Telangana New Logo : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి పదేళ్లు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా పాలన సాగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కి భారీ మెజారిటీతో అధికారం దక్కింది. రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పాలన మొదలైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు ఇలా ఆరు హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వ లోగోని కూడా మార్చాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత ఓరుగల్లు కాకతీయ సామ్రాజ్య చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన కాకతీయ స్థూపం, భాగ్యనగరానికి ప్రతీకగా నిలిచిన ఛార్మినార్‌లతో తెలంగాణ ప్రభుత్వ రాజముద్రను తయారుచేసింది కేసీఆర్ సర్కార్..
అయితే 10 ఏళ్ల తర్వాత అధికార పార్టీ మారింది. దీంతో ఈ లోగో స్థానంలో కొత్త లోగో తీసుకురావాలని అనుకుంటోంది కాంగ్రెస్. ఇప్పటికే తెలంగాణ అమరవీరుల స్థూపంతో గ్రీన్ కలర్‌కి బదులుగా బూడిద రంగులో ఉన్న తెలంగాణ సర్కారు కొత్త రాజముద్ర సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ, అధికారికంగా ఈ రాజముద్రను ఆవిష్కరించలేదు.. అయితే నిజంగా ప్రభుత్వ లోగోని మార్చాల్సిన అవసరం ఉందా?
ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటిదాకా రాజధానిగా పునాది వేసుకున్న అమరావతిని పక్కనబెట్టేశాడు. మూడు రాజధానులు అంటూ కొత్త ప్రతిపాదన లేపి, ఐదేళ్ల పాటు కాలయాపన చేశాడు. ఇదే సమయాన్ని అమరావతి నిర్మాణం కోసం వాడి ఉంటే, ఈపాటికి ఆంధ్రప్రదేశ్‌కి ఓ రాజధాని ఉండేది. అయితే గత ప్రభుత్వం చేసిన దాన్ని తాను ఎందుకు కొనసాగించాలనే అధికార దర్పం… అమరావతిని రాజధానిగా ఒప్పుకోనివ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది కూడా ఇలాంటిపనే..
మంచో, చెడో ఓ ప్రభుత్వం వచ్చి ఓ లోగోని, ఓ ఆలోచనను ముందుకు తీసుకెళ్లింది. కొత్త ప్రభుత్వం రాగానే తమ ముద్ర వేసుకోవాలనే ప్రయత్నం కారణంగా ఇబ్బందులు పడుతున్నది జనాలే! ఇప్పుడు కొత్త రాజముద్ర కోసం అనవసరంగా ఖర్చు చేయాలి. ఇప్పటిదాకా పాత రాజముద్ర ఉన్న పత్రాలు చెల్లవంటే, కొత్త రాజముద్ర కోసం మళ్లీ ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. పాత ప్రభుత్వం TS అని వాహనాల నెంబర్ ప్లేట్లను తయారుచేయిస్తే, ఇప్పుడు కొత్త ప్రభుత్వం TG పెట్టాలని అంటోంది. ఇక్కడ అమలులో ఉన్నదాన్ని మార్చాల్సిన అవసరం ఏంటి?
ఓటు వేసిన తర్వాత జనం, రాజకీయ నాయకులు ఏం చేసినా భరించాలి. ప్రభుత్వం ఏ కొత్త రూల్ తెచ్చినా పాటించాలి. అంతకుమించి చేయగలిగింది ఏమీ లేదు. ఇదే అధికార పార్టీలు ఇలా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి కారణం అవుతోంది. జనాలు మారనంత వరకూ ఇది కూడా మారదు..