Shankarabharanam 1980 : తెలుగు సినిమా అంటేనే స్టార్ ఇమేజ్… ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్, పవన్.. ఇలా తరాలు మారేకొద్దీ హీరోలు ఉన్న సినిమాలే, రికార్డు కలెక్షన్లు కొల్లగొడుతూ వచ్చాయి. హీరో లేకపోతే సినిమా ఎంత బాగున్నా, దానికి వచ్చే కలెక్షన్లు ఓ పరిమితికే ఆగిపోతాయి.
అయితే ఈ సెంటిమెంట్లు మొత్తం కాలరాసిన సినిమా ‘శంకరాభరణం’. అప్పటికే 60 ఏళ్ల దాటిన సోమయాజులు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘శంకరాభరణం’ సినిమాని కళా తపస్వీ కె. విశ్వనాథ్ తెరకెక్కించారు. షూటింగ్ సమయం నుంచే డిస్టిబ్యూటర్లు, ఈ సినిమా ఆడదని నిర్మొహమాటంగా చెప్పేశారు…
అలా 1980, ఫిబ్రవరి 2న తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ థియేటర్లలో విడుదలైంది ‘శంకరాభరణం’. మొదటి రోజు మొదటి షోకి కేవలం నాలుగంటే నాలుగు టికెట్లు మాత్రమే తెగాయి. ఇప్పుడంటే 4 టికెట్లు కొంటే సినిమా ప్రదర్శన నిలిపివేస్తారు. కానీ నిర్మాత ఫోన్ చేసి మరీ రిక్వెస్ట్ చేయడంతో మొదటి ఆటను నలుగురికే ప్రదర్శించారు..
RGV – Mani Ratnam : ఆ రెండు సినిమాల కోసం కలిసి పనిచేసిన ఆర్జీవీ – మణిరత్నం.. ఎలా విడిపోయారు..
రెండో ఆటకు 10 మంది రాగా, మొత్తంగా మొదటి రెండు తెగిన టికెట్ల సంఖ్య 100 కంటే తక్కువే ఉంటుంది. రెండో రోజు కూడా టికెట్లు పెద్దగా తెగకపోవడంతో సినిమాని తీసి, అప్పటికే విడుదలైన కృష్ణ నటించిన ‘భలే కృష్ణుడు’ సినిమా ప్రదర్శిస్తామని చెప్పారట థియేటర్ల యజమానులు.
అయితే ఇంకొక్క రోజు చూసి, సినిమాని తీసివేయమని థియేటర్ల యజమానులను వేడుకున్నాడు ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాత ఈడిద నాగేశ్వరరావు…
ఆయన అనుకున్నట్టుగానే మూడో రోజుకి మౌత్ టాక్ పెరిగి, ‘శంకరాభరణం’ సినిమా థియేటర్లకు జనాలు రావడం మొదలెట్టారు. వారం తిరిగేసరికి అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.
మొదటి రోజు మొదటి షోకి 4 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయిన సినిమా, 25 వారాల పాటు దిగ్విజయంగా ప్రదర్శించబడింది. కన్నడలో డబ్ చేయకుండా బెంగళూరులో రిలీజైన ‘శంకరాభరణం’ అక్కడ థియేటర్లలో ఏడాదిపాటు ఆడింది..
మలయాళంలో రెండేళ్ల ఏళ్ల థియేటర్లలో ఆడిన ‘శంకరాభరణం’, తమిళ్‌లోనూ సంచలన విజయం అందుకుంది. తమిళంలో సినిమాని డబ్ చేసినా పాటలు మాత్రం తెలుగులోనే ఉంచేశారు. వాస్తవానికి ఈ సినిమాని తమిళ స్టార్ నటుడు శివాజీ గణేశన్‌తో తీయాలని అనుకున్నారు విశ్వనాథ్. అయితే నిర్మాత మాత్రం అక్కినేని నాగేశ్వరరావుని అనుకున్నారు.
ఈ ఇద్దరూ నో చెప్పడంతో కృష్ణంరాజుని కలిశారు. ఆయన కూడా నో చెప్పడంతో తన సినిమాకి స్టార్ హీరో అవసరం లేదని ఫీలైన కె. విశ్వనాథ్.. స్టేజ్ ఆర్టిస్ట్ అయిన సోమయాజులుతో సినిమాని పూర్తి చేశారు.. అలా తెలుగువారికి పరిచయం లేని ఓ స్టేజ్ ఆర్టిస్ట్ హీరోగా వచ్చిన సినిమా, 200 రోజులు ఆడి, మళ్లీ శాస్త్రీయ సంగీతం నేర్చుకునేందుకు కారణమైంది.
టాలీవుడ్ చరిత్రలోనే క్లాసిక్ సినిమాగా నిలిచిపోయింది.. అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేశన్ లేదా కృష్ణంరాజు చేసి ఉంటే ‘శంకరాభరణం’ ఇలా ఉండేది కాదేమో..