Vijayashanthi : సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి, ‘తల్లి తెలంగాణ’ పార్టీని స్థాపించి, దాన్ని భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీలో విలీనం చేసేసింది. అంతకుముందు భారతీయ జనాతా పార్టీలో సభ్యురాలిగా ఉన్న విజయశాంతి, 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత నవంబర్ 2020లో కాంగ్రెస్‌కి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2023 నవంబర్‌లో మళ్లీ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. విజయశాంతి ఇంకోసారి పార్టీ మారబోతున్నారా? విజయశాంతి వేసిన ఓ ట్వీట్‌తో ఆమె మళ్లీ బీఆర్ఎస్లోకి వస్తున్నారంటూ ప్రచారం జరిగింది.
‘తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి అభిప్రాయం సమంజసం కాదు. ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం… ఎప్పటికీ.. ఇది అర్ధం చేసుకోకుండా వ్యవహరించే వారికి, దక్షిణాది… దశాబ్దాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత గార్ల నుండి ఇప్పటి బీఆర్ఎస్, వైసిపి దాకా ఇస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించుకోవాల్సిన తప్పని అవసరం… ఎన్నడైనా.. వాస్తవం. ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు, బీజేపీ కనీసం ఆలోచన చెయ్యని అంశం. బహుశా కిషన్ రెడ్డి గారి ప్రకటన భావం..’ అంటూ ట్వీట్ చేసింది విజయ శాంతి..
హస్తం గూటికి చేరనున్న రాములమ్మ..!
బీఆర్ఎస్కి సపోర్ట్‌గా ట్వీట్ చేయడంతో విజయశాంతి తిరిగి ఆ పార్టీలో చేరుతున్నట్టు ప్రచారం జరిగింది. దీనిపై స్పందించింది విజయశాంతి.
‘దక్షిణ భారత ప్రాంత ప్రజల రాజకీయ భావోద్వేగాలు ఎట్లాంటివో గత ఇప్పటి పరిస్థితులను ఉదహరించి, దక్షిణాది ప్రాంతీయ పార్టీల పట్ల కాంగ్రెస్ అర్ధం చేసుకునే తీరు, బీజేపీ దండయాత్ర విధానం నిన్నటి నా పోస్ట్‌లో వ్యక్తపరిస్తే, అవగాహన చేసుకునే తత్వంలేని కొందరు ఆ పోస్ట్ పై పార్టీ మార్పు అంటూ రాజకీయ వార్తా కథనాలు రాసి వ్యాఖ్యానిస్తూ తమ తమ సొంత కల్పన కొనసాగిస్తున్నరు..
సరే… అర్థం చేసుకునే విధానం ఉన్నవారికి చెప్పగలం కాని ఉద్దేశ్యపూర్వకంగా విమర్శ చేయడమే పని పెట్టుకున్నవాళ్లకు వివరణలు ఇచ్చి ప్రయోజనం లేదు…’ అంటూ ట్వీట్ చేశారు విజయశాంతి..