Ahobilam Temple History : మనదేశంలో ఉన్న సుప్రసిద్ధ నరసింహ క్షేత్రాల్లో అహోబిలం ఒకటి. కర్నూలు జిల్లాలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో స్వామి సాక్షాత్తు తొమ్మిది రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. దట్టమైన నల్లమల అడవుల మధ్య సుందర ప్రశాంతమైన వాతావరణంలో, మనోహరమైన కొండల నడుమ ఉన్న అహోబిల దివ్యక్షేత్ర వైభవం ఏంటో తెలుసుకుందాం..
లక్ష్మీనరసింహుడు హిరణ్యకశిపుడుని సంహరించి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభమునందు, ఉద్భవించిన స్థలమే ఈ అహోబిలక్షేత్రము. ఇక్కడి స్వామి వారు ఎంతటి మహిమాన్వితుడంటే, మనుషులకే కాదు దేవతలకు సైతం కష్టం వచ్చినా ఈ స్వామి వారినే రక్షించమని కోరుకుంటారట.. పురాణాల ప్రకారం రాక్షసుల రాజు అయిన హిరణ్యకశిపుడుని చంపడానికి శ్రీ మహావిష్ణువు సగం మనిషిగాను, సగం సింహ రూపంలోనూ అవతరించింది ఈ ప్రదేశంలోనే అని చెబుతారు.
ఇక్కడ నరసింహస్వామి తొమ్మిది రూపాలలో కనిపిస్తాడు కనుక ఈ క్షేత్రానికి “నవ నరసింహ క్షేత్రం” అనే మరో పేరు కూడా ఉంది. హిరణ్యకశిపుడి సంహరణ అనంతరం ఉగ్ర నరసింహుడి శక్తిని, బలాన్ని చూసి దేవతలంతా ప్రశంసిస్తూ అహో..బలం, అహో..బలం అని కీర్తించగా కాలక్రమేణా అదే అహోబిలంగా మారింది అని అంటారు. అహోబిలంను కింద అహోబిలం, పైన అహోబిలం అని అంటారు.
పైన నరసింహుడు ఉగ్రరూపిగాను, కింద నరసింహుడు శాంతస్వరూపిగా ఉంటాడని చెబుతారు.
అహోబిలం హిందూ యాత్రికులకే కాక, పర్యాటక కేంద్రంగా, కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. స్తంభం నుంచి ఉద్భవించిన నరసింహుడు క్రోధాగ్ని జ్వాలలతో ఊగి పోతుండటంతో జ్వాలా నరసింహుడన్నారు. ఇక్కడే ఉగ్ర నరసింహుడు హిరణ్యకశిపుని వధించినట్లు చెప్పబడుతోంది. ఇదివరకు ఇది హిరణ్యకశిపుని రాజప్రాసాదంగా భావింపబడింది. ఇక్కడే భవనాశనీ నది ప్రారంభం అవుతుంది. ఇక్కడ ఆలయంలో హిరణ్యకసిపుని చంపిననాటి స్వామి ఉగ్ర రూపాన్ని చూడవచ్చు.
వాల్మీకి నిజంగా బోయవాడు కాదా..? రామాయణ సృష్టికర్త వెనక..
ఈ ఆలయం పక్కనే రక్త గుండాన్ని కూడా మనం చూడవచ్చు. హిరణ్యకశిపుడిని చంపిన అనంతరం స్వామివారు ఇక్కడే చేతులు కడిగారని చెప్పుకుంటారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. రక్తగుండంలోని నీరు ఎప్పుడు ఎరుపు రంగులోనే ఉంటుంది. అహోబిలంలో మనం ముఖ్యంగా చెప్పుకోవలసింది ఉగ్ర స్థంభం. ఇది అహోబిలంలోని ఎత్తైన కొండ, దీనిని దూరం నుండి చూస్తే ఒక రాతి స్తంభం మాదిరిగా ఉంటుంది. దీనిని చేరుకోవడం కొంచెం కష్టం కానీ ఒకసారి దీనిని చేరుకుంటే మంచి ట్రెక్కింగు చేసిన అనుభూతి కలుగుతుంది.
దీనిపైన ఒక కాషాయం జండా, నరసింహస్వామి పాదాలు ఉంటాయి. ఈ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వేస్టేషన్ కు 68 కిలోమీటర్ల దూరంలోనూ, ఆళ్ళగడ్డకు 24 కిలోమీటర్ల దూరములోనూ ఉంది. అన్ని ప్రధాన ప్రాంతాలకు అక్కడ నుండి అహోబిలం చేరడానికి మార్గాలు, రవాణా సౌకర్యములున్నాయి. ఈ ఆలయప్రాశస్తం అమోఘమైనది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువ, దిగువ అహోబల పుణ్యక్షేత్రాలను సందర్శించి తరిస్తారు.