Varahi Navaratri 2024 : ఆషాడ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు జరిగే తొమ్మిది రోజుల నవరాత్రులు వారాహీ నవరాత్రులు అని పిలుస్తారు. శరన్నవరాత్రులు, మాఘ గుప్త నవరాత్రులు లాగానే, అమ్మవారిని తొమ్మిది రోజులు ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ సమయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి, ఉపవాసాలు ఉండి, దీక్షలను పాటిస్తారు.
పూజ విధానం :
సూర్యోదయానికి ముందే అమ్మవారి పూజతో మొదలు పెట్టాలి. రాత్రి పూజ 7 తరువాత చేసుకోవాలి. ఉదయం నిత్యపూజ తో మొదలు, సాయంత్రం చేసేవారు పీఠం పెట్టుకోవాలి (పీఠం పెట్టుకోని వారు దేవుడి మందిరంలోని చేసుకోవచ్చు).
సాయంత్రం పూజకు సంబంధించిన షోడశోపచార పూజ చేసుకుని, అష్టోత్తరాలు, ద్వాదశనామాలు, లలిత సహస్ర నామం చదువుకుని నైవేద్యాలు పెట్టి పూజ చేసుకోవచ్చు. ఉదయం బెల్లం పానకం చేసి నైవేద్యంగా పెట్టి నిత్య పూజలు చేసుకోవాలి (సూర్యోదయం లోపు). రెండు పూటలా పానకం తప్పక పెట్టాలి. రాత్రిలోపు ఇంట్లోని వాళ్ళు ప్రసాదంగా స్వీకరించాలి.
Murudeshwar temple Gokarna : మురుడేశ్వర ఆలయ విశిష్టత..
నైవేద్యాలు:
పానకం, చిలకడ దుంప (ఉడికించినవి), పల్లీ ఉండలు, ఉడకపెట్టిన పల్లీలు బెల్లం కలిపి, దానిమ్మ గింజలు, పుచ్చకాయ ముక్కలు, బీట్‌రూట్, బియ్యం. అమ్మవారు పంటలకు అధిదేవత, భూమిలో పండేవి ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంకా మీ ఇష్టానుసారం రోజుకో రకమైన ప్రసాదం చేసుకోవచ్చు.
అన్నప్రసాదాలు:
పులిహోర, పొంగలి, కొబ్బరి అన్నం, పెరుగన్నంలో దానిమ్మ గింజలు కలిపిపెట్టడం, అమ్మవారు ఉగ్రరూపిణి, శాంతంచడానికి పెరుగన్నం నైవేద్యం శ్రేష్ఠమని అంటారు. అందుకని పానకం, పెరుగన్నం, దానిమ్మ గింజలు, పల్లీఉండలు.
దీపారాధనకు ఎర్ర వత్తులు వుంటే మంచిది. విప్పనూనె దీపారాధనకు శ్రేష్ఠం. నువ్వుల నూనె, ఆవు నూనె, ఆవు నెయ్యి ఏదైనా పరవాలేదు.
అలాగే అమ్మవారికి ఎర్రని పుష్పాలు ఇష్టం, దొరికితే ఎర్ర గన్నేరు పూలు పెట్టండి. లేదా గులాబీలు, మందారాలు, మిగిలిన ఏ పూలైనా వాడుకోవచ్చు.
కలశం, అఖండ దీపం మీ ఇష్టం. కాకపోతే దీపం కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.
కలశాన్ని కదపకూడదు, అలాగే మొదటి రోజు ఎక్కడ పెట్టామో అక్కడే ఉంచాలి మార్చకూడదు.
పసుపు గణపతి ప్రతి రోజు చేసుకొని, తరువాత రోజు మళ్ళీ కొత్తగా చేసుకోవాలి.
Ahobilam Temple History : అహోబిలం పుణ్యక్షేత్రం విశేషాలు..
అమ్మవారి పటం లేకపోయినా లలితా అమ్మవారు, లక్ష్మిదేవి పటం అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే వారాహి అమ్మవారి విగ్రహం దొరకవచ్చు, కానీ పటాలు దొరకవు. మీకు అమ్మవారి చిత్రపటాలు కావాలంటే నెట్లో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కట్టించుకోవచ్చు.
చివరి రోజున చీర, పసుపు, కుంకుమ, తాంబూలం పెట్టుకోవాలి. తరువాత అది మనం కట్టుకోవచ్చు లేదా ఎవరికైనా పెట్టవచ్చు. చీర పెట్టలేకపోతే చీర బదులుగా జాకెట్ ముక్క అయినా పెట్టవచ్చు.
పటం గాని విగ్రహం గాని లేకపోయినా దేవుని దగ్గర మనం రోజు వెలిగించే దీపంతో పాటు అదనంగా మరో దీపం వెలిగించుకుని ఆ దీపాన్నే అమ్మవారిగా భావిస్తూ పూజ చేసుకోవచ్చు. అమ్మ మనకోసం అన్ని విధాల సౌకర్యం గా ఉండే అమ్మ, అలాగే శీఘ్రంగా అనుగ్రహించే దేవత.
పూజ అయ్యాక పంచోపచారాలు చేయాలి. అనగా దీపం, ధూపం, నైవేద్యం, నీరాజనం, నమస్కారం చూపించాలి. అమ్మవారికి ధూపం చాలా ఇష్టం అని అంటారు.
పూజ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేస్తే అద్భుతం. కుదరని పక్షాన ఒక్కరైనా చేయవచ్చు.
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను.. నిష్ట భక్తి ప్రధానంగా ఉండాలి. నేల పడక, ప్రతిరోజూ తలస్నానం (మొదటి రోజు తలంటుకుని మిగిలిన రోజుల్లో ఊరికే తలమీద నీరు పోసుకోవాలి) ఉండగలిగితే ఉపవాసం. ఉండగలిగితేనే. ఈ నవరాత్రులు అయ్యేవరకూ దాంపత్యం పనికిరాదు. అలాగే మాంసాహారం, మందు, కూడా నిషిద్ధం.
Arunachalam Temple : అరుణాచలం ఆలయ విశిష్టత..
మన ఆలోచనలు కూడా పవిత్రంగా ఉండాలి. ఏదైనా మనసు దారితప్పి పిచ్చి ఆలోచనలు వస్తే దేవుని వీడియోలు ఏదైనా వినండి. మనం మనుషులం కాబట్టి ఖచ్చితంగా వస్తాయి. నిగ్రహంగా డైవర్ట్ చేసుకోవడమే.
అలాగే ఈ నవరాత్రులలోనే కాదు, విడిగా కూడా అమ్మవారి పూజ శుక్రవారాలు చేసుకోవచ్చు. అమ్మవారికి పంచమి తిథి అంటే చాలా ఇష్టం, ప్రతినెలా పంచమి పౌర్ణమి తిధులులో చేసుకోవచ్చు.