ఏమయ్యాయి.. ఆ రోజులు..!?

Diwali 2023 : దీపావళి.. చిన్నప్పుడు ఈ పండగ వస్తుందంటే, ఒక వారం రోజులు ముందు నుంచే ఎక్కడ లేని హడావిడి స్టార్ట్ అయిపోయేది. ఇప్పుడు ఆ ఎక్సైజ్మెంట్ లేదు. పండగంటే పట్టించుకోనంత బిజీ అయిపోయామా లేక పెద్దవాళ్ళం అయిపోతే అన్నీ మారిపోతాయా.. ఏమో మరీ, ఏదేమైనా.. ఒక్కసారి సరదాగా చిన్నప్పుడు మన పండగ రోజుల్లోకి వెళ్ళొద్దాం రండి . .

పండక్కి చాలా రోజులు ముందు నుంచి గన్ను అండ్ అందులో వేసి పేల్చే టేప్స్ కొనుక్కొని వాటిని కాలుస్తూ జేమ్స్ బాండ్ రేంజ్ లో ఫీల్ అయ్యేవాళ్ళం. పండగ దగ్గరకు వస్తుందంటే రెండు మూడు రోజులు ముందే నాన్నతో మార్కెట్ వెళ్లి మనకు కావాల్సిన మతాబులు, కాకరపువొత్తులు, చిచ్చుబుడ్డిలు, కాకరపువ్వత్తులు, ఇంట్లోకి కావాల్సిన ప్రమిదలు నూనె అన్ని తెచ్చుకునే వాళ్ళం. ఆ టపాసులు ఇంటి బయట మడత మంచాల మీద లేదా నులక మంచాల మీద అవి లేకపోతే ఇంటిముందు దుప్పటి వేసి ఎండబెట్టుకునే వాళ్ళం.

వాటిని అరగంటకు ఒకసారి చూస్తూ.. ఆ రోజు వర్షం పడకూడదని అందరి దేవుళ్ళకి మొక్కేవాళ్ళం. ఆ రోజు మాత్రం సాయంత్రం ఎప్పుడవుతుందని ఆత్రుతతో ఎదురుచూసే వాళ్ళు, అమ్మ వాళ్ళు పిండి వంటలతో హడావిడిగా ఉంటే, మనం మాత్రం మతాబులు కాల్చాలన్న ఆనందంలో తిండి కూడా తినేవాళ్ళం కాదు.

Diwali 2023

ఇక సాయంత్రం అయ్యేసరికి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని తెచ్చుకున్న టపాసులు అన్నీ బయటపెట్టుకొని.. కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్డిలో, భూచక్రాలు, అశోక చక్రాలు, పాము బిళ్ళలు ఇలా అన్నీ కాలుస్తూ వాటిలో నుంచి వచ్చే వెలుగులు.. మన కళ్ళల్లో కనిపించే ఆనందం అంతాఇంతగా కాదు. అన్నీ ఒకేరోజు కాల్చకుండా నాగుల చవితి కొన్ని దాచుకొని మరి ఆ రోజు కాల్చే వాళ్ళం.

పొద్దున్న లేచేసరికి ఎవరి ఇంటి ముందు ఎక్కువ చెత్త ఉంటే వాళ్ళు ఎక్కువ టపాసులు కాల్చారు అనుకొనే వాళ్ళం. అప్పట్లో 200 రూపాయలతో రెండు సంచులు నిండా వచ్చేవి దీపావళి టపాసులు. అన్నీ టపాసులు కాల్చేసిన తర్వాత కాళ్లు చేతులు కడుక్కొని అప్పుడు తృప్తిగా ఇంట్లో చేసిన పిండి వంటలు తిని హాయిగా నిద్రపోయే రోజులవి.. ఇలా చెప్పుకుంటూ పోతే దీపావళితో ప్రతి ఒక్కరికి చాలా అనుబంధం ఉంటుంది. ఈ రోజుల్లో పిల్లలకి అలాంటి ఎక్సైట్మెంట్ లేదు అనే చెప్పుకోవాలి, టెక్నాలజీ మహిమ ఏమో మరీ.. ఎంత సంపాదించినా.. ఏం చేసినా.. కొన్ని సంతోషాలను కొనలేం.. అనుభవించాలంతే.. అందుకే అంటారు ఆ రోజులే వేరు అని . .

Diwali 2023

దీపావళి అంటే.. లక్ష్మీ పూజ..

దీపావళి సమయం..
కార్తీక అమావాస్య తిథి ప్రారంభం నవంబరు 12/2023/ మధ్యాహ్నం రెండు గంటల 44 నిమిషాలకు..

కార్తీక అమావాస్య ముగింపు తేదీ..
నవంబరు 13/2023/ మధ్యాహ్నం రెండు గంటల 56 నిమిషాలకు..

దీపావళి శుభ ముహూర్తం..
లక్ష్మీ పూజ సమయం సాయంత్రం 5:39 నుండి 7:35 వరకు (12 నవంబరు 2023)

మీ అందరికీ మా ‘రాములమ్మ’ తరుపున దీపావళి శుభాకాంక్షలు..
ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తూ.. టేక్ కేర్ అండ్ బీ సేఫ్..

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post