PM Modi – Ram Mandir : దేశ రాజకీయాల్లో రెండు సార్లు చక్రం తిప్పిన ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చట గా మూడోసారి హ్యాట్రిక్ సాధించారు. లోక్సభ ఎన్నికల అస్త్రంగా అయోధ్య రాముడ్ని వాడుకొని ఎన్నికల్లో లాభపడాలని చూసింది భారతీయ జనతా పార్టీ. 100 కోట్ల హిందువుల కల అంటూ భారీగా అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసి, ఎన్నికలకు 2 నెలల ముందు హడావుడిగా ప్రాణపతిష్ట కూడా చేశారు… అయితే రాముడ్ని వాడుకొని ఎన్నికల్లో లబ్ధి పొందుదాం అనుకున్న మోడీ పాచికలు ఈ సారి పారలేదు… రామమందిరం కట్టేసాం, ఇక మాకు తిరుగులేదు అనుకున్న మోడీకి షాక్ ఇస్తూ, అయోధ్యలో ఓటర్లు బీజేపీకి కాకుండా ఒక దళితుడ్ని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.
పదేళ్లు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీకి ఈసారి షాక్ తగిలేదే! మిత్రపక్షాల కారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే మెజారిటీ తెచ్చుకుని సేఫ్ అయ్యారు. అసలు అయోధ్యలో బీజేపీ ఓటమికి కారణం ఏంటి? అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం స్థానికుల నుంచి బలవంతంగా స్థల సేకరణ జరిగింది. స్థలం కోల్పోయిన వారికి సరైన నష్టపరిహారం కూడా ఇవ్వకుండా అయోధ్యకు 6 కిలో మీటర్ల దూరంలో ఓ డంప్ యార్డ్ దగ్గర ఇళ్లు కట్టించారు. అక్కడ సరైన వసతులు లేక చాలామంది, అయోధ్య రామమందిరం చుట్టూ గుడిసెళ్లో జీవిస్తున్నారు.
Govt Schemes : పేరులో ఏముంది బ్రదర్..
అంతేకాదు అయోధ్య రామాలయ నిర్మాణం జరగకముందు కొన్ని దశాబ్దాలుగా ఆ ఆలయంలో పూజలు చేస్తున్న పూజారులను కూడా అక్కడి నుంచి పంపించి వేశారు. వారి స్థానంలో కాశీ నుంచి పూజారుల తీసుకొచ్చి, పూజలు నిర్వహిస్తున్నారు. ఇలా అయోధ్య రామమందిరం కోసం ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులకు అనేక ఇబ్బందులు పెట్టారు. దాని ప్రభావమే ఎన్నికల్లో కనిపించింది. హిందువుల ఓటు బ్యాంకే, బీజేపీ బలం. కానీ అయోధ్యతో సహా భద్రాచలం, రామేశ్వరం, కొప్పల్, చిత్రకోట, నాశిక్ లాంటి హిందూ మెజారిటీ ఉన్న చోట్ల బీజేపీ ఓటమి చవిచూడటం విశేషం.
బీజేపీ పైన పెరిగిన కోపం, ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతతో కాంగ్రెస్ కాస్తో కూస్తో లాభపడింది. గత 2019 ఎన్నికల్లో 52 స్థానాలు మాత్రమే దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ, ఈసారి ఆ సంఖ్యను 99కి పెంచుకుంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసినా అయోధ్య వంటి ప్రాంతాల్లో బీజేపీ ఓటమి, ఆ పార్టీ చేస్తున్న తప్పులను సరిదిద్దుకోవడానికి దొరికిన అవకాశం. ఇప్పుడు అయోధ్యలో అభివృద్ధి జరుగుతుందా? ఒకవేళ జరిగితే అది ఇప్పుడు గెలిచిన ఎంపీ వల్లే జరిగిందని ప్రజలు అనుకోవచ్చు. జరగకపోతే కేంద్రంలో ఉన్న బీజేపీ, అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించి కూడా దాని బాగోగులు పట్టించుకోవడం లేదని విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు అయోధ్య, బీజేపీకి అసలు సిసలైన పరీక్షగా మారనుంది..