Sr NTR Jayanthi : నిలువెత్తు తెలుగుతనం నిండైన వ్యక్తిత్వం.. దేదీప్యమాన తెలుగు తేజం.. స్ఫురద్రూపం.. కంచుకంఠం. అయిదు దశాబ్దాల సంచలనం… ఆరు కాలాల ప్రాభవం. కోట్లమంది అభిమానించే నవరస నటనా వైదుష్యం… దశదిశలా పాకిన వైభవం. ఆయనే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. తన అసమాన అభినయంతో సమ్మోహనపర్చిన కారణజన్ముడాయన! ఆయన మూర్తీభవించిన మంచితనం… చరిత్రలో మిగిలిన యుగపురుషుడు. యుగానికొక్కడు. ఎన్టీఆర్ ఒక్కడే! పాతాళభైరవి సినిమాలో ఇతిహాసం విన్నారా అనే పాటను పింగళి నాగేంద్రరావు సుమూహుర్తాన రాశాడో… కెవిరెడ్డి ఏ శుభవేళ చిత్రీకరించారో తెలియదు కానీ… అందులో ఉన్నట్టుగానే ఎన్టీఆర్ యుగానికి ఒక్క కథనాయకుడిగా వెలిగారు.
ఎన్టీఆర్.. అక్షరాలు మూడే. కానీ వాటికున్న పవర్ మాత్రం అనంతం, అద్భుతం, అపూర్వం. ఆ ఘనత తెచ్చింది నందమూరి తారక రామారావు. అమాయకత్వం… స్నిగ్ధ సౌందర్యం… నిజాయితీ.. నిబద్ధత, నిర్భీతి, పట్టుదల, అంకితభావ ఇవన్నీ ఆయన సొంతమయ్యాయి. ఇతిహాసాన్ని సృష్టించేవాడే కథానాయకుడు. చరిత్రలో తనకంటూ కొన్ని పుటలను ఏర్పరచుకునేవాడే ధీరోదాత్తుడు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వాడే మహిమాన్వితుడు. ఏటికి ఎదురీది విజయం సాధించేవాడే సాహసవంతుడు. ఈ లక్షణాలన్నింటినీ పుణికి పుచ్చుకున్న ఏకైక నటుడు ఎన్టీఆర్ మాత్రమే! ఆయన ధరించని పాత్రలేదు. పోషించని రసం లేదు. సాంఘిక చిత్రాల్లో ఆయన అభినయం అనితర సాధ్యం.
Sr NTR Bhanumathi : ఎన్టీఆర్‌ని బిత్తరపోయేలా చేసిన భానుమతి..
ఇక చారిత్రక, జానపదాలైతే ఆయనకు కొట్టిన పిండి. పౌరాణికాలా.. చెప్పేదేముంది. పురాణ పురుషుల పాత్ర పోషణలో ఆయనకు మించినవారు లేరు.. నచ్చిన పాత్రలన్నీ వేశాడు. ఎవరికీ లేని. ఎవరికీ రాని. ఎవరు చేయలేని వైరుధ్యమైన పాత్రలు రామారావు దగ్గరకి నడుచుకుంటూ వచ్చాయి. రామారావులో ఇంకో గొప్ప విషయం వుంది… దర్శకుడి ఆదేశాలను శిరసావహించడం! రాజూ పేద సినిమాలో ఆయన వేసిన పాత్ర ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కలసి వుంటే కలదుసుఖంలో అవిడి వాడిగా. చిరంజీవులులో గుడ్డివాడిగా. నర్తనశాలలో బృహన్నలగా… ఇవి మరొకరు ఒప్పుకోగలరా? మరొకరు చేయగలరా?. తెలుగు చిత్ర రంగాన్ని నిలబెట్టి శాసించిన వ్యక్తి ఆయన! నటనలో నడకలో మాటలో ఆటలో ఆయన్ను మించిన వారు లేరు.
యమగోల ఇత్యాది సినిమాల్లో కామెడితో కడుపుబ్బా నవ్వించిన ఎన్టీయారే… చిరంజీవులు.. రక్తసంబంధం.. ఆత్మ బంధువు.. ఇంటికి దీపం ఇల్లాలే వంటి చిత్రాల్లో కంటతడి పెట్టించాడు.. శ్రీ కృష్ణావతారం సినిమాలో రాయభారం సన్నివేశంలో తొడమీద ఫ్లూట్తో కొట్టుకుంటూ పద్యం పాడాలి అదేం చెక్క ఫ్లూటు కాదు.. స్టీలుది. కొద్దిపాటి టేకుల తర్వాత సీన్ కంప్లీట్ అయ్యాక చూసుకుంటే ఏముంది… తొడ మీద ఎర్రగా రక్తం గడ్డకట్టి వున్న ఫ్లూట్ గీతలు. నటనలో అంత మమేకమవుతాడయాన. దాదాపు మూడు వందల చిత్రాలు. అంతకు రెండింతల పాత్రలు. ఏ పాత్ర అయినా ఆయనకు నప్పేది! కృష్ణుడంటే ముందుగా స్ఫురించేది ఎన్టీయారే! దాదాపు 14 చిత్రాల్లో ఆయన శ్రీకృష్ణుడి పాత్రను అభినయించారు.. ఒకే నటుడు ఒకే పాత్రను ఇన్ని చిత్రాల్లో నటించిన ఖ్యాతిని సొంతంచేసుకున్నారు.
రికార్డులకు నాంది వాక్యం పలికింది ఎన్టీయారే! 302 సినిమాలు.. 250కి పైగా హిట్లు.. 180కి పైగా సూపర్ హిట్లు.. 120కి పైగా సెన్సేషనల్ హిట్లు.. 30కి పైగా ఇండస్ట్రీ హిట్లు! ఇది చాలు.. వెండితెర పై ఆయన ప్రస్థానం ఏ స్థాయిలో సాగిందో చెప్పడానికి. 80 శాతానికి పైగా విజయాలున్న ఒకే ఒక్క హీరో ఎన్టీఆర్. పౌరాణిక, చారిత్రక, సాంఘిక, జానపద సినిమాలు ఏక కాలంలో చేసిన ఏకైక హీరో ఆయన. 48 పౌరాణికాలు, 50 జానపదాలు, 16 చారిత్రక సినిమాలతో పాటు 188 సాంఘిక సినిమాల్లో నటించిన ఎన్టీఆర్. ఆయన చేయని పౌరాణిక పాత్ర లేదు. రూపమివ్వని దేవతా మూర్తి లేడు ఇలా చెప్పుకుంటూ పోతే.. ఆయన సృష్టించిన రికార్డులకు హద్దుండదు. ఇండస్ట్రీని మూడు దశాబ్దాలకు పైగా ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఎన్టీఆర్.. అనంతరం రాజకీయ కదనరంగంలోకి దూకి.. 9 నెలల్లోనే అధికార పగ్గాలు అందుకున్నారు. తెలుగు తల్లి పేరును, 302 సినిమాలు.. 250కి పైగా హిట్లు.. 180కి పైగా సూపర్ హిట్లు.. 120కి పైగా సెన్సేషనల్ హిట్లు.. 30కి పైగా ఇండస్ట్రీ హిట్లు! ఇది చాలు.. వెండితెర రారాజుగా ఆయన ప్రస్థానం ఏ స్థాయిలో సాగిందో చెప్పడానికి.
80 శాతానికి పైగా విజయాలున్న ఒకే ఒక్క హీరో ఎన్టీఆర్. పౌరాణిక, చారిత్రక, సాంఘిక, జానపద సినిమాలు ఏక కాలంలో చేసిన ఏకైక హీరో ఆయన. 48 పౌరాణికాలు, 50 జానపదాలు, 16 చారిత్రక సినిమాలతో పాటు 188 సాంఘిక సినిమాల్లో నటించిన ఒకే ఒక్క హీరో ఎన్టీఆర్. ఆయన చేయని పౌరాణిక పాత్ర లేదు. రూపమివ్వని దేవతా మూర్తి లేడు. శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా, పరమేశ్వరుడైనా, శ్రీమహావిష్ణువైనా, కలియుగ దైవం వేంకటేశ్వరుడైనా.. ఇలా ఆయన పోషించిన పాత్ర ఏదైనా.. థియేటర్లు ఆలయాలయ్యేవి.. ప్రేక్షకులు భక్తులయ్యేవారు నర్తనశాల, దానవీరశూరకర్ణ, శ్రీకృష్ణపాండవీయం, లవకుశ, సీతారామకల్యాణం, మాయాబజార్, శ్రీకృష్ణావతారం, శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీకృష్ణ సత్య సినిమాలను పౌరాణికాల్లో టాప్ టెన్ మూవీస్ గా చెప్పుకోవచ్చు.
Sr NTR : దేవుడిగా బతికి, ఒంటరిగా విడిచి.. ఎన్టీఆర్ ఆ తప్పు చేయకపోయి ఉంటే..
జానపద వీరుడు.. కలల రాకుమారుడు..
ఎన్టీఆర్.. 50 జానపద సినిమాల్లో హీరోగా నటించారు. వాటిలో రెండు మూడు మినహా.. అన్నీ హిట్లే. ఓ జానపద సినిమాతోనే ఆయన సూపర్ స్టార్ అయ్యారు. ఆయన నటించిన నాలుగో సినిమా పాతాళభైరవి.. తెలుగు తెరపై తొలి ప్రేమకావ్యం. ఓ చందమామ కథలా సాగిపోయే ఈ సినిమాను జానపదాలకు ఓ బెంచ్ మార్క్ లా చెప్పొచ్చు. ఈ సినిమాతో ఎన్టీఆర్.. జానపద కథానాయకుడిగా తిరుగులేని ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. జగదేకవీరుని కథ, పిడుగురాముడు, చిక్కడు దొరకడు, కదలడు వదలడు, గండికోట రహస్యం, రాజకోట రహస్యం, జయసింహ, అగ్గిపిడుగు, మంగమ్మ శపథం, గులేబకావళి కథ, రాజమకుటం లాంటి సినిమాలతో యువత కలల రాకుమారుడిలా నిలిచారు. నేటి బాహుబలి లాంటి సినిమాలను ఏడాదికి రెండు మూడు చేసేవారాయన. దర్శకుడు విఠలాచార్యతో ఎన్టీఆర్ చేసిన సినిమాలైతే అద్భుతాలనే చెప్పొచ్చు.
చారిత్రక పురుషుడు..
పల్నాటి యుద్ధంలో బ్రహ్మనాయుడు, బొబ్బిలియుద్ధంలో రంగారాయుడు, శ్రీకృష్ణదేవరాయలు, చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు, చాణక్యుడు, అక్బర్, వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీనాథ కవిసార్వభౌముడు లాంటి చారిత్రక పాత్రలతో చరిత్ర సృష్టించారు ఎన్టీఆర్. మహామంత్రి తిమ్మరుసు, తెనాలి రామకృష్ణ చిత్రాల్లో శ్రీకృష్ణదేవరాయలుగా ఎన్టీఆర్ నటన నభూతో! అలాగే, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా అప్పట్లో ఓ సంచలనమే సృష్టించింది. ఈ సినిమా చూసేందుకు గ్రామాల నుంచి జనం ఏకంగా బళ్లు కట్టుకుని సమీపంలోని పట్టణాలకు వెళ్లేవారట! టికెట్లు దొరక్కపోతే.. అక్కడే టెంట్లు వేసుకుని మరీ ఉండి సినిమా చూసే తిరిగి వెళ్లే వారట! అప్పటి వరకు అక్కడే వంట చేసుకుని తింటూ థియేటర్ల ముందే ఉండేవారట!
అలా.. ఈ చారిత్రక సినిమా.. ఓ చరిత్ర సృష్టించింది. సినిమా ఇండస్ట్రీలో అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. ఓ సంచలన చరిత్రకు నాంది పలికింది. బ్రహ్మంగారి చరిత్రతో పాటు పల్నాటి యుద్ధం, బొబ్బిలియుద్ధం, చాణక్య చంద్రగుప్త, సారంగధర, మహామంత్రి తిమ్మరుసు, తెనాలి రామకృష్ణ, వేములవాడ భీమకవి, శ్రీనాథ కవిసార్వభౌమ, సమ్రాట్ అశోక సినిమాలను టాప్ టెన్ మూవీస్ గా చెప్పుకోవచ్చు.
సాంఘికాల్లో సంచలనాలు..
జానపద, పౌరాణిక, చారిత్రక పురుషుడిగా తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. సాంఘికాల్లోనూ తనదైన ముద్ర వేశారు. రక్త సంబంధం, ఆత్మబంధువు, చిట్టిచెల్లెలు, కలసి ఉంటే కలదు సుఖం, చిరంజీవులు, బడిపంతులు తదితర సెంటిమెంటు సినిమాలతో ప్రేక్షకులతో కన్నీరు పెట్టించిన ఎన్టీఆర్.. గుండమ్మకథ, రాముడు భీముడు, అప్పుచేసి పప్పుకూడు తదితర వినోదాత్మక చిత్రాలతో అలరించారు. ఇక.. సాంఘికాల్లో కలర్ యుగాన్ని ఎన్టీఆర్ శకంగా చెప్పుకోవచ్చు. కలర్ యుగంలో ఎన్టీఆర్ శకానికి నాంది పలికిన సినిమాగా అడవిరాముడు నిలుస్తుంది. ఈ సినిమా సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అప్పటివరకు ఉన్న అత్యధిక కలెక్షన్ల రికార్డు కోటి రూపాయలు (లవకుశ, దానవీరశూరకర్ణ) కాగా.. అడవిరాముడు.. అంతకు నాలుగింతలు అధికంగా షేర్ వసూలు చేసింది. ఏకంగా నాలుగు కోట్ల రూపాయల వసూళ్లతో (ఇప్పటి టికెట్ ధరలతో పోల్చితే.. 400 కోట్ల రూపాయలకు పైగా) ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు సృష్టించింది.
ఎన్టీఆర్ – రాజ్‌కుమార్ మధ్య సీక్రెట్ ఒప్పందం.. ఆ ఒక్క కారణంగానే..
వయసును పట్టించుకోని తత్వం..
55 ఏళ్లు దాటాక.. హీరోయిన్లతో స్టెప్పులేసినా, 59 ఏళ్ల వయసులో కాలేజీ స్టూడెంట్ గా చేసినా.. జనం మెచ్చారు. ప్రేక్షకులు చూస్తున్నంత వరకు వయసుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదంటారు ఎన్టీఆర్. ఇక్కడో సరదా సంఘటన గురించి చెప్పుకోవాలి. అప్పట్లో రాఘవేంద్రరావు.. ఎన్టీఆర్ తో వేటగాడు సినిమా ప్లాన్ చేస్తున్నారు. అందులో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలా.. అని ఆలోచిస్తున్నప్పుడు శ్రీదేవి ఆయన దృష్టిలో పడింది. కానీ, అప్పటికి శ్రీదేవి వయసు 16 ఏళ్లు మాత్రమే. ఎన్టీఆర్ వయసు 54.
అదీకాక.. అప్పటికే శ్రీదేవి బాలనటిగా ఎన్టీఆర్ మనవరాలిగా చేసుంది. ఈ అంశంలో సందిగ్ధంలో ఉన్న రాఘవేంద్రరావు.. నేరుగా ఎన్టీఆర్ కే విషయం చెప్పారు. దానికి ఆయన పెద్దగా నవ్వి.. శ్రీదేవి వయసు 16 అయితే.. మాకు 18 ఏళ్లేగా అన్నారట! అలా.. అప్పుడు ఆ కాంబినేషన్ సెట్ అయిందంటారు రాఘవేంద్రరావు. ఆ తర్వాత ఎన్టీఆర్, శ్రీదేవి జోడీకి సూపర్ హిట్ జోడీగా పేరొచ్చింది.
విభిన్న పాత్రల రూపశిల్పి..
ఎన్టీఆర్.. అందాల కథానాయకుడిగా వెలిగిపోతున్న రోజుల్లోనే డీ గ్లామర్ పాత్రలు పోషించేందుకు కూడా ఏమాత్రం వెనకాడేవారు కాదు. ఇందుకు పెద్ద ఉదాహరణ.. రాజు-పేద సినిమా. అందులో.. నిరుపేదగా ఆయన నటన అద్భుతం. మురికి పట్టిన దేహం, చిరిగిపోయిన దుస్తులతో.. కుటుంబం గురించి ఏమాత్రం పట్టింపు లేని ఓ తాగుబోతులా ఆయన నటించిన విధానం.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే, కలసి ఉంటే కలదు సుఖం సినిమాలో వికలాంగుడిగా, చిరంజీవులు సినిమాలో గుడ్డివాడిగా ఆయన నటన అద్భుతం. వీటితో పాటు ఎన్టీఆర్.. టార్జాన్, సూపర్ మేన్ పాత్రలు కూడా పోషించి మెప్పించారు. రాజపుత్ర రహస్యం సినిమాలో టార్జాన్ గా నటించిన ఎన్టీఆర్.. సూపర్ మేన్ సినిమాలో ఆ పాత్రకు జీవం పోసి.. తెలుగు తెర సూపర్ మేన్ గా నిలిచారు.
Remembering Suryakantham : తెరపై గయ్యళి అయస్కాంతం.. తెరవెనుక మనస్కాంతం..
ఇలా చెప్పుకుంటూ పోతే.. ఆయన సృష్టించిన రికార్డులకు హద్దుండదు. ఇండస్ట్రీని మూడు దశాబ్దాలకు పైగా ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఎన్టీఆర్.. అనంతరం రాజకీయ కదనరంగంలోకి దూకి.. 9 నెలల్లోనే అధికార పగ్గాలు అందుకున్నారు. తెలుగు తల్లి పేరును, తెలుగు జాతి కీర్తిని విశ్వవిఖ్యాతం చేశారు. భాగ్యనగరాన్నే అయోధ్యలా మార్చి.. ఆంధ్రదేశంలో ‘తారక’ రామరాజ్యాన్ని స్థాపించారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి.. 8 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించారు. తెలుగు వాడి సంక్షేమానికి, అభ్యున్నతికి, తెలుగు భాష అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన ఎన్టీఆర్.. తెలుగు గడ్డపై చెరగని సంతకం చేశారు. తెలుగు అనే మూడక్షరాలు ఉన్నంత వరకు ఎన్టీఆర్ అనే మూడక్షరాలు నిలిచి ఉంటాయని ఆశిస్తూ..
తెలుగు జాతి కీర్తిని విశ్వవిఖ్యాతం చేశారు.. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి.. 8 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించారు. తెలుగు వాడి సంక్షేమానికి, అభ్యున్నతికి, తెలుగు భాష అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన ఎన్టీఆర్.. తెలుగు గడ్డపై చెరగని సంతకం చేశారు. తెలుగు అనే మూడక్షరాలు ఉన్నంత వరకు ఎన్టీఆర్ అనే మూడక్షరాలు నిత్యమై నిఖిలమై నిలచి వుంటాయి ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని వెండితెర వేల్పుకు నమో వాక్కాలు..