Bhuchakra Gadda : భూచక్రగడ్డ.. దీన్నే ‘మాగడ్డ’ అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువగా అడవిలో భూమిలోపల లభిస్తుంది. చక్రం ఆకారంలో వుంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. దీనిని ఎక్కువగా చెంచులు సేకరించి అమ్ముతుంటారు. వారు దీన్ని నరసింహస్వామి ప్రసాదంగా భావిస్తారు. చాలామంది సాధారణంగా దీనిని రహదారుల వెంట సైకిల్ వెనుక పెట్టుకొని కొద్దికొద్దిగా కోసి అమ్ముతుంటారు. ఇది కేవలం నల్లమల అటవీ ప్రాంతంలోనే, అది కూడా ఇటు శ్రీశైలం నుంచి అటు గిద్దలూరు వరకూ మాత్రమే దొరుకుతుంది.
భూచక్రగడ్డకీ, చెంచులకూ అవినాభావ సంబంధం వుంది. భూచక్రగడ్డను చెంచులు అదృష్టానికి గుర్తుగా భావిస్తారు. ఒక గడ్డ దొరికితే కుటుంబమంతా కనీసం నెలరోజులు బతికే ఆదాయాన్నిస్తుంది. అందుకే దీన్ని లక్ష్మిగడ్డ అని, లచ్చిగడ్డ అని కూడా పిలుస్తుంటారు. ఉత్సవాల సమయంలో అమ్మేటప్పుడు దీన్ని గడ్డ ప్రసాదమని చెప్తుంటారు.
భూచక్రగడ్డ మీకు ఎక్కడ కనిపించినా నిస్సందేహంగా నాలుగు ముక్కలు తినేయండి. అంచులు బాగా పదునుగా ఉన్న కొడవలితో సన్నటి లేయర్ కట్ చేస్తారు. ఎంత సన్నటి లేయర్ వుంటే అంత ఎక్కువ రుచి వుంటుంది. శరీరంలో వేడిని తగ్గించడంతో పాటు భూచక్రగడ్డ వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. రక్తవిరోచనాలు, కడుపులోపల పడే పుండ్లను మాన్పుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.