BRS Defeat : ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై అందరూ ఫోకస్ పెట్టడంతో తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికలను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. 17 ఎంపీ స్థానాలకు జరిగిన తెలంగాణ లోక్సభ ఎన్నిల్లో 8 స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటే, మరో 8 స్థానాలు భారతీయ జనాతా పార్టీకి దక్కాయి. ఎంఐఎం పార్టీ ఓ స్థానాన్ని నిలుపుకోగలిగింది. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన భారత రాష్ట్ర సమితికి మాత్రం ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాకపోవడం విశేషం.
ఎట్లుండే తెలంగాణ అంటూ చేసిన ప్రచారమే బీఆర్ఎస్ని ముంచిందా..!?
నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఏకంగా 5 లక్షల 18 వేలకు పైగా మెజారిటీ సాధించి, రికార్డు బ్రేక్ చేశాడు. బీజేపీ కూడా తెలంగాణలో ఓట్లను, సీట్లను పెంచుకుంది. అయితే 2019లో ముందస్తుకి వెళ్లి, అప్పుడు గెలిచిన కేసీఆర్ పన్నాగం, 2024లో తేడా కొట్టింది. 3 నెలల ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన భారత రాష్ట్ర సమితి, లోక్సభ ఎన్నికలను అస్సలు పట్టించుకోలేదు. ఇది ఓటు బ్యాంకుపై తీవ్రంగా ప్రభావం చూపించింది.
లోక్సభ ఎన్నికలు జరిగినా ఎక్కడ బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచార హంగామా కనిపించలేదు. ఈ అవకాశాన్ని వాడుకున్న కాంగ్రెస్, బీజేపీ భారీ విజయాలు అందుకున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన భారత రాష్ట్ర సమితికి ఒక్కటంటే ఒక్క లోక్సభ సీటు రాకపోవడం మాత్రం చాలా పెద్ద అవమానమే. మరి ఈ ఓటమిపైన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.