Raghu Arikapudi : రియల్ ‘జనతా గ్యారేజ్’.. మనిషికి కష్టం వచ్చిందని తెలిస్తే చాలు..!

Raghu Arikapudi : ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమా చూసినప్పుడల్లా, ఇలా ఎదుటివారికి కష్టం వస్తే, ఏ స్వార్థం లేకుండా సాయం చేసే మనుషులు నిజంగా ఉంటారా? అనే అనుమానం చాలామందికి వచ్చే ఉంటుంది.. కానీ నిజంగానే ఇక్కడో ఓ జనతా గ్యారేజ్ ఉంది. అది డాక్టర్ రఘు ఆరికపూడి సేవా హృదయం.. ఎవరికైనా కష్టం వచ్చిందని ఆయన మెదడుకి తెలిస్తే చాలు, సాయం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్లిపోతారు..

మనిషి పుట్టుకకి అర్థం ఏంటి? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం చాలా కష్టం… కానీ ‘విన్నర్స్ ఫౌండేషన్’ ప్రెసిడెంట్ రఘు ఆరికపూడిని ఈ ప్రశ్న అడిగితే మాత్రం ‘సాటి మనిషికి చాతనైనంత సాయం చేయడమే మన జీవితానికి ఓ అర్థం, పరమార్థం’ అంటారు… సాటి మనిషి కష్టాల్లో ఉన్నాడనే విషయం తెలిస్తే చాలు, ఆయన మనసు చలించిపోతుంది. వారికి తనవంతు చేతనైనంత సాయం చేసేవరకూ ఆయనకి కాళ్లు, చేతులు ఆడవు…

ఎవరీ రఘు ఆరికపూడి..

1964, మార్చి 25న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా చమళ్లమూడి గ్రామంలో పుట్టిన రఘు ఆరికపూడి, ఓ ప్రభుత్వ బడిలో చదువుకున్నాడు. చిన్నతనంలో ‘Helping hands are more powerful than Praying Lips’ అని మదర్ థెరిస్సా చెప్పిన ఓ కొటేషన్, రఘుని ఎంతగానో ప్రభావితం చేసింది.. ప్రార్థించే చేతుల కంటే సాయం చేసే చేతులు ఎంతో శక్తివంతమైనవి.. ఎంత గొప్ప మాట! ఆ శక్తిని తన చేతుల్లో ఎందుకు ఒడిసి పట్టకూడదని అనుకున్నారు..

Raghu Arikapudi
Raghu Arikapudi

ఓ చిన్న సాయం, మామూలు మనిషిని గొప్ప వ్యక్తిగా మారుస్తుంది… సాయం కోసం ప్రభుత్వం మీద, ఇతరుల మీద ఆధారపడకుండా చేయి చేయి కలిసి సమూహంగా మారి.. ఓ తోడ్పాటు ఇవ్వాలని అనుకున్నారు. అలా పుట్టిన ఆలోచనే.. రఘు ఆరికెపూడి సేవ ట్రస్ట్… ఆ ఆలోచన ఆయుష్షు ఇప్పుడు 40 ఏళ్లు..

ఐటీఐ చదువు అయ్యాక పటాన్ చెరువు పారిశ్రామిక వాడలో ప్రయివేటు ఉద్యోగం చేస్తున్న సమయంలో, అక్కడ వలస కూలీల దైనందిన జీవితం చూసి రఘు చలించిపోయారు. వారిని ఆదుకోవాలంటూ ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ, చాలా రోజుల పాటు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగారు. ఎంత ప్రయత్నించినా ప్రభుత్వం స్పందించకపోవడంతో, తానంతట తానే వారికి చేతనైన సాయం చేయాలని అనుకున్నారు.

1991లో భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌ (BDL)లో ఉద్యోగంలో చేరారు.. ఆయన మంచి ఆలోచనలకి తోటి ఉద్యోగుల సహకారం లభించింది. అలా 2012లో మిత్రులతో కలిసి ‘విన్నర్స్ ఫౌండేషన్‌ని స్థాపించారు. కష్టాల్లో ఉన్నవారిని విన్నర్స్‌గా మార్చడమే ఈ ఫౌండేషన్ ఆశయం. అలా కొన్ని వేల మంది జీవితాల్లో వెలుగులు నింపారు..

ఉదయాన్నే లేచి, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలన్నీ తిరిగేస్తారు రఘు.. ఇది అందరూ చేసేదే కదా! ఇందులో కొత్తేమీ ఉందని అనుకోవచ్చు.. అందరూ ఏం జరిగిందో తెలుసుకోవడానికి వార్తా పత్రికలు చదివితే, రఘు మాత్రం ఎవరికి ఏ అవసరం ఉందో తెలుసుకోవాలనే మంచి ఉద్దేశంతో వార్త పత్రికలు తిరగేస్తారు..

అలా ఫలానా ఏరియాలో ఫలానా వాళ్లకు ఓ అవసరం ఉందని తెలియగానే అక్కడ వాలిపోతారు.. ఒకే ఏరియా, ఒకే జిల్లా కావాల్సిన పని లేదు, ఒకే రాష్ట్రం కూడా కావాల్సిన పని లేదు. తన సాయం ఫలానా వారికి అవసరం ఉందని తెలిస్తే చాలు, వందల కిలోమీటర్లు ప్రయాణించి అక్కడికి చేరుకుంటారు.

లాభం లేనిదే, నయా పైసా ఖర్చు చేయని మనుషులున్న ఈ సమాజంలో తనకెలాంటి సంబంధం లేని అభాగ్యుల కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేశారు రఘు ఆరికెపూడి.. నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం కోసం, అనాథ పిల్లల భవిష్యత్తు కోసం, వృద్ధాశ్రమంలోని వృద్ధుల బాగోగుల కోసం నిరంతరం శ్రమిస్తున్న రఘు.. శారీరక, మానసిక దివ్యాంగుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు.

బీడీఎల్ ఉద్యోగుల కో ఆపరేటివ్ సొసైటీకి డైరెక్టర్‌గా ఎంపికైన రఘు ఆరికపూడి, పదేళ్లలో 1000కి పైగా రేషన్ కార్డులు అందించడమే కాకుండా 1500 కుటుంబాలకు రేషన్, బియ్యం, కేబుల్ వంటి కనీస అవసరాలు అందేలా చర్యలు తీసుకున్నారు.

బడి బాట, భవిష్యత్ పూదోట..

Raghu Arikapudi

పేదవాడి పరిస్థితి మారాలంటే చదువు కంటే గొప్ప ఆయుధం లేదు. అందుకే భావితరాన్ని బడికి పంపేలా మారుమూల గ్రామాల్లోని ప్రజలను చైతన్య పరిచారు రఘు ఆరికపూడి. స్కూల్‌కి పంపాలంటే పుస్తకాలు కొనాలి, బ్యాగులు కావాలి? దానికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని తల్లిదండ్రులు అడిగితే, వారిని తనవారిగా భావించి ఆ భారం కూడా మోశారు. ఇలా 5700 మంది చిన్నారుల చదువుల కోసం, వారికి స్కూల్ బ్యాగుల నుంచి చిన్నచిన్న అవసరాల కోసం రూ.10 లక్షల దాకా ఖర్చు పెట్టారు..

లాక్ డౌన్.. నెవర్ డౌన్..

Raghu Arikapudi

లాక్‌డౌన్‌ కష్టకాలంలో ఎన్‌.ఆర్‌.ఐ స్వచ్ఛంద సేవా సంస్థ ‘హోప్4స్పందన’ సహకారంతో కరోనా బాధితులకు, వారి కుటుంబాలకు చేయూత అందించారు రఘు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 10 వేల మందికి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. రోజూ కూలీ చేస్తే కానీ పూట గడవని వెయ్యికి పైగా నిరుపేద కుటుంబాలకు లాక్‌డౌన్‌లో వారి ఇంటిపెద్దగా మారి.. నిత్యావసర సరుకులు అందచేశారు.

అలాగే మెడికల్ సేవలు అవసరమైన వారికోసం అంబులెన్స్ సర్వీసులు, వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు..

వెన్నుపూస..

Raghu Arikapudu

మనిషి, నిటారుగా నిలబెట్టే వెన్నెముక విరిగితే కుప్పకూలిపోతాడు. యుక్త వయసులోనే కె. శివ అనే ఖిల్లా వరంగల్‌కి చెందిన యువకుడికి ఇదే సమస్య వచ్చింది. అతని గురించి వార్త పత్రికలో చదివి తెలుసుకున్న రఘు ఆరికపూడి, అతన్ని వెతుక్కుంటూ వెళ్లారు. శివకి లక్ష రూపాయల ఆర్థిక సహకారంతో ఇంటి వద్దే కిరాణా దుకాణం పెట్టించారు. అలాగే అతని వైద్యానికి అవసరమైన సాయం కూడా చేశారు..

రైతే రాజు..

Raghu Arikapudi

అన్నదాత లేకపోతే అన్నం పెట్టేవాడే లేదు. కానీ రైతన్నకి కష్టం వస్తే, ఆదుకునేవాడే కనబడడు! కానీ రైతుల కోసం పెద్దన్నగా మారాడు రఘు ఆరికపూడి.. మహబూబాబాద్‌లో కరెంట్ షాక్‌తో పశువులు చనిపోవడంతో వాటిపై పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న రైతుల కుటుంబాలను చూసి రఘు చలించిపోయారు. అలాగే డోర్నకల్‌లో పిడుగు పడి ఆవులు మరణించిన సంఘటన గురించి తెలుసుకున్నారు. పశువులను కుటుంబ సభ్యులుగా భావించే రైతుల కష్టాన్ని చూసి చలించిన రఘు ఆరికెపూడి, ‘హోప్4స్పందన’ ట్రస్ట్‌తో కలిసి పశువులు కొని ఇచ్చారు..

Raghu Arikapudi

అలాగే చౌటుప్పల్‌లో మానసిక దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన అమ్మానాన్న అనాథ ఆశ్రమం కోసం రూ.10 లక్షల వరకూ సాయం చేశారు..

తలసేమియా వ్యాధితో..

Raghu Arikapudi

తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులకు సరైన సమయంలో రక్తం అందించాలి. లేకపోతే రక్తహీనతతో చనిపోతారు. అలాంటి వారికి ప్రాణదాతగా మారారు రఘు ఆరికపూడి… ఎన్నో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి, తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల కోసం రక్తాన్ని సేకరించారు. అలాగే రక్తదానం మీద జనాల్లో ఉన్న అపోహలు, భయాలను పొగొట్టేందుకు ఎంతో కృషి చేశారు..

ఫ్లోరైడ్‌పై పోరాటం…

Raghu Arikapudi

నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బారిన పడి, ఎంతో మంది దివ్యాంగులుగా మారారు. వారిని ఆదుకోవడం కోసం ‘హోప్ 4 స్పందన’ సంస్థతో చేతులు కలిపిన రఘు ఆరికపూడి, వందల మందికి ఆపన్న హస్తం అందించారు. 65 మందికి ట్రైసైకిళ్లు, వీల్ ఛైర్లు అందించారు. అలాగే సొంతకాళ్ల మీద నిలబడాలని అనుకున్న 30 మందితో కిరాణ, ఇతరత్రా దుకాణాలు ఏర్పాటు చేయించారు..

నాదీ బాధ్యత..

కండరాల క్షీణత, కరెంట్ షాక్, ప్రకృతి వైపరీత్యాలు.. ఓ వ్యక్తి, ఓ కుటుంబం తలకిందులైపోవడానికి కారణం ఏదైనా కావచ్చు. కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్న ఒకే కుటుంబంలోని నలుగురి గురించి తెలుసుకున్న రఘు, నిజామాబాద్ వెళ్లి, వారికి వైద్య ఖర్చులకు, రేషన్ సరుకుల కోసం అవసరమైన ఆర్థిక సాయం అందించారు. ఇల్లు కట్టించడమే కాకుండా, పెళ్లీడు వచ్చిన భాగ్యలక్ష్మీ అనే యువతి, పెళ్లి చేసే బాధ్యత కూడా ఆయనే తీసుకున్నారు.

అలాగే కరెంట్ షాక్‌లో తన రెండు కాళ్లు, చేతులు కోల్పోయిన 10 ఏళ్ల బాలుడి బాధ్యత తీసుకున్నారు రఘు. అతను భవిష్యత్తులో ఎవరి మీద ఆధారపడకుండా బతికేలా నోటితో పెయింటింగ్ చేయడాన్ని నేర్పిస్తున్నారు. అలాగే అతని కోసం రొబోటిక్ అవయవాలు తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు..

Raghu Arikapudi

వారి కళ్లలోని ఆనందమే అసలైన అవార్డు..
2019లో ప్రతిష్టాత్మక డాక్టర్ ఏ.పీ.జే అబ్దుల్ కలాం అవార్డు పొందిన డాక్టర్ రఘు ఆరికపూడి, అదే ఏడాది ‘ఫైటర్ ఫర్ పబ్లిక్ ఎడ్యూకేషన్’ అవార్డు కూడా దక్కించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నుంచి ఎన్నో అవార్డులు అందుకున్న రఘు ఆరికపూడి, 2022లో యూనైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సీ నుంచి డాక్టరేట్ పొందారు… తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ చేతుల మీదుగా ఇండియన్ రెడ్‌క్రాస్ స్వర్ణ పతకం అందుకున్నారు రఘు ఆరికపూడి…

అయితే సాయం అందుకున్నవారి కళ్లల్లో కనిపించే తమ కోసం ఒకరున్నారనే ఆనందం, తనకు అన్నింటికంటే పెద్ద అవార్డు అంటారు డాక్టర్ రఘు ఆరికపూడి..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post