Movie Theatres : టాలీవుడ్‌లో సరైన హిట్టు పడింది రెండు నెలలు అవుతోంది. మార్చి నెలాఖరులో వచ్చిన ‘టిల్లు స్క్వైర్’ తర్వాత ఒక్క సినిమా కూడా థియేటర్ల దగ్గర సందడి తీసుకురాలేకపోయింది. ‘ఫ్యామిలీ స్టార్’ తర్వాత పెద్ద సినిమా రిలీజ్‌లు లేకపోవడంతో మే నెల మొత్తం డ్రై సీజన్ నడిచింది. మే నెలలో కూడా అదే కంటిన్యూ అవుతోంది. మిక్స్‌డ్ టాక్ వచ్చిన సినిమాలే కాదు, పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలను కూడా జనాలు అస్సలు పట్టించుకోవడం లేదు..
ఎండలు, ఎన్నికలు, ప్రచారం హంగామా, పోలింగ్, ఐపీఎల్.. ఇలా అన్నీ కలిసి సినిమాలను చావుదెబ్బ తీశాయి. గత ఐదు వారాలుగా థియేటర్లలో కనీసం 10 శాతం ఆక్యుపెన్సీ కూడా నమోదు కావడం లేదు. దీంతో హైదరాబాద్ నగరంలో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లను 10 రోజుల పాటు మూసివేయాలని థియేటర్ల యాజమాన్య సంఘం నిర్ణయం తీసుకుంది. 400 సీట్లు ఉన్న థియేటర్‌లో 10-20 టికెట్లు మాత్రమే తెగితే వారి కోసం ఏసీ, ఫ్యాన్లు వేసి సినిమా ప్రదర్శించడం వల్ల కనీసం కరెంట్ బిల్లు ఛార్జీలు కూడా వెనక్కి రావు. కాబట్టి పెద్ద సినిమాలు వచ్చేదాకా థియేటర్లు బంద్ చేయడమే ఉత్తమమని నిర్ణయం తీసుకున్నారు థియేటర్ల యజమానులు..
హైదరాబాద్ నగరంలో దాదాపు 90 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం వీటి సంఖ్య 140కి పైగా ఉండేది. అయితే మల్టీప్లెక్స్ థియేటర్ల రాకతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలను మెయిన్ థియేటర్స్ సెంటర్‌గా ఉన్న ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో కూడా ఇప్పుడు థియేటర్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది.
సుదర్శన్ 70MM, ఓడియన్, ఓడియన్ డీలక్స్, మినీ ఓడియన్, శ్రీమయూరి, దీపక్, శ్రీనివాస, వెంకటేశ వంటి థియేటర్లు కనుమరుగయ్యాయి. ఈ డ్రై సీజన్ కారణంగా ఇలా కాలగర్భంలో కలిసిపోయే సింగిల్ స్క్రీన్ థియేటర్ల సంఖ్య భారీగా పెరగనుంది. ఇప్పటికే ఆంధ్రా, తెలంగాణ, సీడెడ్ ఏరియాల్లో వందల సంఖ్యలో థియేటర్లు మూతబడ్డాయి. వచ్చే నెల ప్రభాస్ ‘కల్కి’ సినిమా వచ్చేదాకా ఇదే పరిస్థితి కొనసాగేలా కనిపిస్తోంది.