Women in Assembly : ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ఘన విజయం అందుకుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజిక వర్గాల నుంచి ఎన్నికైన వారిలో 21 మంది మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు ఉండడం విశేషం. అంటే అసెంబ్లీలో మహిళల ప్రాతినిథ్యం కేవలం 12 శాతం మాత్రమే. గొంతు శిరీష, తోయక జగదీశ్వరి, లోకం మాధవి, అదితి గజపతిరాజు, గుమ్మడి సంధ్యా రాణి, వంగలపూడి అనిత, మిర్యాల శిరీష దేవి, వరపుల సత్యప్రభ, యనమల దివ్య, తంగిరాల సౌమ్య, గల్లా మాధవి, వామిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెలవల విజయశ్రీ, భుమా అఖిల ప్రియ, గౌరు చరిత రెడ్డి, రెడ్డప్పగారి మాధవి రెడ్డి, బండారు శ్రావణి శ్రీ, పరిటాల సునీత, సవితమ్మ, పల్లె సింధూర రెడ్డి.. టీడీపీ కూటమి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన మహిళలు. వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఒకే ఒక్క మహిళా నేతగా నిలిచింది దాసరి సుధ..
మహిళల ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆకాశంలో సగం అని మొదలెడతారు నాయకులు ఉపన్యాసాలు. అయితే ఆకాశంలో సగం ఉన్న ఆడవాళ్లు, అసెంబ్లీల్లో మాత్రం 12 శాతంతో ఓ మూలన కూర్చోవాల్సి వస్తోంది. ఎమ్మెల్యేగా అధికారం చేజిక్కించుకున్న 21 మందిలో కూడా చాలా మంది నామమాత్రపు ఎమ్మెల్యేలుగా చెలామణీ అయ్యేవారు. భార్య ఎమ్మెల్యే అయితే అధికారం చెలాయించేది మాత్రం భర్త అన్నట్టుగానే ఉంటుంది.. అతికొద్ది మంది మాత్రమే స్వతంత్ర్యంగా ఉంటున్నారు..
రాజకీయ నాయకులు ప్రకటించే, అమలు చేసే సంక్షేమ పథకాల్లో మహిళలే పెద్ద పీట దక్కుతుంది. అయితే రాజకీయాల్లో మాత్రం మహిళలకు పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదనేది వాస్తవం.