Tirumala Laddu Issue : మానవత్వం మతమా..!?

Tirumala Laddu Issue : ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో కోట్లాది మంది హిందువులు నిత్యం ఆరాధించే ఆ కలియుగ దైవం శ్రీనివాసుని లడ్డూ ప్రసాదంలో గత ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన కల్తీని, స్వామి వారికి జరిగిన అపచారాన్ని కూటమి ప్రభుత్వం బయట పెట్టిన సంగతి తెలిసిందే.

ఈ అపచారంతో దేశవ్యాప్తంగా కోట్లమంది హిందువుల మనోభావాలు దెబ్బతినటంతో అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లడ్డూ కల్తీ వివాదం ఇంకా ముదురుతున్న నేపథ్యంలో జగన్.. నేను ఏ తప్పు చేయలేదు, కావాలంటే కాలినడకన తిరుమల వెళ్లి స్వామి దర్శనం చేసుకుంటాను అంటూ నమ్మ బలికి.. డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందేమోనని తన కాలి నడక పర్యటన రద్దు చేసుకున్నాడు.

అన్య మతస్థులు ఎవరైనా సరే తిరుమల సందర్శించాలి అనుకున్నప్పుడు అక్కడ ఆచారాలు సంప్రదాయాలు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే.. దీనికి తాను క్రిస్టియన్ అని నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతాను అని చెప్పిన జగన్ కూడా ఏ మాత్రం మినహాయింపు కాదు.

ఇప్పటివరకు ఓటు బ్యాంక్ కాపాడుకోవటం కోసం హిందువులు, క్రైస్తవులు ఇద్దరితోనూ ఆటలాడిన జగన్ ఈ రోజు తను ఏమిటో తన మతం ఏమిటో బహిర్గతం చేశాడు.

తను క్రిస్టియన్ అని చెప్పకనే చెప్పాడు. తిరుమల దేవుడ్ని సంపూర్ణంగా నమ్ముతున్నాను అని సంతకం పెట్టాల్సి వస్తుంది అని తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నాడు జగన్.

Govt Schemes : పేరులో ఏముంది బ్రదర్..

జగన్ క్రిష్టియన్ అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే కాబట్టి తను ఏం చెప్పుకున్నా తప్పు లేదు కానీ జనాన్ని తప్పు దోవ పట్టించటానికి “నా మతం
మానవత్వం” అన్నాడు. అంతేకాకుండా దాన్ని డిక్లరేషన్ లో రాసుకుంటే రాసుకోండి అన్నాడు. అంతటితో ఊరుకోకుండా హిందూయిజాన్ని హేళన చేస్తూ ఇదేమి హిందుత్వం అనటం జగన్ అహంకారానికి, లెక్కలేనితనానికి పరాకాష్ట.

తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడూ ప్రజలు వారు ఏ కులం, ఏ మతం అనే లెక్కలు చూడదు. అన్య మతస్తులు అయితే మాత్రం డిక్లేరేషన్ ఇవ్వమంటుంది. అది టీటీడీ సంప్రదాయం నిబంధన కూడా.. జగన్ కి ఇతర మతాలను గౌరవించే మనస్తత్వం ఉంటే ఆ మతం యెక్క ఆధ్యాత్మిక సంస్థ గౌరవం కాపాడాలి దానికి తగ్గట్టు
డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి.

ఈ ఐదేళ్లలో ఇప్పటికే చాలాసార్లు వచ్చాను ఇప్పుడు కొత్తగా ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పి ఉంటే వేరేలా ఉండేది. దేవస్థానం ఆ నిబంధనలు అన్నీ బయట పెట్టేది. అలా చేయకుండా జగన్ తను చేసిన తప్పుని ఒక కులానికి, మతానికి అంట కట్టి మాజీ ముఖ్య మంత్రిని నాకే ఇలా ఉంటే.. దళితుల పరిస్థితి ఏంటీ అంటూ కులం కార్డ్ తీసుకు వచ్చి ఇది ఒక కుల గొడవ కిందగా మార్చి ఇంకా రచ్చ చేయాలని చూస్తున్నాడు.

ఇలా చేయటం నిజంగా కుల, మత రాజకీయాలకి తెర లేపడమే అవుతుంది. పైగా ఈ తప్పుని కూటమి ప్రభుత్వానికి అంటకట్టి కూటమి వాళ్ళు మత రాజకీయం చేస్తున్నారు అని ఆరోపిస్తూ
దేవుడితో జగన్ మాత్రం కుల రాజకీయం చేస్తూ తన తప్పును కప్పిపుచ్చుకుంటున్నాడు.

ఏ దళితుడినైనా, అన్య మతస్తులనైనా తిరుమల రావద్దు అని టిటిడి చెబుతుందా? అలా చెప్పినట్టు పోనీ ఆధారాలు ఉన్నాయా? పోనీ వారు వస్తే రావొద్దు అని టీటీడీ ఏమైనా అడ్డుకున్నదా..? జగన్ తను చేసిన తప్పుల్ని, తనకి జరిగిన డ్యామేజ్ ని కవర్ చేసుకోవటానికి వచ్చి ఇంకా తప్పు చేస్తున్నాడు. తన పార్టీకి ఇంకా డ్యామేజ్ చేసుకుంటున్నాడు. దీని ఫలితం జగన్ కి త్వరలో అర్ధం అవుతుందేమో చూడాలి.

Related Post