Committee Kurrollu Movie Review : కొణిదెల నిహారిక నిర్మాతగా మారి, తెరకెక్కించిన తొలి ఫీచర్ ఫిల్మ్ ‘కమిటీ కుర్రాళ్లు’. 11 మంది హీరోలు అంటూ చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్, టీజర్, ట్రైలర్ అన్నీ ఆకట్టుకున్నాయి. యూట్యూబ్‌లో ఫేమస్ అయిన ప్రసాద్ బెహారా వంటి నటులు నటించిన ‘కమిటీ కుర్రాళ్లు’ అంచనాలను అందుకోగలిగిందా?
తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాలకు ఓ స్పెషల్ గుర్తింపు ఉంది. గోదారి యాస, గోదారి వెటకారం, గోదారోళ్ల మర్యాదలు అన్నీ వేరే లెవెల్. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘నా సామి రంగ’ వంటి ఎన్నో సినిమాల్లో గోదారి సంస్కృతిని చూపించారు, సక్సెస్ సాధించారు. ఈ ‘కమిటీ కుర్రాళ్లు’ కూడా అదే లిస్టులో చేరిపోద్ది..
పల్లెటూర్ స్నేహాలు, అందులో ఉండే గొడవలు, ఆ గొడవలు చెరిగిపోయి తిరిగి కలిసిపోయినప్పుడు ఉండే ఎమోషన్స్.. అన్ని ఈ కమిటీ కుర్రాళ్లు సినిమాలో ఉంటాయి. ఓ చిన్న ఊర్లో, కుర్రాళ్ల మధ్య మొదలైన ఓ చిన్న గొడవ, ఊర్లో జరిగే జాతరపైనే ఎలా ప్రభావం చూపించింది అనేదే ఈసినిమా కథ..
కథ చిన్నదే, కానీ దాన్ని తెరకెక్కించిన విధానం హత్తుకుంటుంది. సాయికుమార్, శ్రీలక్ష్మీ వంటి ఒకరిద్దరు సీనియర్ నటులు తప్ప, మిగిలినవాళ్లంతా కొత్తవాళ్లే. కొత్తవాళ్లే అయినా చాలా బాగా నటించారు. డైరెక్టర్ యదు వంశీ, మొదటి సినిమాతోనే తన మార్క్ చూపించేశాడు. అనుదీప్ దేవ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రధాన బలం..
ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ తర్వాత క్లైమాక్స్‌లో ఏం జరుగుతుందో ఊహించినా సన్నివేశాలను హత్తుకునేలా తీయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాతో నిర్మాతగా మారిన నిహారిక కొణిదెల ఓ మెట్టు ఎక్కేసినట్టే. 90ల నాటి అనుభవాలను మరోసారి సున్నితంగా స్పర్శించే ‘కమిటీ కుర్రాళ్లు’ కాస్త కష్టంగానైనా అందరికీ నచ్చేస్తారహే!