Women Safety : నిర్భయ, దిశ, మౌమిత ఇలా బయటకు వచ్చిన ఘటనలు కొన్నైతే రానివి మరెన్నో.. రోజు రోజుకీ మహిళలపై లైంగిక వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో తగ్గించేందుకు మరియు సమాజంలో ఈ సమస్యపై అవగాహన పెంచేందుకు పలు చర్యలు తీసుకోవాలి.
మన దేశంలో లైంగిక వేధింపుల చట్టాలు ఉన్నప్పటికీ, వాటిని సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. బాధితులు న్యాయం పొందడానికి, వేగవంతమైన న్యాయ ప్రక్రియలు అమలు చేయాలి. పోలీసులు కూడా బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించేలా శిక్షణ ఇవ్వాలి. అలా జరగని పక్షంలో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.
మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, హక్కులు, మరియు సహాయ కేంద్రాల గురించి ప్రజలకు తెలియజేయడంలో ప్రభుత్వం, సామాజిక, స్వచ్ఛంద సంస్థలు ముందుండాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు వారి హక్కులు, రక్షణ మార్గాలు తెలియజేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి.
పాఠశాల దశ నుంచే పిల్లలకు లైంగిక దాడుల గురించి అవగాహన కల్పించాలి. స్వీయ రక్షణ విధానాలు, “సేఫ్ బౌండరీస్ ” (Safe Boundaries) గురించి బోధించడం, తమ పైన జరిగే దాడుల గురించి చెప్పాలి. ” భయపడకండి.. అది మీ తప్పు కాదు” అనే ధైర్యాన్ని పిల్లలకివ్వాలి.
పని చేసే స్థలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, హెల్ప్‌లైన్ నంబర్లు వంటి సదుపాయాల గురించి అవగాహన కల్పించాలి. మహిళల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ ల (ఉదా: 1091) గురించి అవగాహన పెంచాలి.
తప్పు జరిగాక ఎలిగిత్తే గొంతులు, క్యాండిల్ ర్యాలీలు, RIP పోస్టుల కంటే, తప్పు జరగకముందే.. అరికట్టే విధానాలు పాటించాలి. స్కూల్, కాలేజీ, ఆఫీస్ మొదలగు చోట్ల లైంగిక వేధింపులు జరగకుండా పలు జాగ్రత్తలు, సూచనలు అందించాలి. అలాగే మహిళలు కూడా వారి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. ఎక్కడికైనా తప్పని సరిగా ఒంటరిగా వెళ్ళాల్సి వస్తే పెప్పర్ స్ప్రే వంటి వాటిని వెంట తీసుకెళ్ళాలి.