Betel Leaf Remedy : తమలపాకులు మన సంస్కృతిలో భాగం. పూజ నుంచి పెళ్ళి వరకూ తమలపాకు తప్పనిసరి. తాంబూలం వివాహంలో ఓ ముఖ్య పదార్థం. తమలపాకు ఆహార ప్రయోజనాలు కూడా ఎక్కువే. తమలపాకుతో రసం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ తమలపాకు రసం ఆరోగ్యానికి చాలా మంచిది. వర్షాలు బాగా పడినప్పుడు నోటికి కొంచెం ఘాటు ఘాటుగా తినాలనిపించినప్పుడు ఐదు నిమిషాల్లో ఈ రసాన్ని చేసేసుకోవచ్చు. అలాగే జలుబు దగ్గు నోటికి రుచిగా లేనప్పుడు కూడా ఈ తమలపాకుల రసం చేసుకొని తింటే ఒక నాలుగు ముద్దులు ఎక్కువే తినొచ్చు. చిన్నపిల్లలకు కూడా ఈ తమలపాకు రసం చాలా మంచిది అరుగుదల కూడా తొందరగా అవుతుంది.
కావలసిన పదార్థాలు:
తమలపాకులు: 10 నుంచి8 15,
టమాటాలు: 4,
మిరియాలు : 10,
తాలింపు దినుసులు,
నూనె,
వెల్లులి,
కరివేపాకు,
ఉప్పు తగినంత,
చిటికెడు పసుపు,
కొంచెం ఇంగువ
తయారీ విధానం..
10 నుంచి 15 తమలపాకులు, మూడు లేదా నాలుగు బాగా పండిన టమోటాలు మిరియాలు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ని ఒక గిన్నెలో వేసి అందులో కావలసినంత వాటర్ యాడ్ చేసుకుని పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి. అలా మరుగుతున్న దాంట్లో రెండు రెబ్బలు కరివేపాకు, రుచికి సరిపడ ఉప్పు, చిటికెడు పసుపు, సరిపడ కారం వేసి 12 నుంచి 15 నిమిషాలు మరిగించాలి.
ఇప్పుడు పోపు కోసం కడాయిలో ఆయిల్ పోసి కాస్త వేడయ్యాక ఆవాలు వేసి అవి చిటపటలాడుతున్నప్పుడు.. జీలకర్ర, వెల్లుల్లి నాలుగు ఎండు మిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి బాగా ఫ్రై చేసుకుని దీన్ని చారులో కలిపేసుకోవడమే.. అంతే.. ఎంతో సింపుల్ గా రుచికరమైన తమలపాకుల రసం రెడీ..
Note : ఈ రసంలోకి పులుపు మొత్తం టమాటాల్లో నుంచే సరిపోతుంది. లేదు అనుకుంటే లాస్ట్ లో ఒక రెండు స్పూన్లు నిమ్మరసం పిండుకోవచ్చు.