంగా అంతుందా?

‘Good Afternoon Sir’ నా ఆలోచనలను చెదరగొడుతూ విష్ చేశాడు ఆకాశ్. ‘హా.. ఆకాశ్ ఏంటి ఇంత లేటు. పద స్పాట్ చూపిస్తాను…’ అంటూ పక్కరూమ్‌కి తీసుకెళ్లాను. ఆకాశ్ నేను పనిచేసే పత్రికలో ఫోటోగ్రాఫర్, అవసరాన్ని బట్టి చెప్పిన చోటుకి వెళ్లి ఫోటోలు తీయడం అతని పని. ‘అసలు ఏం జరిగింది సార్…’ ఏ యాంగిల్‌లో ఫోటోలు తీయాలో క్లారిటీ కోసం ఆ ప్రశ్న వేశాడు ఆకాశ్. అవును, క్రైమ్ సీన్‌ని బట్టి, ఫోటో తీసే యాంగిల్ మారుతూ ఉంటుంది.. బాధితుల దయనీయ స్థితిని, చదివేవాళ్లకి కళ్లకు కట్టినట్టు చూపించేది ఈ ఫోటోలే కదా…

***

ఆరేళ్ల చిన్న పాప… ఇదిగో ఈ పక్కఇంట్లోనే ఉండేది. ఈ ఇంట్లో ఉండే రాజు అనే ఆటో డ్రైవర్, ఆ పాపను అతి దారుణంగా రేప్ చేసి, చంపేశాడు. సాయంత్రం బయట ఆడుకుంటున్న పాప కనిపించకపోయేసరికి, పాపం… వాళ్ల అమ్మానాన్న చుట్టుపక్కల మొత్తం వెతికారు. ఫ్రెండ్స్‌ ఇంటికి వెళ్లిందేమోనని అక్కడా ఇక్కడా అంతా తిరిగి వెతికి చూశారు. ఎక్కడా కనిపించకపోయేసరికి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. అప్పటికే చాలా రాత్రి అయ్యిందని, వాళ్లు ఫార్మాలిటీగా కేసు నమోదు చేసి, వీళ్లను ఇంటికి పంపించేశారు…

పొద్దున్నే చూస్తే, ఇదిగో ఈ గదిలో పాప కనిపించిందట. ఒళ్లంతా రక్తం, అరుస్తుందేమోననే పాప నోట్లో గుడ్డలు కుక్కాడు. తెల్లవారుజామున తలుపులు మూసి, కంగారుగా పారిపోతుంటే ఎదురింటి వాళ్లు చూశారంట. రాజు వాళ్లవిడకి అతనికి కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. మూడు రోజుల ముందే ఆమె పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. మనిషి ఎందుకింత కంగారుగా వెళ్తున్నాడా? అని అనుమానం వచ్చి, ఎదురింటామె పాప తల్లిదండ్రులకు చెప్పింది.

వాళ్లు అనుమానంతో డోర్ పగులకొట్టి చూస్తే… అదిగో చాక్‌పీస్ గీశారు చూడు, ఆ మూలన పాపను పడేసి వెళ్లాడు. గోడల నిండా రక్తం. రేప్ చేసిన తర్వాత విషయం ఎవరికైనా చెబుతుందనే భయంతో పాప తలను గోడకేసి కొట్టి ఉంటాడు… ఆరేళ్ల పాప ఎంత నరకం అనుభవించిందో….

నా మాటలని శ్రద్ధగా వింటూ, ఫోటోలు తీస్తున్న ఆకాశ్… ఒక్క నిమిషంసేపు ఆగిపోయాడు. ‘చెత్త నా… కొడుకులు. అసలు అంత చిన్న పాపను ఎలా సార్, ఇలా చేయాలనిపిస్తుంది. అసలు దయ, జాలి, కనికరం అనేవి ఉండవా… ’ కోపంగా అతన్ని తిడుతున్నాడు ఆకాశ్…

‘నిజంగా ఇలాంటి వాళ్లని రోడ్డు మీద నిలబెట్టి అడ్డంగా కోసేయాలి… కాళ్లు, చేతులు నరికేసి, రోడ్డు మీద వదిలేయాలి… ఇలాంటి వాళ్ల మధ్యన మనం బతుకుతున్నామా… సర్’ ఆవేశంగా ఆపుకోలేక, తిడుతూనే ఉన్నాడు ఆకాశ్…

‘కంట్రోల్ ఆకాశ్… వీళ్లు మనలాగే చాలా కామన్ పీపుల్. నువ్వు అనుకుంటున్నట్టు సినిమాల్లో చూపించినట్టో రేప్ చేసేవాడికి ఓ దరిద్రమైన ఫ్లాష్‌బ్యాక్ ఏమీ ఉండదు. ఇతన్నే తీసుకో, రాజు ఓ ఆటో డ్రైవర్. పదో క్లాస్ దాకా చదివాడు. అదిగో ఆ రూమ్‌లో ఏడుస్తోంది చూడు ఆమె వాడి భార్య… ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని 18 ఏళ్లకే లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ పక్కనున్నారే ఆ ఇద్దరు వాళ్ల పిల్లలే… వాడికి పిల్లలంటే చాలా ఇష్టం. తన పిల్లలతో పాటు పక్కింట్లో ఉంటే ఈ పాపకి కూడా చాక్లెట్లు తెచ్చేవాడు…

‘అవునా… అంటే అప్పటి నుంచే ఇలా చేయాలని ప్లాన్ వేశాడా? ’ అనుమానంగా అడిగాడు ఆకాశ్…
‘అదేమీ లేదు… చాలా నార్మల్‌గానే ఉండేవాడు. ఆ టైంలో ఎందుకు అలా చేశాడో అతనికి కూడా తెలీదు…’ క్లియర్‌గా చెప్పాను నేను…

‘బాగా తెలిసినట్టు చెబుతున్నారు? మీకెలా తెలుసు?’ అనుమానంగా అడిగాడు ఆకాశ్… ‘అవును పొద్దునే కలిశా. ఈ న్యూస్ రాగానే డీటేయిల్స్ తెలుసుకుందామని పోలీస్ స్టేషన్‌కి వెళ్లాను. అక్కడే కూర్చుని ఏడుస్తున్నాడు. బిత్తరగా చూస్తూ వణికిపోతున్నాడు.

అతని కాళ్లకు, చేతులకు అంతా రక్తం… ఆ నెత్తురు చూసుకుని ఇంకా ఇంక ఏడుస్తున్నాడు… అతని దగ్గర మందు వాసన కూడా వస్తోంది. రాత్రి ఫుల్లుగా వొళ్లు తెలియకుండా తాగినట్టున్నాడు. మత్తు దిగేసరికి భయంతో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు… విషయం తెలియగానే అతని భార్య, పిల్లలతో సహా ఇంటికి వచ్చింది…’

‘అవునా.,.. మరి న్యూస్ ఛానెల్స్‌లో ఏంటి, రాజు పారిపోయాడని అంటున్నారు…’ అయోమయంగా అడిగాడు ఆకాశ్… ‘అది అంతేలే పద…’ అంటూ అతన్ని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చేశాను…

***

‘హైద్రాబాద్‌లో మరో దారుణం, ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం…’ మెయిన్ పేపర్‌లో వచ్చిన వార్తను గర్వంగా చూసుకున్నాను…  ‘థ్యాంక్యూ సర్…’ మీ కవర్ స్టోరీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంకో మూడు, నాలుగు రోజులే మీదే హవా…’ అంటూ చేతులు అందించాడు ఆకాశ్…

‘థ్యాంక్యూ ఆకాశ్…’ అంటూ నా మెడలో ఉన్న ఐడీ కార్డును చూసుకున్నా… ‘క్రైం రిపోర్టర్ సతీష్…’ గర్వపడాలో, సిగ్గుపడాలో బాధపడాలో అర్థం కాలేదు…  ‘ఎఫ్‌బీలో మీ పోస్టు చేశా, చాలా ఎమోషనల్‌గా రాశారు. లైక్ కొట్టి, RIP society అని కామెంట్ కూడా పెట్టాను… చూశారా సార్…’ అడిగాడు ఆకాశ్…
‘హా ఆకాశ్… చూశాను… థ్యాంక్యూ…’ నా నుంచి అతను ఆశించిన సమాధానం ఇచ్చేశా…
అలా మూడు రోజులు గడిచిపోయాయి…

‘ఆకాశ్, పద మనకి మళ్లీ పని పడింది…’ అంటూ ఫోటోగ్రాఫర్‌కి ఫోన్ చేశాను.
‘హా… సర్, వస్తున్నా…’ అతని మాటల్లో తెలియని ఉత్సాహం, సంతోషం…
పక్కనే టీవీలో బ్రేకింగ్ న్యూస్…
‘ఆరేళ్ల చిన్నారి హత్యకేసు నిందితుడు రాజు ఎన్‌కౌంటర్…’
‘ఎట్టకేలకు హైద్రాబాద్‌లో కిరాతకుడి చేతుల్లో దారుణ హత్యకు గురైన ఆరేళ్ల పాపను న్యాయం జరిగింది. మూడు రోజులుగా పోలీసులకు దొరక్కుండా పరారీలో ఉన్న నిందితుడు రాజును పోలీసులు నగర శివారులో ఎన్‌కౌంటర్ చేశారు…’ అంటూ తిప్పి తిప్పి అదే వార్తను చదువుతోంది న్యూస్ రీడర్…

శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథే ‘సలార్’… ‘కేజీఎఫ్’తో లింక్..

అది వింటూ సిగరెట్ పొగను గాల్లోకి ఊదుతున్నా… ఆ పొగ చెదిరిపోతుంటే, రోడ్డు మీద ఓ దృశ్యం కనిపించింది, నేనున్న కేఫ్ పక్కనుంచే మౌనంగా ఆ చిన్నారి శవయాత్ర సాగుతోంది.. ప్రవీణ్ లేడు, అతని రెండేళ్ల కొడుకు అక్క శవం ముందు నడుస్తున్నాడు. బాబును పట్టుకుని మరో వ్యక్తి సాయం చేస్తున్నాడు…

‘ప్రవీణ్ ఏడి’… శవయాత్రలో వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి అడిగాను. ‘ప్రవీణ్… పాప చనిపోయిన రోజే, అతనూ హార్ట్ ఎటాక్‌తో హాస్పటల్‌లోనే చనిపోయాడు. నిన్ననే దహన సంస్కారాలు చేసేశారు. పాపకు అలా జరగడంతో పోస్టు మార్టమ్, పోలీసుల ఎంక్వైరీ పేరుతో మూడు రోజులు మార్చురీలో ఉంచుకుని ఈరోజే ఇచ్చారు. అందుకే ఇలా…’ అంటూ పూర్తిగా చెప్పకుండానే కళ్లల్లో నీళ్లు తుడుచుకుంటూ వెళ్లిపోయాడతను..
నిజంగా ఆ పాపకు న్యాయం జరిగిందా.. నాకు ఇంకా సమాధానం దొరకడం లేదు..

– చింతకింది రాముడు (chinthakindhiramu777@gmail.com)

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post