Jr NTR : 19 ఏళ్లకే రజినీకాంత్‌ని భయపెట్టిన ఎన్టీఆర్ క్రేజ్! తారక్ ఎందుకు ఇంత స్పెషల్..

Jr NTR : టాలీవుడ్‌లో ఎంతోమంది వారసులు, తండ్రి పేరు చెప్పుకుని, తాత పేరు చెప్పుకుని హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు. అయితే వీరందరిలో ఎన్టీఆర్ జూనియర్ మాత్రం చాలా స్పెషల్. ‘నిన్ను చూడాలని’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా ‘స్టూడెంట్ నెం.1’ మూవీతో మొదటి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘ఆది’ ఈ కుర్రాడికి మాస్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా ‘సింహాద్రి’ ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసింది.

అప్పటిదాకా ఎన్టీఆర్, కృష్ణ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ మాత్రమే ఇండస్ట్రీ హిట్స్ కొడుతూ వచ్చారు. వెంకటేశ్, నాగార్జునలకు బ్లాక్ బస్టర్ విజయాలు ఉన్నా, ఇండస్ట్రీ హిట్స్ మాత్రం వారి ఖాతాల్లో లేవు. అలాంటి టైమ్‌లో ఓ నునుగు మీసాల కుర్రాడు, టీనేజ్ కుర్రాడు వచ్చి, బాక్సాఫీస్ దగ్గర రూ.25 కోట్ల షేర్ రాబట్టాడు. ఒక్కసారిగా దక్షిణాదిలోనే ఎన్టీఆర్ తిరుగులేని స్టార్‌గా ఎదిగాడు. ఎన్టీఆర్‌‌కి స్టార్ హీరో ఇమేజ్ వచ్చే సమయానికి పవన్ కళ్యాణ్‌, మహేష్ బాబులకు ఇంత స్టార్ డమ్‌ కూడా రాలేదు. ప్రభాస్ అయితే ఇంకా సినిమాలే మొదలెట్టలేదు.

‘ఆంధ్రావాలా’ ఆడియో రిలీజ్ ఈవెంట్, ప్రపంచ సినీ చరిత్రలోనే ఓ అద్భుతం. ఈ ఈవెంట్‌కి 10 లక్షల మంది అభిమానులు హాజరయ్యారు. ఇండియన్ రైల్వే స్పెషల్‌గా ట్రైన్స్ నడపాల్సి వచ్చింది. ‘సింహాద్రి’ తర్వాత ‘ఆంధ్రావాలా’ హిట్టు కొట్టి ఉంటే.. ఎన్టీఆర్ రేంజ్ ఎక్కడ ఉండేదో, ఎలా ఉండేదో ఊహించుకోలేం. ఒకానొక దశలో టాలీవుడ్‌లో ‘మోస్ట్ పెయిడ్ యాక్టర్’ కూడా ఎన్టీఆరే. 20 ఏళ్ల వయసులోనే మెగాస్టార్ చిరంజీవి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడు ఎన్టీఆర్. స్వయంగా రజినీకాంత్ కూడా టీనేజ్ వయసులో ఎన్టీఆర్‌కి వచ్చిన క్రేజ్‌ని చూసి భయపడ్డాడు.. భయపడడం అంటే ఎన్టీఆర్ తనని ఎక్కడ దాటేస్తాడో అనే భయం కాదు. ఈ వయసులో ఇలాంటి క్రేజ్‌ని హ్యాండిల్ చేయడం ఎన్టీఆర్ వల్ల కాదేమోనని కంగారుపడ్డాడు. రజినీ భయపడ్డట్టే జరిగింది. వరుస ఫ్లాపులతో ఒక్కసారిగా పెరిగిన క్రేజ్, పడిపోతూ వచ్చింది. ఈలోపు ‘పోకిరి’ మూవీతో మహేష్ స్టార్ అయ్యాడు. పవన్ కళ్యాణ్‌ ఫాలోయింగ్ అంతకంతకీ పెరుగుతూ పోయింది..

అయితే ఎన్టీఆర్ తనకు తగిలిన దెబ్బలతో మరింత రాటుతేలాడు. నటుడిగా తనను తాను తీర్చిదిద్దుకున్నాడు. ‘రాఖీ’ సినిమాలో ఎన్టీఆర్ నటనను ఏ హీరో కూడా మ్యాచ్ చేయలేదు. ఆ తర్వాత ‘యమదొంగ’ మూవీతో తాతకి తగ్గ మనవడిగా నిరూపించుకున్నాడు. నిజానికి ఎన్టీఆర్ అనే పేరు తప్ప, నందమూరి కుటుంబం నుంచి తారక్‌కి సరైన సపోర్ట్ ఎప్పుడూ దక్కలేదు..

రెండో భార్య కొడుకు కావడంతో ఎన్టీఆర్‌ని నందమూరి కుటుంబం పూర్తిగా దూరం పెట్టింది. బాలకృష్ణ కూతురి పెళ్లికి వెళితే, ఎన్టీఆర్‌ని లోపలికి కూడా రానివ్వలేదు. ఇలా అవమానాలు ఎన్టీఆర్‌కి కొత్తేమీ కాదు. అయితే ఎన్టీఆర్ ఎప్పుడూ ఎవరి సపోర్ట్ కోరుకోలేదు. కుటుంబంతో కలవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా, నందమూరి తారక రామారావు జూనియర్ కెరీర్‌ మొత్తం కూడా తనకి తాను స్వయంగా నిర్మించుకున్నదే. ఎన్టీఆర్ స్టార్ హీరో అయ్యాకే తండ్రి హరికృష్ణ కానీ, బాబాయ్ బాలకృష్ణ కానీ ‘వీడు మావాడు’ అంటూ దగ్గరికి వచ్చారు. కొందరు అవసరానికి వాడుకున్నారు.. ఆఖరి రోజుల్లో హరికృష్ణ తన వారు ఎవరో తెలుసుకుని, ఎన్టీఆర్ వైపు నిలబడ్డాడు. అందుకే బావ చంద్రబాబుకి, తమ్ముడు బాలకృష్ణకు దూరమయ్యాడు..

సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి రోజు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెట్టిన ఫ్లెక్సీలు చూసి బాలకృష్ణకు కోపం వచ్చింది. వాటిని వెంటనే తీసి వేయించాలని అరిచారు కూడా. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎన్టీఆర్ జయంతిని కానీ, వర్ధంతిని కానీ నందమూరి కుటుంబం పట్టించుకున్న పాపాన పోలేదు. అప్పుడు కూడా మనవడు తారక్ స్వయంగా ఎన్టీఆర్ ఘాట్‌కి వచ్చి నివాళులు ఘటించారు. తాత సమాధిని శుభ్రం చేయించి, పూలమాలలతో అలంకరించారు.

తనను కాదన్న వారిని కూడా తనవారిగా భావించి, అక్కున చేర్చుకునే గుణం ఎన్టీఆర్‌ది. ఒంటరిగా పెరిగినవాడు కావడంతో బంధాల విలువ అతనికి బాగా తెలుసు. కేవలం కనుబొమ్మలతో నటనను పలికించగలిగే నటులు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. అందులో ఎన్టీఆర్ ఒకడు.. క్రేజ్, ఫాలోయింగ్, స్టార్‌డమ్ వంటి విషయాలు పక్కనబెడితే నేటి తరంలో భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఎన్టీఆర్ ముందుంటాడు. దీన్ని ఏ హీరో అభిమాని అయినా అంగీకరించి తీరాల్సిందే.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post